గ్రేటర్ నోయిడా రింగ్ మధ్యలో మరోసారి భారత త్రివర్ణ పతాకం ఎగరేసింది. పదునైన పంచులు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, గెలుపు కోసం రగిలే జిజ్ఞాస...ఈ మూడింటి సమ్మిళిత రూపమే నిఖత్ జరీన్. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి, తెలంగాణ మరోసారి గర్వపడేలా చేసింది.భారత బాక్సింగ్‌కు కొత్త అధ్యాయాన్ని రాసింది.
గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్(World Boxing Cup Finals)51 కేజీల విభాగంలో తెలంగాణ కు చెందిన స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (nikhat zareen)స్వర్ణ పతకాన్ని సాధించింది. తెలంగాణ డీఎస్పీ అయిన నిఖత్ మహిళల విభాగం ఫైనల్ లో 5-0 తో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్ ను ఓడించింది. ఈమె ప్రపంచ బాక్సింగ్ కప్‌లో భారతదేశానికి ఏడు స్వర్ణాలను అందించింది.రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఏకగ్రీవ విజయాన్ని నమోదు చేసింది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత ఆమె మొదటి స్వర్ణాన్ని గెలుచుకుంది.
నిఖత్ జరీన్‌కు సీఎం ప్రశంసలు
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి(TelanganaCMO) ఎ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 51 కిలోల విభాగంలో నిఖత్ అసాధారణ ప్రదర్శనను సీఎం ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై నిఖత్ మరోసారి దేశానికి అపారమైన గర్వకారణాన్ని తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఆమె సాధించిన అద్భుతమైన విజయం యువత, ఔత్సాహిక క్రీడాకారులు అచంచలమైన దృఢ సంకల్పం, విశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించడానికి ప్రేరణగా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.నిఖత్ జరీన్ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్ఎండీసీ బ్రాండ్ అంబాసిడర్
బాక్సింగ్ లో అంకితభావంతో ఆధిపత్యం సాధించిన నిఖత్ జరీన్ ను నేషనల్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ సిడర్ గా నియమించింది. తెలంగాణలో డీఎస్పీగా పనిచేస్తున్న నిఖత్ బాక్సింగ్ క్రీడలో వరుస పతకాలతో దూసుకుపోతున్నారు. రాబోయే అంతర్జాతీయ ఒలింపిక్స్ కోసం ఎదురు చూస్తున్నానని నిఖత్ చెప్పారు.
నిఖత్ జరీన్ బాక్సింగ్ రింగ్‌లో ప్రతీ పంచ్ ఆమె కష్టానికి, క్రమశిక్షణకు, దృఢసంకల్పానికి ప్రతీకగా నిలిచింది. ఒలింపిక్స్ వైపు దూసుకెళ్తున్న ఈ తెలంగాణ బాక్సర్ భవిష్యత్‌లో భారత్‌కు మరిన్ని చారిత్రక విజయాలు అందిస్తుందనే నమ్మకం ఏర్పడింది. నేషనల్ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్న నిఖత్, భారత యువతకు ప్రేరణగా, భారత బాక్సింగ్‌కు మరింత బలంగా నిలుస్తోంది.