శ్రీవారి సేవలో పుష్పాలు తరిస్తాయి.. ఎన్ని రకాల హారాలు వాడతారంటే..

శ్రీవారి సేవలో యాత్రికులే కాదు. పుష్పాలు కూడా తరిస్తాయి. అలంకారప్రయుడి మూలవిరాట్టుకు రోజుకు ఎన్నిరకాల పూలహారాలు, ఎన్నిసార్లు మారుస్తారో తెలుసా..?

Update: 2024-09-30 03:05 GMT

బ్రహ్మాండ నాయకుడని కూడా పేరు. తిరుమలలో కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువైన శ్రీవేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడు కూడా. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన కార్యక్రమం. దీనిని ''తిరువాయ్‌ మొళి'' అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడ పేర్కొన్నారు. స్వామివారి మూలవిరాట్టును ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


శిఖామణి : కిరీటం మీదనుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను 'శిఖామణి' అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.

సాలిగ్రామ మాల : శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉంటుంది. దీనిని సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరించే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది.


కంఠసరి :మోడలో రెండు పొరలుగా ఇరు భజాలమీదికి అలంకరిస్తారు. ఈ దండ ఒకటి మూడున్నర మూర పొడవు ఉంటుంది.

వక్షస్థల లక్ష్మి : శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవికి రెండుదండలు అలంకరిస్తారు. ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూర పొడవు ఉంటుంది.
శంఖుచక్రం : శ్రీవారి కుడి ఎడమ చేతిలో ఉండే శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.
కఠారిసరం : స్వామివారి బొడ్డుపైన్న నందక ఖడ్గానికి అలంకరిం దండ ఒకటి. రెండు మూరలు పొడవు.

తావళములు : రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుంచి పాదాల వరకు జీరాడుతూ మూడు దండలు వేలాడుతూ అలంకరిస్తారు.ఇందులో మొదటిదండ మూడు మూరలు, రెండవడి మూడున్నర మూరలు మూడోదండ నాలుగు మూరలు పొడవు ఉండే విధంగా కొలతల ప్రకారం అల్లుతారు.

తిరువడి దండలు : స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర పొడవు ఉంటుంది.
ప్రతి గురువారం జరిగే ''పూలంగి సేవ''లో మాత్రమే శ్రీవారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, ఆ మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.
ఉత్సవమూర్తులకు అలంకరణ


శ్రీవారి ఆనందనిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు పూలమాలలు సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులకు రోజూ అలంకరించే పూలదండల ఎలా ఉంటాయంటే..

భోగ శ్రీనివాసమూర్తికి : ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి: ఒక దండ
శ్రీదేవి భూదేవి సమేత మలయ్పప్పస్వామికి: మూడు దండలు
శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తికి:మూడు దండలు
సీతారామలక్ష్మణులకు: మూడు దండలు
రుక్మిణీ శ్రీకృష్ణులకు: రెండు దండలు
చక్రత్తాళ్వారుకు (సుదర్శనుడు): ఒక దండ
అనంత గరుడ విష్వక్సేనులకు: మూడు దండలు
సుగ్రీవ అంగద హనుమంతులకు:మూడు దండలు

ఇతర విగ్రహాలకు రోజు అలంకరించే పూలదండలు
బంగారువాకిలి ద్వారపాలకులు : రెండు దండలు
గురడాళ్వారు : ఒక దండ
వరదరాజస్వామి: ఒక దండ
వకుళామాలిక: ఒక దండ
భగవద్రామానుజులు (మూలమూర్తి, ఉత్సవమూర్తి): రెండు దండలు
యోగనరసింహస్వామి: ఒక దండ
విష్వక్సేనులవారికి :ఒక దండ
పోటు తాయారు: ఒక దండ
బేడి ఆంజనేయస్వామికి: ఒక దండ
శ్రీవరాహస్వామి ఆలయానికి: మూడు దండలు
కోనేటిగట్టు ఆంజనేయస్వామికి:ఒక దండ (ప్రతి ఆదివారం మాత్రమే)
ఇవి కాకుండా...
శ్రీవారికి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకుగాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలో ఏర్పాటు చేస్తారు.

ఏ రకాల పుష్పాలు వాడతారంటే..

శ్రీవారికి అలంకరించే పూలమాలల తయారీకి అనేక రకాల పుష్పాలను వినియోగిస్తారు. అందులో తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు మొక్కలు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం (మారేడు) ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలును వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్పకైంకర్యంలో వినియోగిస్తారు.

ఎలా తీసుకుని వెళారంటే..
తిరుమల శ్రీవారినికి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించే జరిగే తోమాలసేవ (పుష్ప కైంకర్యం)కు ఈ పుష్పఅరలో పూలమాలలు సిద్ధం చేస్తారు. ఈ పూలమాలలను, జియ్యంగార్లు తలపై పెట్టుకొని బాజాభజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో బయలుదేరుతారు. వేదమంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు.ading

Content Area



Tags:    

Similar News