ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి ఊపిరి, మాట్లాడుతూనే ఉండండి!
'దిగంబర కవి, ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్' పుస్తక ఆవిష్కరణ సభలో వక్తల ఆవేదన, ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం?
By : Amaraiah Akula
Update: 2025-12-07 13:02 GMT
పాలకులను ప్రశ్నలూ భయపెడుతున్నాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రశ్నించడమే సహేతుకమని, న్యాయమనే వారని చెబుతూ ఇప్పుడు అదే నేరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే వ్యాపార సంస్థలుగా మారిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దిగంబర కవుల్లో ఒకరైన ప్రముఖ కవి నిఖిలేశ్వర్ రచించిన 3 పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. వామపక్షవాది డాక్టర్ జతిన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కల్పనా కన్నబిరాన్, ప్రొఫెసర్ కట్టా ముత్యంరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నందిని సిధారెడ్డి, సీనియర్ తెలకపల్లి రవి ప్రసంగించారు.
సభలో 'ఎక్కడికీ గమనం? ఎంతదూరమీ గమ్యం?'," గోడల వెనుక (జైలు జ్ఞాపకాలు)",'ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?' పుస్తకాలను ప్రముఖులు ఆవిష్కరించారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నారంటే..
అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ నేడు ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న అనుచిత చర్యలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. మనుషులుగా ఉన్నవాళ్లు మాట్లాడకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదన్నారు. కేసులు, దాడులు, అరెస్టులకు భయపడి నోరు విప్పకపోతే ప్రజాస్వామ్యం మనజాలదన్నారు. నూటికి 90 శాతం మంది నోరు విప్పకుండా ఉంటారని, మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉండాలని, ఒక్కరు విన్నా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. మనుషులం గనుక ఆలోచించాలన్నారు. "మాట్లాడండి, మాట్లాడుతూనే ఉండండి, నోరు విప్పిండి" అని పౌరసమాజానికి విజ్ఞప్తి చేశారు. నిఖిలేశ్వర్ లాంటి వాళ్లు రాయబట్టో, మాట్లాడబట్టో 1971లో ఆనాటి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చిన్నపురెడ్డి, జస్టిస్ ఏడీవీ రెడ్డి లాంటి వాళ్లు డిటెన్షన్ కేసులపై చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్లు కుర్చీలకు అతుక్కుపోయినా నోరు విప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నక్సలైట్లను 2026 మార్చి నెలాఖరుకల్లా నిర్మూలన చేస్తామనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటనను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాస్తంత వ్యంగంగానే 'ఎన్‌కౌంటర్లకు కాలం చెల్లిందని' ఆ స్థానంలో 'మేం చెప్పినట్టు వినండి, లేకుంటే మిమ్మల్ని పలానా తేదీలోపల నిర్మూలిస్తాం' అనే ధోరణి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం అట్లా ఉందన్నారు. తీవ్ర విభేదాలు, బాధకరమైన అంశాలు ఉండడం పరిపాటని అంటూ 'మీరు మాతో విభేదిస్తున్నారు, మీరు మరోలా ఆలోచిస్తున్నారు గనుక చంపేస్తామనడం వేరని' అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో 'మీ ఆలోచనలే మీ శత్రువులని' సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో 'ఎవరి మీద యుద్ధం చేయాలి' అనే ప్రశ్న సహజంగానే వస్తుందన్నారు. ఏదైనా తమ దాకా వస్తేగాని తెలియదని చెబుతూ జర్మనీకి చెందిన పాస్టర్ మార్టిన్ నీమోలర్ (Martin Niemöller) కొటేషన్ ను ఉదహరించారు.
“మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు.
నేను కమ్యూనిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు.
తర్వాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు.
నేను సోషలిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు.
ఆ తర్వాత యూనియన్ సభ్యుల కోసం వచ్చారు.
నేను యూనియన్ సభ్యుడు కాదు కాబట్టి మాట్లాడలేదు.
చివరకు వారు నాకోసం వచ్చినప్పుడు…
నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు.” అని చెబుతూ ఆలోచించడం మానొద్దని, మాట్లాడడం మానొద్దని, ప్రజాస్వామ్యానికి ఊపిరి మాట్లాడడం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు.
న్యాయమూర్తుల భాష వీధి భాషలా ఉందా?
