గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్.. కమిషనర్ ఉత్తర్వులు
పోస్టర్ల వినియోగంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పోస్టర్ల వినియోగంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్యానర్లపై గ్రేటర్ పరిధిలో పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఆమె ఈరోజు ప్రకటించారు. ఈ మేరకు ఆమే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని, అదే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఇవి సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోస్టర్ల వినియోగంపై మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా కొరడా ఝులించడానికి కారణాలు ఏంటి అని తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏదైనా జరిమానా వేయండి..
‘‘గ్రేటర్ పరిధిలో ఎక్కడా కూడా పోస్టర్లు, వాల్పెయింగ్‌లు కనిపించకూడదు. వాటి విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలి. ఎక్కడైనా ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లఘించి పోస్టర్లు, వాల్ పేయింగ్‌లు అంటించినట్లు కనిపిస్తే వాటిని వెంటనే తొలగించడంతో పాటు సదరు వ్యక్తికి జరిమానా విధించాలి. స్పెషల్ ఈవెంట్లు ఉన్నా పోస్టర్లకు అనుమతి ఉండదు’’ అని ఆమె ఈరోజు జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
సినిమా వాళ్లనూ వదలొద్దు..
సాధారణంగా పోస్టర్లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమాలు. ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదలవుతోందంటే.. నగరమంతా కూడా ఆ సినిమా పోస్టర్లే దర్శనం ఇస్తాయి. ఈ మధ్య చిన్నచిన్న సినిమాలు కూడా భారీగా పోస్టర్లను అంటిస్తోంది. కాగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పోస్టర్ల నిషేధం నుంచి సినిమా థియేటర్ల వారికి కూడా మినహాయింపు లేదు. సినిమా థియేటర్ల వారు అంటించినా వాటిని తొలగించి, జరిమానా వేయాలని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.