అమిత్ షాతో భేటీ తర్వాత వైరలయిన EPS వీడియో..
15 నిముషాల ప్రైవేట్ మీట్‌పై తమిళనాట చర్చ..;
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అనంతరం అన్నాడీఎంకే(AIADMK) చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి(Edappadi K Palaniswami) తన కారులో ముఖం దాచుకుని వెళ్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. 37 సెకండ్ల వీడియోను ఆధారంగా చేసుకుని మీడియాలో వస్తున్న భిన్న కథనాలపై AIADMK ఐటీ విభాగం సమాధానమిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, అధికార DMKకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు ఆ వీడియో క్లిప్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చింది.
ఇంతకు ఏం జరిగింది?
ఎడప్పాడి కె పళనిస్వామి(EPS) మంగళవారం (సెప్టెంబర్ 16న) ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సీనియర్లు ఎస్పీ వేలుమణి, కేపీ మునుసామి, సీవీఈ షణ్ముగం, ఎం తంబిదురైతో కలిసి అమిత్ షాను కలిశారు. తమిళనాడుకు సంబంధించిన డిమాండ్లు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై షాతో 45 నిమిషాలు మాట్లాడారు. తర్వాత సీనియర్లంతా బయటకు వెళ్లిపోయారు. ఈపీఎస్, షా మాత్రమే 15 నిమిషాల పాటు ప్రైవేట్‌గా సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సంస్థలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. తన కారు షా నివాసం నుంచి బయలుదేరుతుండగా ఈపీఎస్ తన ముఖాన్ని తెల్లటి కర్చీఫ్‌తో కప్పుకున్నట్లు చూపించారు. అయితే EPS తన ముఖాన్ని ఎందుకు దాచుకోవాల్సిన వచ్చిందని పలువురు ప్రశ్నించారు. తన ముఖాన్ని కప్పుకోవడానికి ఎలాంటి కారణం లేదని పార్టీ ఐటీ విభాగం స్పష్టం చేసింది.
పావుగంటలో ఏం మాట్లాడుకున్నారు?
15 నిముషాల ప్రైవేటు సమావేశంలో ఈపీఎస్ - షా ఏం మాట్లాడుకుని ఉంటారని ఇప్పుడు తమిళనాట జరుగుతున్న చర్చ. షాకు తమిళం అర్థం కానప్పుడు..ఈపీఎస్ హిందీలో మాట్లాడలేనప్పుడు.. షాతో ఈపీఎస్ వ్యక్తిగత సమావేశం ఎందుకు కోరుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎవరు అనువాదకుడిగా వ్యవహరించి ఉంటారన్న ప్రశ్నలొస్తున్నాయి.
‘సాధారణ సమావేశం కాదు’
అయితే షా-ఈపీఎస్ సమావేశం క్యాజువల్ మీట్ కాదని రాజకీయ పరిశీలకులంటున్నారు. AIADMK సీనియర్ నాయకుడు కె.ఎ. సెంగొట్టయన్ ఇటీవల ఐక్యత కోసం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ బహిష్కరణకు గురైన నాయకులు ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), వి.కె. శశికళ, టి.టి.వి. దినకరన్‌లను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని సెంగొట్టయన్ డెడ్‌లైన్ విధించారు. ఈ విషయం గురించి తన వ్యతిరేకతను బీజేపీ అధిష్టానానికి గట్టిగా చెప్పడానికే ఈపీఎస్ షాతో సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది.
‘ఆ సందర్భాల్లో మాత్రమే ..’
షా నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు.. EPS తన ముఖం దాచుకోవాల్సిన అవసరం ఏమిటని DMK మంత్రి ఎస్. రేగుపతి ప్రశ్నించారు. "ఎవరైనా తన ముఖాన్ని దాచుకోడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి అవమానానికి గురయినపుడు, లేదంటే తప్పు చేసినపుడు.." అని మీడియాతో అన్నారు.
‘భూతద్దంలో చూపడం సరికాదు..’
అయితే రాజకీయ వ్యాఖ్యాత డాక్టర్ సుమంత్ రామన్ EPSని సమర్థిస్తూ Xలో ఇలా పోస్టు చేశారు. ‘‘వీడియో క్లిప్‌ను మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. వీడియో నిడివి చాలా స్వల్పం. EPS తన ముఖాన్ని టవల్‌తో తుడుచుకోవచ్చు లేదా తన ముక్కును ఊదుకోవచ్చు. అమిత్ షాతో భేటి బహిరంగంగా ప్రకటించిన సమావేశమే కదా.. అతను తన ముఖాన్ని ఎందుకు దాచుకోవాలి?” అని రాసుకోచ్చారు.
‘షాను కలవడంలో తప్పేముంది?’
అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలపై చర్చించటానికి షాతో ఈపీఎస్ సమావేశమయ్యారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు..‘‘ బీజేపీ(BJP) ఎప్పుడూ మరో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. కూటమి నాయకులు షాతో చర్చలు జరపడం తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉంది. చివరి నిమిషంలో కూడా మార్పులు జరగవచ్చు" అని సమాధానమిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran).