అమిత్ షా ఫేక్ వీడియో కేసు... ఢిల్లీ పోలీస్ కస్టడీలో అరుణ్ రెడ్డి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By :  Vanaja
Update: 2024-05-04 17:06 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్న అరుణ్ రెడ్డి.. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరిట సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నారు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కాంగ్రెస్ కి సంబంధించిన ప్రచారంతో పాటు, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇక అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అరుణ్ రెడ్డి కి కూడా సంబంధం ఉందని అనుమానిస్తున్న ఢిల్లీ పోలీసులు.. శుక్రవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో హాజరు పరిచారు. జడ్జి అతనిని మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీ కి ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అతనిని అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారిస్తున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడన్న అభియోగంతో అతని రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.

కాగా, సిద్దిపేటలో అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోని మార్ఫింగ్ చేసి, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారని కేసులు నమోదయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డికి, పలువురు కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. ఇటు హైదరాబాద్ లో సైతం బీజేపీ శ్రేణులు కేసులు పెట్టారు.

ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారని, తిరిగి అవే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు కేసు ఫైల్ చేసి నోటీసులిచ్చారని పేర్కొన్నారు. సీఆర్పీసీ 91/160 కింద జారీ చేసిన నోటీసులు కొట్టేయాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హై కోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని ఢిల్లీ పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

Tags:    

Similar News