అందని పంట నష్టపరిహారం, ఆందోళనలో రైతాంగం

భారీ వర్షాలతో తెలంగాణలో మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం.

Update: 2025-10-06 11:09 GMT
ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీవర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న కలెక్టర్ రాజర్షిషా (ఫొటో : కలెక్టర్ ఎక్స్ ఖాతా సౌజన్యంతో)

తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా కురిసిన భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీవర్షాలకు మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.అధిక వర్షాలు, వరదల విపత్తు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకునే వారు కరువయ్యారు.

- నైరుతి రుతుపవనాలు ముగిసే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్లీ భారీవర్షాలు కురిశాయి. ఆదివారం నుంచి కురుస్తున్న భారీవర్షాలతో పలు పంటలు దెబ్బతిని తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సాధారణం కంటే అధిక వర్షాలు
ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో జూన్ నుంచి అక్టోబరు 5వతేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సాధారణ వర్షపాతం 237 మిల్లీమీటర్లు కాగా అధిక వర్షపాతం నమోదైంది. గత ఏడాది కంటే 22.3 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబరు 30వతేదీతో ముగిసిన తర్వాత కూడా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరు 1వతేదీన రాష్ట్రంలో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో సాధారణం కంటే 60 శాతం, 17 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైందని తెలంగాణ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ మెంబర్ కన్వీనర్ షేక్ మీరా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరో పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, ఏ జిల్లాలోనూ లోటు వర్షాలు కురవలేదని ఆయన తెలిపారు.

అధిక వర్షాలు...
రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 89 శాతం అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 69 శాతం అధిక వర్షం కురిసిందని ఆయన తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 35 శాతం, రంగారెడ్డిలో 47 శాతం అధికవర్షపాతం నమోదైందని ఆయన వివరించారు.

కోత దశలో దెబ్బతిన్న పంటలు
తెలంగాణ రాష్ట్రంలో కోత దశలో వివిధ పంటలు భారీవర్షాలకు నేలకొరగడంతో దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల వల్ల కల్లాల్లో ఆరబోసిన సోయా పంట నీట మునిగింది. సోయా పంట కోత దశలో కురిసిన వర్షంతో తాము నష్టపోయామని జైనథ్ ప్రాంతానికి చెందిన రైతు టి భోజారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరో వైపు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అధిక వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి,పెండల్వాడ గ్రామాలకి చెందిన దెబ్బతిన్న రైతుల సోయాబీన్,పత్తి పంటలను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ పంట నష్టం...అందని సాయం
ఆగస్టు నెలలో కురిసిన భారీవర్షాలకు 13 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోయాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 93,925 ఎకరాల్లో పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో 41,098 ఎకరాలు, సిద్ధిపేటలో 7వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 12,283 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 1500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి,మెదక్‌, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సర్కారు నివేదిక సమర్పించారు. పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన భారీవర్షంతో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. భారీవర్షాల వల్ల పూత దశలోనే కాకుండా కోతదశలోనూ దెబ్బతిన్నాయి. ఎకరానికి 60 వేలకు పైగా పెట్టుబడి పెట్టగా వర్షాలకు పంటలు నేలపాలయ్యాయని రైతు జి మల్లేశ్వర్ ఆవేదనగా చెప్పారు. వరి, మొక్కజొన్న పంటలు నేలమట్టం అయ్యాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పత్తి చెట్లు ఒరిగిపోయి, పత్తి కాయలు నల్లగా మారి పత్తి దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు చెప్పారు.

మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.మొత్తంమీద 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 1,09,626 ఎకరాల్లో వరి పంట, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్, 639 ఎకరాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారుల సర్వేలో తేలింది. భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

పంట నష్టం అంచనా : 3 లక్షల ఎకరాలకు పైగా.
నష్టం వాటిల్లిన పంటలు:
వరి – 1,09,626 ఎకరాలు
పత్తి – 60,080 ఎకరాలు
సోయాబీన్ – 6,751 ఎకరాలు
పండ్లతోటలు – 639 ఎకరాలు

పీఎం ఫసల్ బీమా పథకం అమలు ఏది?
పంటలు దెబ్బతింటే నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వీలుగా పంటల బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలులో లేదు. దీనివల్ల ప్రకృతి విపత్తులు, భారీవర్షాలు, వరదలు వచ్చినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున పంట నష్టపరిహారంగా అందించాలి.భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గత వారం రోజుల పాటు కురిసిన భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు లబోదిబో అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులో లేకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెప్పారు. అతివృష్టి, అనావృష్టి, వరదలతో పంటలు దెబ్బతింటున్నందున రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించాలని రైతులు కోరారు. కనీసం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న యాసంగి పంటలకు అయినా ఫసల్ బీమాను అమలు చేయాలని భారత కిసాన్ సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.

పంట నష్టపరిహారం ఏది?
ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతిన్పపుడల్లా రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని, కానీ పంట నష్టాల వల్ల రైతులు భారీగా నష్టపోయారని భారత కిసాన సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సారి రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి పరిహారం కూడా అందించలేదని ఆయన ఆవేదనగా చెప్పారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించినా, తెలంగాణలో ఇంకా పరిహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించినా...
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న పంటల నష్టంపై సమగ్ర నివేదికను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి అందించారు. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి నివేదిక వచ్చినా పరిహారం జాడలేదు. వరదల వల్ల పంటపొలాల్లో మేట వేసిన ఇసుక, మట్టిని తొలగించి వ్యవసాయ భూములను బాగు చేసేందుకు ఉపాధి హామి కూలీలను ఉపయోగించుకునేందుకు తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామి పథకం కింద పొలాల్లో వేసిన ఇసుకను కూలీల సాయంతో తొలగించనున్నారు. వ్యవసాయానికి ఉపాధి హామి పథకాన్ని అనుసంధానం చేయాలనే రైతుల చిరకాల డిమాండ్ నెరవేరినా, పంట నష్టపరిహారం మాత్రం అన్నదాతల చేతికి అందలేదు.

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై కేంద్రానికి వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించినా కేంద్రప్రభుత్వం నుంచి సాయం అందలేదు.కేంద్ర ప్రభుత్వం పంటనష్టంపై ఆర్థిక సాయం అందిస్తే, కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలిపి రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కేంద్రం నుంచి నయాపైసా కూడా ఆర్థిక సాయం రాకపోవడంతో ఖరీఫ్ లో వేసిన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
తెలంగాణలో 2025 ఖరీఫ్ సీజన్‌లో భారీవర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టమైన నివేదికలు సమర్పించినా, కేంద్రం నుంచి సహాయం లేదు.రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. పంటల బీమా అవసరాన్ని ఈ పరిస్థితి మరోసారి తేటతెల్లం చేసింది.


Tags:    

Similar News