హైదరాబాద్ జూ కు దుబాయ్ ఎన్ఆర్ఐ హంసల బహుమతి

జంతువులపై ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు దుబాయ్ ఎన్ఆర్ఐ రాంజీ. జంతుప్రేమికుడి ప్రేమ నుంచి అడవిలో పులుల అద్భుతం వరకు...

Update: 2025-11-20 07:18 GMT
హైదరాబాద్ జూపార్కుకు దుబాయ్ ఎన్ఆర్ఐ తెల్లహంసల బహుమతి

ప్రకృతిని ప్రేమించే మనసు ఎక్కడ ఉన్నా అడవుల్ని, వన్యప్రాణుల్ని మరచిపోదు. దుబాయ్‌లో స్థిరపడినా హైదరాబాద్ జూపార్క్ జంతువులపై మమకారం తగ్గని జంతుప్రేమికుడు నారాయణ స్వామి రాంజీ ఉదారత ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో అమ్రాబాద్ అడవుల్లో పులుల గాండ్రింపులు వినిపిస్తూ యాత్రికులకు జీవితకాల అనుభూతిని అందించాయి.




 దుబాయ్ జంతుప్రేమికుడి ఉదారత

ఎన్ఆర్ఐ, జంతుప్రేమికుడైన నారాయణ స్వామి రాంజీ దుబాయ్ లో నివాసముంటున్నా హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని వన్యప్రాణులంటే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రాంజీ తండ్రి కేఏ నారాయణ స్వామి ఐపీఎస్ ఆఫీసరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తన తల్లిదండ్రులు మరణించడంతో వారి స్మారకార్థం జూపార్కులోని పలు జంతువులను 2010వ సంవత్సరం నుంచి వరుసగా దత్తత తీసుకుంటున్నారు. జూపార్కులోని మగ ఏనుగు, నీటి గుర్రం, ఖడ్గమృగం, నాలుగు నెమళ్లను రాంజీ దత్తత తీసుకొని వాటికయ్యే ఖర్చును విరాళంగా అందించారు.



 తెల్ల హంసల బహుమతి

హైదరాబాద్ నగరానికి చెందిన జంతుప్రేమికుడైన నారాయణ స్వామి రాంజీ బుధవారం రెండు తెల్ల హంసలను నెహ్రూ జంతుప్రదర్శనశాలకు బహుమతిగా అందించారు. తన తల్లిదండ్రులైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కే ఏ నారాయణ స్వామి దంపతుల స్మారకార్థం అందించిన రెండు తెల్ల హంసలను వైల్డ్ లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎలుసింగ్ మేరు ఎన్ క్లోజరులోకి విడుదల చేశారు. జంతుప్రేమికుడైన రాంజీ 2010వ సంవత్సరం నుంచి జూపార్కులో పలు వన్యప్రాణులను దత్తత తీసుకుంటున్నారు. గతంలో రాంజీ నాలుగు నల్ల హంసలను కూడా జూకు బహుమతిగా అందించారని తెలంగాణ జూ డైరెక్టర్ సునీల్ ఎస్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ జూపార్కులో 199 జాతుల పక్షులు, రెండువేలకు పైగా జంతువులున్నాయని ఆయన వివరించారు.



 పులుల గాండ్రింపులు చూశాం...

ఎటు చూసినా పచ్చని ఎతైన చెట్లు...పచ్చిక బయళ్లు...దట్టమైన అడవులు...మన్ననూరు జంగిల్ రిసార్టులో విహార యాత్రకు వెళ్లిన యాత్రికులు ఫారెస్ట్ జీపులో సఫారీ యాత్రకు బుధవారం వెళ్లిన యాత్రికులకు పులుల గాండ్రింపులు వినిపించాయి.జీపులో ఇంకా కొంచెం దూరం వెళితే అడవుల్లో రెండు పులులు కనిపించాయి.దీంతో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని మన్ననూరు అడవుల్లో విహార యాత్రకు వెళ్లిన యాత్రికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పులుల సంచారాన్ని చూసిన వన్యప్రాణుల ప్రియులు వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తాము అడవిలో గాండ్రిస్టున్న పులులను చూశామని వన్యప్రాణి ప్రేమికులు చెప్పారు.

ప్రతి క్షణం జీవితకాల జ్ఞాపకం

అమ్రాబాద్ అభయారణ్యంలో 36 పులులు ఉండటంతో వాటితోపాటు వన్యప్రాణులు, అడవి అందాలను తిలకించాలనుకుంటే మన్ననూరు జంగిల్ రిసార్ట్ ను సందర్శించాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ కోరారు. అమ్రాబాద్ అడవిలో ప్రతి క్షణం జీవితకాల జ్ఞాపకంగా మారుతుందని ఆయన చెప్పారు. అటవీ ట్రాక్‌లు,గలగల నీటితో ప్రవహించే వాగులు, గడ్డి భూములు, ఎలుగుబంట్లు, జింకలు, పులులను చూడాలనుకుంటే మన్ననూరు జంగిల్ రిసార్టును సందర్శించాలని డీఎఫ్ఓ సూచించారు.



 మనిషి హృదయంలో వన్యప్రాణులంటే ఉన్న దయ, ప్రకృతిలోని వైభవం...ఇవీ రెండూ కలిసి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే అనుభూతులను సృష్టిస్తాయి. రాంజీ వంటి జంతుప్రేమికుల ఉదారత జూపార్క్ జంతువుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. అడవిలో పులులు ప్రత్యక్షం కావడం ప్రకృతితో మన బంధాన్ని మరింత బలపరుస్తుంది. మనం అడవిని, వన్యప్రాణులను కాపాడితేనే ఈ ప్రకృతి అందాలు, ఈ జీవాలు రాబోయే తరాలకు చేరుతాయి.



Tags:    

Similar News