అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..తెలంగాణలో రెండు కేసుల నమోదు

కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన మొదటి రోజే హైదరాబాద్‌లో బీఎన్ఎస్ చట్టం కింద రెండు కేసులు నమోదయ్యాయి.మొదటి డిజిటల్ ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేశారు.

Update: 2024-07-02 08:35 GMT

దేశంలో పాత క్రిమినల్ చట్టాలకు పాతరేసి ఈ ఏడాది జూన్ 1వతేదీ నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సీఆర్ పీసీ స్థానంలో భారతీయ నాగ్రిక్ సురక్షా సంహిత( బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్యా అధినియం (బీఎస్ఏ) పేరిట కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి.

- హైదరాబాద్‌ నగరంలో కొత్త క్రిమినల్ చట్టాల కింద రెండు కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ చట్టం ప్రకారం చార్మినార్, రాజేంద్రనగర్ పోలీసులు రెండు కేసులు పెట్టారు. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం చార్మినార్ పోలీసులు డిజిటల్ సంతకంతో తమ మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలంగాణ డీజీపీ రవి గుప్తా చెప్పారు.
నంబర్ ప్లేట్ లేని బైక్ పై ప్రయాణిస్తున్న వారిపై కేసు
చార్మినార్ సమీపంలోని గుల్జార్‌ హౌజ్‌ సమీపంలో నంబర్‌ ప్లేట్‌ లేకుండా బైక్‌పై ఇద్దరు ప్రయాణికులు వెళుతుండగా చార్మినార్ పోలీసులు పట్టుకున్నారు. వాహనం సీజ్ చేసి, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 281, బీఎన్ఎస్ 30 (ఎ)లో సెక్షన్ 173, 176 కింద మొట్ట మొదటి డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నంబరు 144 తో నమోదు చేశారని డీజీపీ గుప్తా తెలిపారు. బైక్ రైడర్లకు ఎంవీ చట్టంలోని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద డిజిటల్ నోటీసులు అందజేసినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు.

గతంలో జరిమానాతో సరి
గతంలో ఐపీసీ 281 చట్టం ప్రకారం నంబరు ప్లేటు లేని బైక్ పై వెళితే రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించేవారు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనకు రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చని చార్మినార్ శాంతిభద్రతల ఎస్ఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని ఎస్‌ఐ తెలిపారు.

ర్యాష్ డ్రైవింగుపై రెండో కేసు
బీఎన్ఎస్ కొత్త చట్టం కింద రెండవ కేసును రాజేంద్రనగర్ పోలీసులు నమోదు చేశారు. 2024వ సంవత్సరంలో 637 నంబర్ గల ఎఫ్ఐఆర్ 106 బీఎన్ఎస్ చట్టం ప్రకారం ర్యాష్, నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల సంభవించిన మరణానికి సంబంధించినది. ఇంతకు ముందు ఇలాంటి కేసును ఐపీసీ 304(ఏ) కింద బుక్ చేసేవారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నం.295 వద్ద వేగంగా వస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో బాధితుడు సాయి గణేష్ (25) అనే వ్యాపారవేత్త మరణించాడు. తాము ఐపీసీ 304 (ఎ)కి బదులుగా కొత్త బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 106 కింద కేసు బుక్ చేశామని రాజేంద్రనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో చెప్పారు.

కొత్త చట్టాల్లో సెక్షన్లు ఎన్ని ఉన్నాయంటే...
ఐపీసీలోని 511 సెక్షన్‌లుండగా, ప్రస్థుత బీఎన్ఎస్ చట్టంలో 358 సెక్షన్‌లు ఉన్నాయి. సంహితలో 20కి పైగా కొత్త నేరాల సెక్షన్లు జోడించారు. జైలు శిక్షలను 33 నేరాలకు పెంచారు. 83 నేరాల్లో జరిమానా మొత్తాన్ని పెంచారు. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టినట్లు సీనియర్ న్యాయవాది ఎం శ్రీనివాస్ తెలిపారు.కొత్త నిబంధన ఆరు నేరాలకు జరిమానాగా సమాజ సేవను ప్రవేశపెట్టారని శ్రీనివాస్ వివరించారు.

కొత్త క్రిమినల్ చట్టాలపై పోస్టర్ల విడుదల
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లను విడుదల చేశారు.ఈ కొత్త చట్టాల గురించి అవగాహన ప్రచారంలో భాగంగా ఈ పోస్టర్లను పోలీసు అధికారులు ప్రదర్శించారు. కొత్త చట్టాల గురించి పౌరులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. డీజీపీ స్టాండర్డ్ ఆపరేటింగ్‌పై సమగ్ర బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు.

కొత్త చట్టాలపై ప్రొసీజర్ మాన్యువల్
కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీసు అధికారుల కోసం ప్రొసీజర్ మాన్యువల్ అందించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు శిఖా గోయెల్, కల్మేశ్వర్, శింగేనవర్,రితిరాజ్,వి.వి.శ్రీనివాసరావు,మహేష్ భగవత్,సుధీర్ బాబు పాల్గొన్నారు.ఈ కొత్త చట్టాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులందరూ శిక్షణ పొందారని డీజీపీ తెలిపారు

సమర్థవంతమైన నేర న్యాయ వ్యవస్థ కోసమే ఈ చట్టాలు
కొత్త క్రిమినల్ చట్టాలు చాలా ఆసక్తిగా ఉన్నాయని తెలంగాణ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ అన్నారు.మాబ్-లించింగ్ వంటి నేరాలను కూడా తీవ్రమైన నేరాలుగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ మాట్లాడుతూ మారిన నేర పరిస్థితులకు అనుగుణంగా సమర్థవంతమైన నేర న్యాయ వ్యవస్థ కోసం మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేశారన్నారు. ఐపీసీ లాగా బీఎన్‌ఎస్ కింద దేశద్రోహం నేరం కాదని జస్టిస్ సురేందర్ పేర్కొన్నారు.

హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో శిక్షల పెంపు
48 శాతం హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మరణాలు సంభవించాయని, ఈ ముప్పును నియంత్రించేందుకు కొత్త చట్టాల ప్రకారం అలాంటి కేసుల్లో శిక్షలను పెంచామని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్  చెప్పారు. నేరస్థుడు పోలీసులకు సమాచారం అందించి బాధితురాలిని చికిత్స కోసం తీసుకెళ్తే ఇలాంటి కేసుల్లో శిక్ష తగ్గుతుందని చెప్పారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలను తీవ్రంగా పరిగణించాయని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News