తెలంగాణ పోలీసులకు హీరోయిన్ జెత్వానీ కేసును గుర్తు చేసిన హరీష్ రావు

కాదంబరి జెత్వానీపై నమోదైన ఒక కేసు విషయంలో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపినట్లు ఆరోపణలు రావటాన్ని హరీష్ పరోక్షంగా ప్రస్తావించినట్లు కనబడుతోంది.

Update: 2024-09-23 10:23 GMT

ఏపీలో ఇటీవల సంచలనం సృష్టించిన హీరోయిన్ జెత్వానీ వ్యవహారాన్ని గుర్తుంచుకోవాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ తెలంగాణ పోలీసులను హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని హరీష్ అన్నారు. హీరోయిన్ కాదంబరి జెత్వానీపై నమోదైన ఒక ఆస్తి కేసు విషయంలో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపినట్లు ఆరోపణలు రావటం, ఏపీ ప్రభుత్వం వారిని కేసులో నిందితులుగా చేర్చటాన్ని హరీష్ పరోక్షంగా ప్రస్తావించినట్లు కనబడుతోంది.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ ఇవాళ మాట్లాడారు. రాష్ట్రంలో గూండాయిజం, అత్యాచారాలు బాగా పెరిగిపోయాయని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే రెండువేలకు పైగా అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.

నిన్న ఒకే రోజే హైదరాబాద్, దేవరకద్రలలో రెండు అత్యాచార ఘటనలు జరిగాయని చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోవటంలేదని అన్నారు. మరోవైపు నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి గూండాలు దాడిచేశారని, ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాత్రి సమయంలో ఇంటిముందు పటాకులు కాల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేయటమేమిటని అన్నారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, దానినుంచి డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాకు తెర లేపారని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటపొలాలు ఎండిపోతున్నాయని, మరోవైపు లక్షలాదిమంది డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవటంలేదని హరీష్ ఆరోపించారు.

Tags:    

Similar News