బాటసారిగా వచ్చాను.. వెళ్ళిపోతున్నానులే.. !

పదిరోజుల క్రితం ఈ భాగ్యనగరానికి బాటసారిగా వచ్చాను. ఈ రోజు తిరుపతి గూటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నగరంలో ఈ పదిరోజులూ ఎక్కడెక్కడో తిరిగాను.

Update: 2024-05-28 00:40 GMT

రాఘవ శర్మ కు కానుక ను ఇస్తున్న డాక్టర్ గీతాంజలి. పక్కన రాఘవ శర్మ చెల్లెలు డాక్టర్ గాయత్రి


పదిరోజుల క్రితం ఈ భాగ్యనగరానికి బాటసారిగా వచ్చాను. ఈ రోజు తిరుపతి గూటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నగరంలో ఈ పదిరోజులూ ఎక్కడెక్కడో తిరిగాను. ఎంతో మంది మిత్రులను కలిశాను. కొందరిని కలవలేకపోయాను. పోతూ పోతూ వాటిని నెమరేసుకుంటే, మదిలో అవి వెలుగు నీడల్లా నిలిచిపోయాయి.

హైదరాబాద్ నాకు కొత్త కాదు. హైదరాబాదుకూ నేను కొత్త కాదు. యాభై మూడేళ్ళ క్రితం తొలిసారిగా ఈ నగరానికొచ్చాను. వనపర్తిలో టెన్త్ పరీక్షలు రాసి, దసరాబుల్లోడు సినిమా చూట్టానికి ఇక్కడ మా అక్క ఇంటికి వచ్చాను. భిన్న సంస్కృతుల ఈ నగరాన్ని చూసి మనసు పారేసుకున్నాను. అప్పుడప్పుడూ వచ్చి దీన్ని పలకరించిపోతూనే ఉన్నాను.

ఈ మహానగరానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ధనిక పేదా తారతమ్యమూ లేదు. ఎందరిని అక్కున చేర్చుకుందో కదా ! మా నలుగురు మేనల్లుళ్ళను కూడా! అందుకునే ఇప్పడూ వచ్చాను. హైదరాబాదు వస్తే నాకు కాలు నిలవదని నా పైన ఆరోపణ.

సీనియర్ జర్నలిస్ట్ పున్నా కృష్ణ మూర్తి వాక్యంలో మార్మికతను, వచనంలో తాత్వికతను నింపుకున్న మంచి రచయిత. వారికి ఫోన్ చేస్తే, ‘‘నేనే మీ ఇంటికి వస్తున్నా’’ అన్నారు. కాసేపట్లో మా ఇంట్లో వాలిపోయారు. పున్నా కృష్ణ మూర్తి తిరుపతి వార్త లో పని చేస్తుండగా తాను తీసిన ఫోటోల తో కలిపి ‘తిరుమల పద చిత్రాలు’ అన్న అద్భుత మైన పుస్తకాన్ని రాసి చాలా అందంగా అచ్చు వేశారు. అలాంటి పున్నా కృష్ణ మూర్తి కి నాకు మధ్య చాలా ఆప్యాయంగా మాటా మంతి జరిగింది. మా మధ్య అనేక పాత విషయాల తో పాటు వర్తమాన సంగతులు వచ్చాయి. మూడున్నర దశాబ్దాల స్నేహం మాది.

మూడు దశాబ్దాల క్రితం ‘వర్తమానం’లో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన పీకాక్ క్లాసిక్స్ పబ్లిషర్, ఎడిటర్ గాంధీ ఇంటికి వెళ్ళాను. గాంధీ చాలా సీనియర్ జర్నలిస్ట్, మంచి రచయిత. నన్ను చూడగానే ఆయనకు ప్రాణం లేచొచ్చింది. గంటలో ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో!

