న్యాయంలో మానవతా విలువల ప్రతిబింబం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రప్రతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి;
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి గారిని భారత ఉప రాష్ట్రపతి పదవికి INDIA ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా ప్రకటించడం మంచి ఆలోచన. అన్ని కోణాలనుంచి పరిశీలించినా, పూర్తిగా అర్హుడైన వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగ పరమైన రూల్ ఆఫ్ లా దేశం కోసం తహతహపడిన న్యాయమూర్తి. భారత రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ శాఖ కీలక స్థంభాలలో ఒకటి. ఈ వ్యవస్థలో కొంతమంది న్యాయమూర్తులు వారి అఖండ న్యాయబద్ధత, విలక్షణ దృష్టి, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసంతో చరిత్రలో నిలిచిపోయారు.
న్యాయవిద్యా ప్రస్థానం
బి. సుదర్శన్ రెడ్డి గారు 1948లో జన్మించారు. హైదరాబాదులో న్యాయ విద్యను అభ్యసించి ఉస్మానియా న్యాయ కళాశాల నుండి లా డిగ్రీ పొందారు. తన విద్యా దశ నుండే న్యాయ వ్యవస్థపై అభిమానం, రాజ్యాంగ విలువలపై అవగాహన, సామాజిక న్యాయంపై నిబద్ధత బలంగా ఉన్నవ్యక్తి. 1971లో న్యాయవాదిగా రాజ్యాంగ అంశాలపైన వాదనలుచేస్తూ హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ప్రజా హక్కుల కేసులు, రాజ్యాంగ సంబంధిత విషయాలపై ధైర్యవంతమైన వాదనలు గుర్తింపు పొందాయి. 1995లో సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆతరువాత 2007లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తీర్పుల్లో రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజల హక్కుల పరిరక్షణ, పారదర్శక పాలనపై నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నేళ్ల పాటు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) చైర్మన్ గా కూడా పనిచేశారు, సామాన్య ప్రజలకు న్యాయం అందించాలన్నలక్ష్యం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
అన్నింటికన్నా ముఖ్యమైంది న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయం, అందుకోసం కృషి చేయడం ఆయన గొప్పతనం. న్యాయబద్ధతకు నిదర్శనంగా నిలిచిన ఆయన తీర్పులు నేటికీ న్యాయవాదులకు మార్గదర్శిగా నిలుస్తున్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో ఆయన తీర్పులు సమాజాన్ని ప్రభావితం చేశాయి.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వం – INDIA కూటమి ఎంపిక
సమకాలీన రాజకీయాల మధ్య నైతికత, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు చిహ్నంగా బి. సుదర్శన్ రెడ్డి గారిని INDIA కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం విశేషం. ఈ నిర్ణయం న్యాయతంత్రానికి గౌరవం, రాజ్యాంగ పదవులపై ఉన్న గంభీరతకు ప్రతిబింబం.
బి. సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న నేతగా కూడా ప్రశంసించదగిన వ్యక్తి. ఉప రాష్ట్రపతి పదవిలో ఆయన ఉండటం భారత రాజ్యాంగానికి, నైతిక విలువలకు మేలు చేసే అవకాశం. తన జీవితాన్ని న్యాయబద్ధతకు అంకితం చేసిన ఆయనకు ఈ పదవి సముచిత గౌరవం అవుతుంది.
ముఖ్యంగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారు సల్వా జుడుం కేసులో ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని చర్చించుకోవలసిందే. ఈ తీర్పు ప్రజల మౌలిక హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విలువల ప్రతిష్ఠాపనలో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది.
సల్వా జుడుం కేసు
Nandini Sundar & Others vs State of Chhattisgarh పేరుతో 2011 జులై 5 న చరిత్రాత్మకమైన ఎంతో గణనీయమైన తీర్పునిచ్చారు. అదొకటే ఒక పుస్తకంగా రావలసిన తీర్పు. (ఈ ఇంగ్లీషుతీర్పుపై అనువదించే అవకాశం ఈ రచయితకు లభించింది. మలుపు పబ్లికేషన్స్ ప్రచురించింది) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి జస్టిస్ ఎస్.ఎస్. నాజీర్ ధర్మాసనం ద్వారా సుదర్శన్ రెడ్డి రచించిన ఈ తీర్పులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం "సల్వా జుడుం" అనే పేరుతో గిరిజనులను ఆయుధదారులుగా నియమించి మావోయిస్టుల పై పోరాటానికి ఉపయోగించడం గురించి ఘాటైన తీర్పుప్రకటించారు. తప్పకుండా చర్చించవలసిన ప్రధానమైన అంశాలు ఇవి:
1. సల్వా జుడుం అక్రమమని నిర్ణయం:
ప్రభుత్వమంతట కూడా తన పౌరులైన గిరిజనులను ఆయుధదారులుగా మావోయిస్టులపై పోరాటానికి నియమించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చింది.