ప్రొఫెసర్ కల్పనా కన్నబిరాన్ తన ప్రసంగంలో డిటెన్షన్ కేసు విచారణ సందర్భంలో న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు దిగంబర కవుల్లో ఒకరైన నిఖిలేశ్వర్ చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలన్నారు. 1971లో జస్టిస్ చిన్నపరెడ్డి ఇచ్చిన తీర్పుకి ఇప్పుడు వస్తున్న తీర్పులకీ అసలు పోలికే లేదని అభిప్రాయపడ్డారు. కాళ్లూ, చేతులు లేకపోయినా, శరీర కదలికలు లేకపోయినా బుర్ర ఉంది కదా అని న్యాయమూర్తులే అడుగుతున్నారంటే 'న్యాయమూర్తుల భాష రాజ్యాంగపరమైన భాషలాగా లేదని, వీధి భాషగా (స్ట్రీట్ లాంగ్వేజ్) ఉందని' అన్నారు.
1971నాటి కానిస్టిట్యూషనల్ లెగసీ (రాజ్యాంగ వారసత్వం) ఏమైందని ప్రశ్నించారు. ఓసారి మాటల సందర్భంలో నిఖిలేశ్వర్ తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిఖిలేశ్వర్ ను అరెస్ట్ చేశారని, ఆ సందర్భంలో దిగంబరకవులు లాంటి వాళ్లను వెర్బల్ నక్సలైట్లుగా (మాటలతో నక్సలైట్ల పట్ల సానుభూతి కలిగించే వారు /మాటల నక్సలైట్లు) అభివర్ణించారని, ఇప్పుడు అటువంటి వాళ్లనే అర్బన్ నక్సలైట్లుగా పిలుస్తున్నారని వివరించారు. ప్రశ్నించే వారి పట్ల ఆనాడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడూ అదే ఉందన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడల్లా కాపాడుకోవాల్సిన బాధ్యత సామాన్యులదేనని విజ్ఞప్తి చేశారు. “అవిధేయత నా జన్మహక్కు (Disobedience is my birthright)” అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోందని, దాన్ని కాపాడుకోవడంలో నిఖిలేశ్వర్ లాంటి వారు మార్గదర్శకులని వివరించారు కల్పనా కన్నాబిరన్.
అస్థిత్వ ఉద్యమాలకు కాలం చెల్లలేదు!
సామాజిక సందర్భాలను బట్టి ఉద్యమాలు పుడుతుంటాయని, అస్థిత్వ ఉద్యమాలకు కాలం చెల్లలేదని ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ (Telangana Sahitya Akademi) తొలి ఛైర్మన్ నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. రచయితల్లో కెరియరిజం ఉంటుందన్నారు. రచయిత రచయితగా ఉండడంలో తప్పు లేదని వివరించారు. ఏదైనా ఒక రచన ఆయా కాలాన్ని బట్టి పల్చబడిందో, చిక్కబడిందో నిర్ణయిస్తుందన్నారు. అంతమాత్రాన ఆయా రచయితల్ని తప్పు బట్టాల్సిన పని లేదని, కెరియర్ లేకుండా రచన ఉంటుందా అని ప్రశ్నించారు. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకు ఫిర్యాదులూ ఉంటాయని, ఆ పనే నిఖిలేశ్వర్ చేశారన్నారు.
ప్రొఫెసర్ కట్టా ముత్యంరెడ్డి నిఖిలేశ్వర్ రాసిన విద్యారంగ వ్యాసాలను సమీక్షించారు. “ప్రపంచాన్ని మార్చేందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య” అని దక్షిణాఫ్రికా నల్లజాతి యోధుడు నెల్సన్ మండేలా చెప్పిన మాటను ప్రస్తావిస్తూ ఈవేళ ఇండియాలో ప్రశ్నకు భయపడే రోజులు వచ్చాయన్నారు. ప్రశ్నలకు పాలకులు భయపడుతున్నారని వివరించారు. నిరసనకారులకు గళం ఇవ్వాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి నిఖిలేశ్వర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. మార్పు సహజమని, గతమంతా బాగుందని, వర్తమానమంతా చెడిపోయిందని భావించాల్సిన అవసరం లేదని చెప్పారు. నిన్నటి కన్నా నేటి తరం బాగా ఆలోచిస్తోందని, వేగంగా స్పందిస్తోందని అన్నారు.
సభికుల ప్రసంగాలకు పుస్తక రచయిత నిఖిలేశ్వర్ స్పందిస్తూ "గోడల వెనుక" జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దేశంలో పరిస్థితులు మారాలనే తపనతోనే ఈ పుస్తకాలను తెచ్చినట్టు వివరించారు. సీనియర్ జర్నలిస్టు, నిఖిలేశ్వర్ కుమారుడు రాహుల్ సభకు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పలువురు నిఖిలేశ్వర్ కి అభినందనలు తెలిపారు.