దేవతలపై అనుచిత వ్యాఖ్యలు..రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రిలో కేసు

సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ల మీద అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఇది వరకే ఆయన మీద కేసులు ఉన్నాయి.

Update: 2025-10-18 05:32 GMT

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) మరోసారి వివాదాల మధ్య చిక్కుకున్నారు. హిందూ దేవతలపై అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై రామ్ గోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేశారు.  రాజమండ్రి స్థానిక న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. దీంతో  2025 అక్టోబర్ 17న రాజమండ్రి మూడో పట్టణ (త్రీ టౌన్) పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. 487/2025 క్రైమ్ నంబరుతో కేసు నమోదైంది.                                                                           

ఆరోపిత సెక్షన్లు: BNS యాక్ట్ కింద 196(1), 197(1), 353, 354, 299 r/w 3

ఫిర్యాదుదారు: రాజమండ్రి స్థానిక న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్.

ఇతర ఆరోపితులు: ఒక టీవీ ఛానల్ యాంకర్ (పేరు పేర్కొన లేదు). 

కారణం: ఆర్‌జీవీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హిందూ దేవతలపై అపమానకరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో. ఇది హిందూ సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఫిర్యాదిదారు, ఆ వ్యాఖ్యలు మత ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  అయితే ఈ కేసుపై ఇంత వరకు రామ్ గోపాల్ వర్మ స్పందించ లేదు. ఆర్‌జీవీపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మత విషయాలపై సోషల్ మీడియా పోస్టుల పెట్టారని, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల మీద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ల మీద అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఇది వరకే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మరో సారి వార్తల్లో నిలిచారు. ఇది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News