2. దారుణమైన అస్త్రాలతో పౌరుల నియామకం అనైతికం:
SPOs (Special Police Officers) గా గ్రామస్థులను నియమించడం అనైతికమనీ, వారికి తగిన శిక్షణ లేకుండా ఆయుధాలు ఇచ్చి పోరాటానికి పంపడం చాలా ప్రమాదకరమనీ అని కూడా ఈ ధర్మాసనం వివరించింది.
3. మౌలిక హక్కుల ఉల్లంఘన చెల్లదు:
ఈ విధానం ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ఆర్టికల్ 21 (జీవిత హక్కు)కు విరుద్ధమని తీర్పు చెప్పింది.
4. సల్వా జుడుం రద్దు చేయాల్సిందే:
సల్వా జుడుం చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఆయుధాలు ఇచ్చిన గ్రామస్తుల్ని ఉపసంహరించుకోవాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
5. పౌరుల భద్రత ప్రభుత్వ బాధ్యత:
ప్రభుత్వం సురక్షిత, న్యాయపరమైన మార్గాల్లో మావోయిస్టు సమస్యను పరిష్కరించాలి కానీ పౌరులను ఆయుధంగా మార్చకూడదని కోర్టు గట్టిగా హెచ్చరించింది.
ఈ తీర్పు ద్వారా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజల హక్కుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. న్యాయం, మానవహక్కులు మరియు రాజ్యాంగ ప్రమాణాలను కాపాడటంలో ఇది గొప్ప ముందడుగు. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థలో "జ్యుడిషియల్ హ్యూమానిజం" (న్యాయంలో మానవతా విలువల ప్రతిబింబం) కి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
రాజ్యాంగ పీఠికపై ప్రసంగం
ఈమధ్య భారత రాజ్యాంగ పీఠిక (ఈ రచయిత రాసిన) పుస్తకంలో న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ మన రాజ్యాంగం మనది కాదు అని వాదించే పెద్దలగురించి విమర్శించారు. ‘‘ఇది పాశ్చాత్య రాజ్యాంగం మాకెందుకు, ఏం సంబంధం అంటే, ఆ వాదన కాన్‌స్టింట్యుయెంట్ అసెంబ్లీ కానిస్టిట్యూషన్ ముసాయిదా చేసిన రోజే ఆర్గనైజర్ ఫ్రంట్ పేజీలో ఎడిటోరియం త్రివర్ణ పతాకాన్ని మేము గుర్తించబోము, రాజ్యాంగాన్ని గుర్తించడమే చేయము, మేము దానిని పాటించబోము అని ప్రకటించారు. ఇప్పుడు ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు పేర్కొంటూ, ‘‘దానికి అంబేద్కర్ జవాబు ఇస్తూ ‘‘భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాన్ని అన్నిటిని కూడగట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడను ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు’’ అని న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
రాజ్యాంగ తీర్మానం: నెహ్రూ
రాజ్యాంగానికి నిర్మాణానికి ముందు పీఠిక వంటి రిజల్యూషన్‌లో నెహ్రు రాసింది వేరు. రాజ్యాలకు (స్టేట్స్) ఎక్కువ నిర్ణయించారు. ఆ అధికారాలలో మిగిలింది రాజ్యాలకే (స్టేట్స్‌కే) ఉండాలి యూనియన్‌కు అవసరమైన కొన్ని అధికారాలు మాత్రమే ఉండాలి. అందుకొరకు నెహ్రూ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఆయన ఆలోచన. అదీ ఆబ్జెక్ట్స్ రిజల్యూషన్ అది ఎప్పుడు ప్రవేశించింది. 31 ఏప్రిల్ 1946, అంటే విభజన ప్లాన్ ముందు అని అర్థం చేసుకోవాలదని సుదర్శన్ రెడ్డి వివరించారు. ‘‘నెహ్రు ఏమన్నాడు? అక్కడెక్కడో చదువుకున్నాడు అని ఎవరంటున్నారు? అసలు 1947 స్వాతంత్రం కన్నా ముందు ఆయనకు అసలు ఈ దేశం సంగతి తెలియదనుకుంటారా? అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా చూసుకున్నాడో తెలుసుకోవాలి. చదువుకున్నామని నటించే వాళ్ళు నెహ్రూకు ఈ దోషం అంటగడతారా? డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉపనిషత్తుల చర్చ, హిమాలయ పర్వతాల చర్చ, గంగానది చర్చ, ఆర్యుల చర్చ, మెహంజాదారో సత్యం అంటే ఈ పదం రాలేదా’’ అన్నారు.
గాంధీజీ ఏమన్నారు అంటే, ‘‘నా కిటికీలు అన్ని తెరిచి చూస్తాను స్వచ్ఛమైన గాలి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరిస్తాను’’ అంటూ ఆ గాంధీ అంబేద్కర్ మధ్యన లేని వైరుధ్యాలను సృష్టించి వాళ్లకు వాళ్లే సంతోషపడేన్నారని విమర్శించారు. అని సుదర్శన్ రెడ్డి వివరించారు.