టీటీడీ కోరితే విజయ బ్రాండ్ నెయ్యి సరఫరా చేస్తాం: డెయిరీ జీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తేలిన నేపథ్యంలో టీటీడీకి విజయ నెయ్యిని సరఫరా చేసేందుకు తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ సిద్ధమైంది.

Update: 2024-09-23 11:01 GMT

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఘటన జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి తాజాగా లేఖ రాసింది.

- తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచి స్వచ్ఛమైన నెయ్యిని తాము సరఫరా చేస్తామని తెలంగాణ విజయ డెయిరీ జనరల్ మేనేజరు వి మల్లికార్జున రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

- తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పరీక్షల్లో వెలుగుచూడటంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో భక్తులున్నారు.


తిరుమల ఘటన నేపథ్యంలో తెలంగాణలో తాజా ఆదేశాలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలోని అన్నీ దేవాలయాలకు విజయ బ్రాండ్ నెయ్యిని సరఫరా చేయాలని తెలంగాణ డెయిరీ యాజమాన్యానికి తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, జైళ్లకు విజయ డెయిరీ పాలు, పాల పదార్థాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

టీటీడీ కోరితే తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తాం : విజయ డెయిరీ
టీటీడీ కోరితే తిరుమలకు కూడా తమ విజయ బ్రాండ్ నెయ్యిని సరఫరా చేస్తామని డెయిరీ జనరల్ మేనేజరు వి మల్లికార్జునరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన వార్తల నేపథ్యంలో తాము స్వచ్ఛమైన నెయ్యిని, పాల పదార్థాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డెయిరీ జీఎం వివరించారు.

ప్రజల విశ్వాసాలను దెబ్బతీయకూడదు : మంత్రి పొన్నం ప్రభాకర్
తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘‘నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని వస్తున్న వార్తలు చాలా దురదృష్టకరం, దీనిపై విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయకూడదు దీనిపై మేం విచారణ కోరుతున్నాం...కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.


Tags:    

Similar News