సవాళ్లకు ప్రతిసవాళ్లు.. స్టాలిన్‌కు అమిత్ షా కౌంటర్..

‘తమిళంలో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు ప్రారంభించండి’ - సీఎం ఎంకే స్టాలిన్‌కు అమిత్ షా సవాల్;

Update: 2025-03-07 08:10 GMT

త్రిభాషా విధానం అమలుపై దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాట(Tamil Nadu) పెద్ద చర్చే జరుగుతోంది. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన మూడు భాషల అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే హిందీని బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుపై కేంద్ర మంత్రులు అమిత్ షా స్పందించారు.

ఆ వెసులుబాటు కల్పించింది మోదీనే..

హిందీ భాష‌ను వ్యతిరేకిస్తున్న స్టాలిన్‌కు అమిత్ షా(Amit Shah) కాస్త గట్టిగానే కౌంట‌ర్‌ ఇచ్చారు. ‘‘మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్థానిక భాష‌ల్లో ప‌రీక్షలు రాసే వీలు క‌ల్పించింది. ఇప్పుడు సీఐఎస్ఎఫ్ ప‌రీక్షను కూడా త‌మిళంలో రాయొచ్చు’’ అని త‌మిళ‌నాడు రాణిపేట్‌లో జ‌రిగిన 56వ సీఐఎస్ఎఫ్‌ రైజింగ్ డే ఈవెంట్‌లో షా అన్నారు.

స్టాలిన్ అలా చేయగలరా?

‘‘భార‌తీయ సంస్కృతిని బ‌లోపేతం చేయ‌డంలో త‌మిళ‌నాడు కీల‌క పాత్ర పోషిస్తోంది. పాల‌నా సంస్కర‌ణ‌లైనా, ఆధ్మాత్మిక చింతనైనా, విద్య అయినా.. దేశ స‌మ‌గ్రత‌, ఐక్యత అయినా త‌మిళ‌నాడు పాత్రను విస్మరించ‌లేం. రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో ప్రారంభించాలని తమిళనాడు సీఎంను కోరుతున్నా. ఇది విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనకరం," అని షా పేర్కొన్నారు.

స్టాలిన్ సవాల్..

‘‘ 2026 తమిళనాడు ఎన్నికల్లో మూడు భాషల విధానాన్ని ప్రధాన అజెండాగా పెట్టాలని బీజేపీకి సవాల్ విసురుతున్నా. తమిళ ప్రజలు ఎలా సమాధానం చెబుతారో తేలిపోతుంది’’ అని స్టాలిన్ హెచ్చరించారు. స్టాలిన్ తన పోస్టులో.. ‘‘జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) లక్ష్యాలను తమిళనాడు ఇప్పటికే సాధించింది. కేంద్రం తీరు ఒక LKG స్టూడెంట్ PhD హోల్డర్‌కు ఉపన్యాసం ఇచినట్లుంది.’’ అని ఎద్దేవా చేశారు.

ఇతర ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది..

తమిళనాడులో కొంతమంది బీజేపీ నేతలు హిందీ భాష నేర్చుకోవడం మంచిదేనంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రయాణించే వారికి ఉపయోగపడుతుందన్నది వారి అభిప్రాయం. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె. అన్నామలై మాట్లాడుతూ.. "కేంద్రం తమిళనాడులో కొన్ని రైళ్లకు తమిళ పేర్లు పెట్టింది. అయితే యూపీఏ హయాంలో స్టాలిన్ ఏమి చేశారు? కేంద్ర ప్రభుత్వ పథకాలకి తమిళ నామకరణం చేయడంలో స్టాలిన్ ఎందుకు విఫలమయ్యారు?" అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News