తాను ఎప్పుడు ఫోన్ చేసినా ‘హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారు?’ అంటారు. నేనెప్పుడ ఫోన్ చేసినా ‘హైదరాబాద్ వచ్చారా? ఎప్పటి వరకు ఉంటారు? ఎప్పుడు కలుద్దాం?’ అనే వారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. బిఎస్ ఎన్ ఎల్ పుణ్యమాని ఆయన్ని కలవలేకపోయాను.

హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరమా! ఇక్కడ చాలా చోట్ల బిఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ లేదు. నాది బి ఎస్ ఎన్ ఎల్ సిమ్. మా చెల్లెలి ఇంట్లో కూడా పనిచేయదు. హరగోపాల్ గారింట్లో కూడా బిఎస్ ఎన్ ఎల్ పనిచేయదు. తిరుపతిలో ఎక్కడికెళ్ళినా, చివరికి శేషాచలం కొండల్లో కెళ్ళినా చాలా చోట్ల బిఎస్ ఎన్ ఎల్ పనిచేస్తుంది.

బిఎన్ ఎల్ ను ప్రైవేటు తిమింగలాలు మింగేశాయి. నాకు చాలా కోపమొచ్చింది. హైదరాబాదీయలుపైన కూడా అలిగాను. కంప్లైంట్ ఎందుకు చేయరని. ఏం చేస్తారు పాపం వారి కోపం పెదవికి చేటు. జియోనో గియోనో మార్చేసుకో అని మా మేనల్లుడు సలహా ఇచ్చాడు. మార్చను గాక మార్చనని చెప్పేశా. బిఎస్ ఎన్ ఎల్ పబ్లిక్ రంగ సంస్థ.

తిరుపతిలో బయలు దేరే ముందే హైదరాబాద్ లో ప్రముఖ Ortho సర్జన్ , సాహితీ వేత్త డాక్టర్ జతిన్ కుమార్ గారికి ఫోన్ చేశాను. 'మా ఇంటికి తప్పకుండా రండి' అన్నారు. మా మేనల్లుడు బాలానగర్ లో వాళ్ళ ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయాడు. నాలుగున్నర దశాబ్దాల క్రితం, జనసాహితిలో ఉన్నప్పుటి నుంచి వారితో పరిచయం. వాళ్ళింట్లోనే భోజనం చేశాను.

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి గీతాంజలి గారితో ఇటీవలే పరిచయం. ఆ చిరు పరిచయంతోనే నేను రాసిన మా ‘అమ్మ ముచ్చట్లు’ కు ముందు మాట రాసి దానికొక ఔన్నత్యాన్ని తీసుకొచ్చారు. ‘‘మీ పుస్తకానికి గీతాంజలి గారి ముందు మాట ‘అర్హతాపత్రం’ ’’ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ రాజు గారు.

‘‘హైదరాబాద్ వస్తున్నాను’’ అన్నాను గీతాంజలి గారితో. ‘‘మా ఇంటికి తప్పకుండా రావాలి’’ అన్నారు. నిజాం పేటలో మా చెల్లెళ్ళ ఇంట్లో దిగాను. వనస్థలీపురం రాకపోతే మా అక్క అలుగుతుంది. అదొక మూల, ఇదొక మూల. మా అక్క అలక తీర్చడం కోసమే వచ్చినప్పుడల్లా వనస్థలీపురం వెళ్ళి వస్తాను.

వనస్థలీపురం వెళ్ళే ముందే ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది. మర్నాడు గీతాంజలి గారిని కలవడానికి నేను, మా చెల్లెలు డాక్టర్ ఏ. గాయత్రి గుర్రంగూడ వెళ్ళాం. చెట్ల మధ్య ఎంత అందమైన ఇల్లు ! గీతాంజలి గారి కవిత్వానికి ఆ ఇల్లు, ఇంటి వాతావరణం ఎంత ప్రేరణో ! వారింట్లో మంచి విందు భోజనం. గీతాంజలి గారు, శ్రీధర్ దేశ్ పాండే గారు దంపతులను చూడడం అదే తొలి సారి. రెండు గంటల పాటు మామధ్య సంభాషణ జరిగింది. పెరట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలను, చెట్లను చూపించారు. వారింట్లో రెండు గంటలు, రెండు క్షణాల్లో కరిగిపోయింది.

