94 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో పక్షుల సర్వే

హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాలు రంగురంగుల, వివిధ జాతులు, వివిధ దేశాల వలస పక్షులకు నిలయంగా మారింది.;

Update: 2025-08-21 03:36 GMT
హైదరాబాద్ లో విహరిస్తున్న పక్షి

ఒక వైపు హుసేన్ సాగర్ జలాశయం...సాగర తీరంలో పచ్చని చెట్లతో అలరారుతున్న లుంబినీ వనం...పచ్చని చెట్లతో కూడిన నెక్లెస్ రోడ్డు...మరో వైపు పచ్చని చెట్లతో కూడిన ఎన్టీఆర్ పార్కు వద్ద తెలంగాణ అంబేద్కర్ సచివాలయం ఉంది. ఈ సచివాలయంలోని 5వ అంతస్తులో తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి బుధవారం సాయంత్రం అనుకోని అతిథి వచ్చారు. ఆ అనుకోని అరుదైన అతిథి ఎవరంటే ‘ఆఫ్రికన్ గ్రే చిలుక’.




 జూపార్కుకు తరలిస్తాం...

ఒక వైపు గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రకృతి పరవశించేలా మారింది. చల్లని వాతావరణం, వర్షాల కారణంగా ఒక అసాధారణ పక్షి అనుకోకుండా ప్రధాన కార్యదర్శి గదికి వచ్చింది. సచివాలయ సిబ్బంది ఈ ఆఫ్రికన్ గ్రే చిలుకను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించి, ఆపై అటవీ శాఖకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఆ పక్షిని ఆఫ్రికన్ గ్రే చిలుకగా గుర్తించి అదుపులోకి తీసుకొని సంరక్షించారు. సంరక్షించిన ఆఫ్రికన్ గ్రే చిలుకను హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కుకు తరలిస్తామని అటవీశాఖ అధికారి ఎ శంకరన్ చెప్పారు.



 హైదరాబాద్ బర్డ్ అట్లాస్ బర్డ్ సర్వే

హైదరాబాద్ బర్డ్ అట్లాస్ లో 622 మంది వాలంటీర్లు బర్డ్ వాక్స్ నిర్వహిస్తూ వివిధ రకాల అరుదైన పక్షులను గుర్తించారు.పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీంఅలీ 1931-32 వ సంవత్సరంలో సరిగ్గా 94 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగర ప్రాంతంలో బర్డ్ సర్వే చేశారు. సలీంఅలీ జరిపిన బర్డ్ సర్వేను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ బర్డ్ అట్లాస్ 2025 నుంచి 2027వ సంవత్సరం వరకు హైదరాబాద్ ప్రాంతంలోని 180 లోకేషన్లలో బర్డ్ సర్వే చేపట్టింది.



 బర్డ్ వాక్స్ లో పక్షిప్రేమికుల సందడి

హైదరాబాద్ నగరానికి చెందిన పక్షిప్రేమికులు వర్షాకాలంలో బర్డ్ వాక్స్ కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బర్డ్ అట్లాస్, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ కు చెందిన పక్షిప్రేమికులు బర్డ్ వాక్ చేస్తూ అరుదైన పక్షులను చూసి పరవశించారు.



 హైదరాబాద్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని మెదక్ జిల్లా గుమ్మడిదల ప్రాంతంలోని నర్సాపూర్ అడవుల్లో బర్డ్ వాక్ చేసిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులకు పలు అరుదైన పక్షులు దర్శనమిచ్చాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ వద్ద జరిపిన బర్డ్ వాక్ లో అరుదైన పక్షులు కనిపించాయి.




- సంగారెడ్డి జిల్లా మంజీరా డ్యామ్ సమీపంలోని కల్ బగూర్ జంక్షన్ వద్ద మంజీరా వైల్డ్ లైఫ్ అభయారణ్యం లో పక్షిప్రేమికులు జరిపిన బర్డ్ వాక్ లో రంగురంగుల విదేశీ పక్షులు కనిపించాయి.




 - హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వద్ద యంకతల గ్రాస్ ల్యాండ్ వద్ద హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు చేసిన బర్ద్ వాక్ లో పలు విదేశీ వలసపక్షులు కనిపించాయి. రాప్టార్స్, క్వాలీస్, మల్కోహాస్, ఫాంకోలీన్స్ పక్షులు కనిపించాయి.




 - జహీరాబాద్ గొత్తంగొట్ట ప్రాంతంలోని చించోలీ వైల్డ్ లైఫ్ అభయారణ్యంలో పక్షిప్రేమికులు చేసిన బర్డ్ వాక్ లో రంగురంగుల పక్షులు, వాటి కిలకిలరావాలతో పరవశించిపోయారు.




Tags:    

Similar News