టీడీపీ ఎమ్మెల్యే 'పుట్టా' డిజిటల్ అరెస్ట్ అంటే ఎందుకు భయపడ్డారు?

సైబర్ నేరగాళ్లకి రూ. 1 కోటి ఎందుకు సమర్పించుకున్నారు.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా?

Update: 2025-10-18 05:59 GMT
పుట్టా సుధాకర్ యావద్ గ్రాఫిక్స్
సైబర్ నేరాలకు అంతులేకుండా పోయింది. పేద, ధనిక అనే సంబంధం లేకుండా ఎంపీ, ఎమ్మెల్యే అనే తేడా లేకుండా సైబర్ నేరస్తులు యధేచ్ఛంగా మోసాలకు పాల్పడుతున్నారు. కొద్ది కాలం కిందట జనసేన కాకినాడ ఎంపీని వంచించిన సైబర్ నేరగాళ్లు తాజాకా టీడీపీ ఎమ్మెల్యేకి టోపీ వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తుత్తి ‘డిజిటల్‌ అరెస్ట్‌’కు భయపడి – టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్‌ యాదవ్‌- ఏకంగా ₹1.07 కోట్లు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
‘డిజిటల్‌ అరెస్ట్‌’ మోసాల ముప్పు పెరుగుతున్న తీరును ఈ ఘటన మరోసారి బట్టబయలు చేసింది.వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్‌ యాదవ్‌ సైబర్‌ నేరగాళ్లకు బలి అయ్యారు.

ముంబయి సైబర్‌ క్రైమ్‌ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఆయనకు టోకరా వేశారని సమాచారం. మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బు గుంజారు. ‘ప్రొవిజినల్‌ బెయిల్‌’ పేరుతో ₹1.07 కోట్లను ఆయనతోటే నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
మోసం ఎలా జరిగింది?
వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు నియోజకర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నివాసంలో ఉండగా ఈ ఘటన జరిగింది. చంద్రబాబు సహా టీడీపీ ప్రముఖుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడైన ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ కు అక్టోబర్‌ 10 ఉదయం 7.30 గంటలకు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి తనను పరిచయం చేసుకుంటూ- ముంబయి సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారి గౌరవ్‌ శుక్లా అని, సుధాకర్‌ పేరుతో మనీ లాండరింగ్‌ కేసు నమోదయిందని చెప్పారు. 'మీ పై 17 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మీ ఆధార్‌, సిమ్‌ కార్డు వాడి నకిలీ బ్యాంక్‌ ఖాతా కూడా తెరిచారని' తెలిపాడు.
అంతటితో ఆగకుండా మరింత బెదరగొట్టేలా.. 'ముంబయిలోని బాంద్రాలో కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు అక్రమ లావాదేవీలకు ఉపయోగపడిందని' పేర్కొన్నాడు. సుధాకర్ యాదవ్ ఇదంతా విని కాసేపు ఏమీ పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయాడు.
ఆ తర్వాత కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి ‘విక్రం’ పేరుతో వాట్సాప్‌ వీడియో కాల్‌లోకి వచ్చాడు. తాను సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారి అని చెప్పి,
నకిలీ అరెస్ట్‌ వారెంట్‌, సీబీఐ అకౌంట్‌ ఫ్రీజ్‌ ఆర్డర్‌, ‘సదాకత్‌ ఖాన్‌’ అనే నిందితుడి ఫోటో చూపించి నిజమనిపించాడు.
దీంతో ఏమి చేయాలో తెలియక గందరగోళ పడిన సుధాకర్ యాదవ్ తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. మోసగాళ్లు సుధాకర్‌కు- కెనరా బ్యాంక్‌ ఖాతాలో ₹3 కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు.

దాంతో భయపడిపోయిన సుధాకర్ యాదవ్ అక్టోబర్‌ 10 నుంచి 15 మధ్య 9సార్లుగా మొత్తం ₹1.07 కోట్లు పంపించారు. అయినా ఆ తర్వాత మోసగాళ్లు మరో ₹60 లక్షలు అడిగి... ‘కోర్టు క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌’ ఇస్తామని చెప్పడంతో సుధాకర్‌ మోసపోయినట్టు గుర్తించారు.
ఆ వెంటనే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించి గురువారం రాత్రి కేసు నమోదు చేయించారు.
హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita), సమాచార సాంకేతిక చట్టం (IT Act)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'పోలీసులు, సీబీఐ లేదా ఇతర చట్ట అమలు సంస్థల పేరుతో ఫోన్‌ కాల్స్‌ వస్తే నమ్మవద్దు' అని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా చట్టాలు చేసే ఓ ప్రజాప్రతినిధినే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
Tags:    

Similar News