నాగోలులో ఉండే సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు గారింటికి బయలుదేరాను. ఎల్ .బి. నగర్ దగ్గర జతిన్ గారు కూడా నాతో చేరారు. నాగరాజు గారింట్లో రెండు గంటలు పిచ్చాపాటి. నాగరాజుగారితో పరిచయం ఈ నాటిదా? నలభై ఏళ్ళ క్రితం తిరుపతిలో చదువుకున్నప్పటిది.

‘‘రాఘవ గారు, ఎక్కడా తిరక్కండి. ఆరోగ్యం జాగ్రత్త. నీళ్ళు ఎక్కువ తాగండి. ఓ ఆర్ ఎస్ పాకెట్లు పక్కన పెట్టుకోండి’’ అంటూ గీతాంజలిగారు తరుచూ హెచ్చరిస్తూనే ఉన్నారు మా అమ్మలాగా. డాక్టర్ కదా. ‘‘అలాగేనండి. మీ ఆదేశాలను శిరసావహిస్తా’’ అన్నాను. పిల్లలు అమ్మ మాటను అప్పుడప్పుడు ఎందుకు లెక్క చేయరో చెప్పండి !? ముందు సరే అంటారు. తరువాత టలాయిస్తారు.

శనివారం వనపర్తి వెళ్ళాను. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న మా అత్తయ్యను పలకరించడానికి. వనపర్తిలో నా క్లాస్ మేట్, సీనియర్ జర్నలిస్ట్ సిసి రెడ్డి నాతోనే ఉన్నారు. ఇద్దరం కలిసి విశ్రాంత ఉపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళాం. గంటసేపు సంభాషణలో కొన్ని చారిత్రక విషయాలు బైటికొచ్చాయి.

‘‘తెలంగాణా ఉద్యమం ఊపందుకోక ముందు మా ఇంట్లో ఇక్కడే ఒక సమావేశం జరిగింది’’ అంటూ ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు వెంకటేశ్వర్లు. ‘‘ఈ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ , ప్రొఫెసర్ కోదండరాం , ప్రొఫెసర్ హరగోపాల్ , కేసీ ఆర్, రాఘవాచారి, ఇంకా కొందరు పాల్గొ న్నారు.

ఈడనే తిన్నరు, ఈడనే పండి నారు. తెలంగాణా ఉద్యమం గురించి చర్చ జరిగింది. ‘ఎట్లైన గాని తెలంగాణా తీస్కరావాలె’ అన్నరు జైశంకర్ సార్. ‘ఒట్టి తెంగాణా తెస్తే ఏం ప్రయోజనం? ప్రజాస్వామ్య తెలంగాణా రావాలె’ అన్నరు రాఘవాచారి . ‘అసలు తెంగాణా అంటూ రానీ. తరువాత దాన్ని ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకుందాం’ అన్నరు జయశంకర్ సార్ ’’ అంటూ ఆ నాటి విషయాలను వివరించారు. ఈ సమావేశం గురించి చెపితే ‘ఓ గిట్లాంటి సమావేశాలు చాలనే జరిగాయి’ అన్నారు రాఘవాచారి గారు ఆతరువాత.

నేను, మా చెల్లెలు, సీసి రెడ్డి కలిసి వనపర్తి ప్యాలెస్ చుట్టూ తిరిగి వచ్చాం. అరవై అయిదేళ్ళ క్రితం మేం ఉన్న ఇంటిని చూశాం. పూర్తి శిథిలావస్తలో ఉంది. దాని ఎదురుగా మేం ఈత కొట్టిన మోటబావి పూర్తిగా ఎండిపోయింది. వాటిని చూస్తుంటే మనసు ఉసూరుమనిపించింది.

