'సినీనటి సమంత చేసుకున్న పెళ్లి శాస్త్రోక్తం కాదు'

"హిందూ శాస్త్రాలలోని 8 రకాల పెళ్లిళ్లలో భూతశుద్ధి వివాహం లేదు"

Update: 2025-12-04 04:34 GMT
ప్రముఖ సినీనటి సమంత ఇటీవల కోయంబత్తూరులో భూతశుద్ధి పద్ధతిన వివాహం చేసుకున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఆమె తన ప్రియుడు రాజ్ నిడుమోరుతో జత కట్టారు. గత సోమవారం తెల్లవారుజామున భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. ఈమేరకు సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

 ఈ ఫోటోల్లో పూజ క్రతువు, లింగ భైరవి దేవి సమక్షంలో ఆమె వేలికి రాజ్ నిడిమోరు ఉంగరం తొడుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఆమె మెడలో మంగళసూత్రానికి బదులుగా దేవి పెండెంట్ ఉన్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తుంది.

చేతికి తొడిగిన ప్రత్యేక ఉంగరం, ఆమె మెడలో నల్ల పూసలతో కూర్చిన దేవి పెండెంట్ కనిపించేలా ఒక ఫోటోను సమంత షేర్ చేశారు.
ఈ వివాహం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవి ఆలయంలో జరిగింది.
అప్పటి వరకు వివాహ వ్యవస్థలో ఈ భూతశుద్ధి పద్ధతి ఒకటున్నట్టు చాలామందికి తెలియదు. ఇప్పుడు బాగా విస్చృత ప్రచారంలోకి వచ్చింది. అయితే 'ఈ భూతశుద్ధి వివాహం హిందూ శాస్త్రోక్త వివాహం కాదు' కాదు అంటున్నారు వేద–ధర్మ శాస్త్ర నిపుణులు. ఈమేరకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధన మండలి) గవర్నింగ్ బాడీ మాజీ సభ్యులు వేణుగోపాల్ బాదరవాడ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆయన ఏమంటారంటే..
ఇటీవల కొందరి ప్రముఖుల పెళ్లి “భూతశుద్ధి వివాహం” పేరుతో జరపడంతో సామాజిక వేదికలపై భారీ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వేద, ధర్మశాస్త్ర నిపుణులు, ఆచార్యులు ఇచ్చిన స్పష్టమైన వివరణ ఇలా ఉంది:
1. హిందూ శాస్త్రాలలో ‘భూతశుద్ధి వివాహం’ అనే పద్ధతి లేదు
వేదాలు, గృహ్యసూత్రాలు, మనుస్మృతి, ధర్మశాస్త్రాలు — ఏ గ్రంథంలోనూ “భూతశుద్ధి వివాహం” అనే వివాహ విధానం లేదు.
మనుస్మృతి ప్రకారం వివాహాలు కేవలం 8:
* బ్రాహ్మం
* దైవం
* ఆర్శం
* ప్రాజాపత్యం
* అసురం
* గాంధర్వం
* రాక్షసం
* పైశాచం
తొమ్మిదో వివాహం అనే ఆచారం శాస్త్రాలలో ఎక్కడా లేదు.
2. భూతశుద్ధి — యోగిక శుద్ధి ప్రక్రియ మాత్రమే, వివాహం కాదు
భూతశుద్ధి అనేది శరీరంలోని పంచభూతాలను సమతుల్యం చేసే యోగిక అంతర్ముఖ శుద్ధి ప్రక్రియ.
ఇది వివాహ సంస్కారంగా ఎక్కడా పేర్కొనబడలేదు.
వేద–గృహ్య సూత్రాలలో దీనికి ఒక్క శ్లోకం ఆధారం కూడా లేదు.
3. ఇది ఆధునిక సంస్థ ప్రవేశపెట్టిన వివాహ రూపం
ఈరోజు కనిపించే “భూత శుద్ధి వివాహం” అనేది ఆధునిక సంస్థలు రూపొందించిన ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే. ప్రాచీన వేదిక వివాహ సంప్రదాయంతో సంబంధం లేదు.
ఇందులో ఏమేమి లేవంటే...

-అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞలు లేవు
-కన్యాదానం లేదు
-పాణిగ్రహణం లేదు
-సప్తపది లేదు
అంటే ఇది శాస్త్రోక్త వివాహ కర్మలన్నింటికీ భిన్నం.
4. వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎంపిక
ప్రతి వ్యక్తికి తన ఇష్టానుసారం ఆధ్యాత్మిక రీతిలో వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంది.
కానీ ఆధునిక పద్ధతులను “హిందూ శాస్త్రోక్త వివాహం”గా ప్రచారం చేయడం:
* సంస్కృతి గురించి అపోహలు
* యువతలో గందరగోళం
* శాస్త్రపరమైన తప్పుబోధనలు కలుగజేస్తుంది.
అందువల్ల భూతశుద్ధి వివాహం హిందూ శాస్త్రోక్త వివాహం కాదు. ఆధునిక యోగిక కార్యక్రమం మాత్రమే. ప్రజల్లో గందరగోళం రాకుండా మీడియా వార్తలు రాయాలని కోరారు.వ్యక్తిగత ఆచారం, వేద–ధర్మ శాస్త్ర వివాహం మధ్య స్పష్టమైన భేదాన్ని చూపించడం అవసరం అని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News