‘ప్రచార సభలకు అనుమతి ఇవ్వొద్దన్న స్టాలిన్’
మద్రాసు హైకోర్టు సూచనతో పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తమిళనాడు సీఎం..
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు(High Court ) ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (SOP) రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు విధి విధానాలు రూపొందించే వర ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభ లేదా ప్రచార సభకు అనుమతి ఇవ్వవద్దని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్ (CM Stalin).
విచారణ సందర్భంగా.. కరూర్ విషాద ఘటనపై సీబీఐ(CBI)తో విచారణ జరిపించాలని కోరిన చెన్నైకి చెందిన న్యాయవాది, దేశీయ మక్కల్ శక్తి కట్చి అధ్యక్షుడు ఎంఎల్ రవి దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది. "పిటిషనర్‌కు బాధితుల్లో ఏ ఒక్కరితోనూ ఎలాంటి సంబంధం లేదు. పైగా రవి రాజకీయ నాయకుడు. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉంది." అంటూ జస్టిస్ దండపాణి రవి పిటీషన్‌ను తోసిపుచ్చారు.
ఇప్పటికే పోలీసుల అనుమతి పొందిన పార్టీలు ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. అయితే హైవేలకు, రాష్ట్ర రహదారుల దగ్గర బహిరంగ సభలు పెట్టవద్దని నొక్కి చెప్పింది. అలాగే
సభకు వచ్చే ప్రజల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్స్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని పార్టీలకు సూచించింది.
ఇదిలా ఉండగా.. ఈ సంఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకులు బుస్సీ ఆనంద్, సీటీఆర్ నిర్మల్ కుమార్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.