‘‘జూన్ 2 నాటికి తెలంగాణా ఏర్పడి పదేళ్ళు పూర్తి అవుతోంది. హరగోపాగారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది’’ అన్నారు నాగరాజు గారు. గురువారం(ఏప్రిల్ 22) సాయంత్రం హరగోపాల్ గారింటికి వెళ్ళాను. ఇంటర్వ్యూ మొదలు పెట్టే సమయానికి అందెశ్రీ వచ్చారు.

అందెశ్రీ వచ్చీ రాగానే ఒంగి హరగోపాల్ గారి కాళ్ళకు, వనమాలి గారి కాళ్ళకు దణ్ణం పెట్టబోయారు. ఇద్దరూ వారించారు. అందెశ్రీ గొప్ప కవి, గాయకుడు. ఈ నాటి వారా? నేను వర్తమానంలో చేస్తున్నప్పుడు 1995లో మా ఆఫీసుకు వచ్చేవారు. ఆరోజుల్లో అతను తాపీ మేస్త్రీ. అందె శ్రీ తొలి కవితా సంకలనానికి సీనియర్ జర్నలిస్ట్ జి. కృష్ణ ముందు మాట రాస్తూ ‘‘చదువు రాని వాడు రాసే కవిత్వానికి కవిత్వం రాని వాడు రాసే ముందుమాట ఇది’’ అన్నారు.

ఆ కవితా సంకలనం ఆవిష్కరణ సభలో సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘‘ముప్పై ఏళ్ళ క్రితం ‘చదువు రాని వాడవని దిగులు చెందకు’ అన్న పాట అందె శ్రీ కోసమే రాసినట్టున్నాను’’ అన్నారు. ఈ మాటలను గుర్తు చేసేసరికి ‘‘ముప్పై ఏళ్ళ నాటి మాట మంచిగా గుర్తు పెట్టుకున్నారే’’ అంటూ అందెశ్రీ సంబరపడిపోయారు. హరగోపాల్ గారు ఆనంద పడిపోయారు.

అందె శ్రీ వెళ్ళిపోయాక హరగోపాల్ గారితో ఇంటర్వ్యూ మొదలుపెట్టాను. ఆరోగ్యం ఇబ్బంది పెడుతూనే ఉంది. అయిపోయాక రోడ్డుపైకి వచ్చాను. వనమాలి గారు అప్పుడే కారులోంచి నా ముందు దిగి, ‘‘మిమ్మల్ని ఎక్కడ దిగబెట్టమంటే అక్కడ దిగబెడతాడు’’ అంటూ డ్రైవర్ కు ఆదేశాలు జారీ చేశారు. మెట్రోవరకు vari కారులో వెళ్లాను.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా. హైదరాబాదులో ఎన్ని చోట్లకు తిరిగినా మెట్రోలోనే ప్రయాణం. నిలుచుని ప్రయాణం చేసింది లేదు. నేను నిలుచుంటే సీనియర్ సిటిజన్లకు కేటాయించకపోయిన సీట్లలో కూడా యువకులు లేచి నాకు సీటిచ్చారు. ఒక సారి ఖాళీగా ఉంది కదా అని మహిళల సీట్లలో కూర్చున్నాను. తరువాత చాలా మంది మహిళలు ఎక్కారు.

నేను లేచి వారికి సీటిస్తుంటే, ‘‘మీరు సీనియర్ సిటిజన్ కదా పరవాలేదు కూర్చోండి’’ అన్నారు ఇద్దరు అమ్మాయిలు. సీట్లో నుంచి నన్ను లేవనివ్వలేదు. అలా రెండు సార్లు జరిగింది. ఈ అమ్మా యిలు ఎంత మంచి వాళ్ళు! కూర్చున్నంత సేపు నాకు ఇబ్బందిగానే ఉంది మహిళలకు కేటాయించిన సీట్లో కూర్చున్నానని.

నేను హైదరాబాద్ వచ్చానని తెలిసి మరో సీనియర్ జర్నలిస్ట్ రమణాచారి గారు ‘‘అల్వాల్ లో మా ఇంటికి తప్పకుండా రావాలి’’ అన్నారు. చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూ, చెణుకులు విసురుతూ ఉంటారు. తనపైన తానే జోకులేసుకుంటారు. మూడు దశాబ్దల క్రితం వార్తలో నా సహ జర్నలిస్ట్. ఇంట్లో నా ఆరోగ్య పరిస్థితి చెప్పాను. తానే అల్వాల్ నుంచి వచ్చారు. రమణాచారి గారితో మాట్లాడుతుంటే కాలం తెలియ లేదు!

తిరుగు ప్రయాణానికి సమయం ఆసన్న మవుతోంది. సోమవారమే మా ప్రయాణం. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి గారు హైదరాబాదులోనే ఉన్నారు. వారిల్లు చాలా దూరం. ‘‘సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర కలుద్దాం’’ అన్నారు. మెట్రోలో అక్కడికెళ్ళాను. కాస్త ఆలస్యంగా రాఘవాచారి గారు వచ్చారు.

అప్పటికే కవి ఉదయ మిత్ర, రచయితలు వెంకటేశ్వర్లు , స్వామి సుందరయ్య విజ్ఞాన కేంద్రం క్యాంటిన్ వద్ద ఉన్నారు. వారు ముగ్గురూ వనపర్తి ఒడిలో పుస్తకావిష్కరణ సభలో పరిచయం అయ్యారు. ఆ నాటి సభను గుర్తు చేసుకున్నారు. ఈ లోపల రాఘవాచారి గారు వచ్చారు.

రాఘవాచారి గారు, నేను విడిగా కూర్చుని దేశ పరిస్థితుల గురించి, ముఖ్యంగా తెలంగాణా ఆర్థిక పరిస్థితుల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. రాఘవాచారి గారు, మరొక మిత్రుడు, నేను కలిసి నారాయణ గూడ లోని తాజ్ హోటల్ కు వెళ్ళి భోజనం చేశాం. హోటళ్ళలో భోజనం చేసి చాలా ఏళ్లైంది. ఏమైనా అవుతుందేమోనని భయపడ్డా.

రాఘవాచారి గారు నవ్వుతూ ఒక మాటన్నారు. ‘‘హైదరాబాదులో మీరు ఎవరెవరిని కలిశారో రాయచ్చు కదా’’ అని. ఆ ప్రేరణతోనే ఇదంతా. సాయంత్రం రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి తిరుగు ప్రయాణం. ఈ పదిరోజుల నా తిరుగుడును ఒక్క సారి ఇదిగో ఇలా సింహావలోకనం.

‘‘ప్రియా.. నీ నగరానికి నేనొక బాటసారిలా మాత్రమే వచ్చాను ! ఒక్కసారి నిన్ను కలవనీ ! నిజానికి నా గమ్యం ఎక్కడనో..నా గూడు ఏదో నాకే తెలియదు..దారి తెలియని పథికుణ్ణి కదా మరి ! నీ కోసం నా కళ్ళలో మిణుగురులను దాచి ఉంచాను. నా కనురెప్పల మీద కన్నీటి బిందువులను సర్దిపెట్టాను. నా ఈ కళ్ళకు ఏడ్చే ఆజ్ఞ ఇవ్వవా ! నీ నగరంలో నేనేమీ ఉండిపోవడానికి రాలేదులే. బాటసారిగా మాత్రమే వచ్చాను. బాటసారిని కదా ! నిన్ను విడిచి వెళ్ళిపోతానులే !"

(ఖైదర్ ఉల్ జాఫ్రీ గజల్ లోని కొన్ని చరణాలు : అనుసృజన గీతాంజలి)

Tags:    

Similar News