వరంగల్లు సాహిత్య సభలో జరిగిన దాడిపై సర్వత్రా నిరసన

"భౌతిక దాడులతో తమ క్రూరత్వాన్ని మాత్రమే చాటుకోగలుగుతారు. బీజేపీ అధికారంలో ఉందని ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలు సహించరు."

By :  Vanaja
Update: 2024-04-30 06:50 GMT

వరంగల్లు రచయితలపైన, నిర్వాహకులపైన దాడి చేసి గాయపర్చడాన్ని జనసాహితి సంస్థ తీవ్రంగా ఖండించింది. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, ప్రజాస్వామిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే ఇలాంటి ధోరణులను ముక్త కంఠంతో ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు జనసాహితి ఓ ప్రకటన విడుదల చేసింది.

జనసాహితి లేఖ...

"తెలంగాణలో “సమూహ" పేరుతో ఏర్పడిన సెక్యులర్ రచయితల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో 28- 04-2024 ఆదివారం నాడు "లౌకిక విలువలు - సాహిత్యం" అనే అంశంపైన సభ జరిగింది. తెలంగాణలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సదస్సులోనికి చొరబడి, ఉన్మాదమే మతంగా భావించే గుంపు, దాడికి తెగబడ్డారు. ఎన్నికల కాలంలో ఇలాంటి సదస్సుకు కాకతీయ విశ్వవిద్యాలయం అనుమతి ఎలా ఇచ్చింది అంటూ నిర్వాహకులతో వాదనకు దిగి, అనుమతి రద్దు చేయాలంటూ సదస్సులో గందరగోళం సృష్టించారు. సదస్సులో చర్చకోసం పెట్టిన అంశాలపై చర్చించడానికే వీలు లేదంటూ మతోన్మాదంతో ఫత్వాలు జారీచేశారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకై మణిపూరులో ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యంత నీచమైన హత్యాచారాలను ఈ గుంపు ఎప్పుడూ ఖండించలేదు. ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించిన మల్ల యోధురాండ్రపై జరిగిన అవమానకర వేధింపులను వీరు తప్పు పట్ట లేదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన సదస్సు అయితే ఎన్నికల అధికారులను వివరణ కోరి ఉండాలి. దానికి బదులుగా సాహిత్య సమావేశాన్ని జరగనివ్వకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడాన్ని జనసాహితి ఖండిస్తోంది".

"ప్రజా సాంస్కృతిక విధ్వంసాన్ని సృష్టిస్తున్న సామ్రాజ్యవాద దళారీ శక్తుల కిరాయి మూకల లాగా వీరు ముందుకొస్తున్నారు. ఎవరు ఏమి తినాలి? ఎవరు ఏమి మాట్లాడాలి? ఎటువంటి బట్టలు కట్టుకోవాలో మేమే నిర్ణయిస్తామనే స్థాయిలో సాగుతున్న నియంతృత్వ ఫత్వాలను శ్రామిక ప్రజలు, లౌకికశక్తులు, ప్రజాతంత్రవాదులు ఆమోదించరని, ఈ అసాంఘిక శక్తులకు అర్థమయ్యేలా మన సాహిత్య కృషిని కొనసాగిద్దాం. ప్రజలు నిత్యం ఎదుర్కొనే జీవన్మరణ సమస్యలపై ఎన్నడూ మాట్లాడని ఈ ఉన్మాదశక్తుల అసలు లక్ష్యాన్ని ప్రజలకి తెలియజేయాలి. ఇటువంటి పాలకవర్గ అనుకూల శక్తులపై ఆచరణలో నిత్యం సంఘటితంగా పోరాడాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన సాంస్కృతిక బాధ్యత నేడు మనందరిపై వుంది" అని లేఖలో పేర్కొంది.

మతోన్మాదం సమస్యలకు పరిష్కారం చూపదు -పీఏవీ

సమూహం సెక్యులర్ రైటర్స్ సభపై మతోన్మాదుల దాడిని ఖండిద్దాం. మాత సామరస్యాన్ని, సమానత్వాన్ని సాధించుకుందామని పాలమూరు అధ్యయన వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు పీఏవీ అధ్యక్షులు ప్రొ. జీ.హరగోపాల్, కన్వీనర్ ఎం.రాఘవాచారి పేరిట లేఖను విడుదల చేశారు. ఏబీవీపీ వారు సమాజానికి ఏమైనా చెప్పదలుచుకుంటే, వారు కూడా సభల ద్వారా చెప్పవచ్చని లేఖలో పేర్కొన్నారు.


"భౌతిక దాడులతో తమ క్రూరత్వాన్ని మాత్రమే చాటుకోగలుగుతారు. బీజేపీ అధికారంలో ఉందని ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలు సహించరు. మతోన్మాదం ఏ విధంగానూ సమస్యలకు పరిష్కారం చూపదు. రాముడు పేరుతో ఇలాంటి దాడులకు దిగితే చరిత్ర క్షమించదు. పాలమూరు అధ్యయన వేదిక నిన్నటి రోజును చీకటి వేదికగా ప్రకటిస్తుంది. దాడికి పాల్పడినవారు పోలీసులకు తెలుసు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి" అని లేఖ ద్వారా పీఏవీ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News