పశ్చిమ కనుమలపై దక్షిణాది రాష్ట్రాల వైఖరి మారదా?
పశ్చిమ కనుమలు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రదేశాలుగా పేరు పొందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయి. తమిళనాడు కేంద్రం..
By : Praveen Chepyala
Update: 2024-08-13 06:26 GMT
(ప్రమీలా కృష్ణన్)
కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రజలు మరణించారు. అయినప్పటికీ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలుగా పేరుపొందిన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను నటిస్తున్నాయి.
2014 లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడుతో సహా ఈ ఆరు రాష్ట్రాలు తమ భూభాగాల్లోని ఎక్కువ భాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా (ESA) ప్రకటిస్తూ కేంద్రం ప్రతిపాదించిన ఐదు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లను తిరస్కరించాయి. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన మరుసటి రోజే, మొత్తం 56,800 చదరపు కిలోమీటర్ల పశ్చిమ కనుమలను రక్షించాలని కోరుతూ కేంద్రం ఆరవ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అత్యవసరంగా జారీ చేసింది.
అయితే, ఈ రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో మాత్రం ఈ డ్రాఫ్ట్‌లో రిజర్వ్ ఫారెస్ట్‌ల పెద్ద ప్రాంతాలను మాత్రమే ESAలుగా చేర్చారు. అయితే ప్రైవేట్ ప్లాంటేషన్‌లు, పర్యాటక ప్రాంతాలతో సహా అధిక-ప్రమాదకర జోన్‌లను మినహాయించారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ ముసాయిదాలు తయారు చేశారని తెలుస్తోంది.
ఎవరెవరూ ఏమేమీ కోల్పోతారు?
పశ్చిమ కనుమలు భారతదేశ పశ్చిమ తీరం వెంబడి తాపీ నది నుంచి కన్యాకుమారిలోని స్వామితోప్పే వరకు 1,600 కి.మీ. వరకూ విస్తరించి ఉన్నాయి. UNESCO వీటిని అధిక జీవ వైవిధ్యం గల ప్రాంతంగా గుర్తిచింది. ఇక్కడ జీవవైవిధ్యం ప్రపంచంలోని ఎనిమిది "హాటెస్ట్ హాట్‌స్పాట్‌లలో" ఒకటిగా ఉంది.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లోని ప్రతిపాదిత ESAలు ఈ క్రింది విధంగా పంపిణీ చేయబడ్డాయి. కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్రలో 17,340 చదరపు కిలోమీటర్లు, కేరళలో 9,993.7 చదరపు కిలోమీటర్లు, తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు, గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు, గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్లుగా డ్రాప్ట్ లో ప్రతిపాదించారు.
ESAలను ప్రకటించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాల్లో మైనింగ్, క్వారీ, రెడ్-కేటగిరీ పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్రాజెక్టుల స్థాపనపై నిషేధాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదానికి ముందు సమగ్ర ప్రభావ అంచనాల మదింపు అవసరం.
పర్పస్ ఏంటీ..
తమిళనాడు డ్రాఫ్ట్‌లో కొన్ని హై-రిస్క్ జోన్‌లు మాత్రమే ఉన్నాయని, జనసాంద్రత అధికంగా ఉండే ప్రైవేట్ భూములు, పర్యాటక ప్రదేశాలు, వాణిజ్య జోన్‌లను మినహాయించారని ఒక నిపుణుడు తన పేరు చెప్పకూడదనే షరతుపై ది ఫెడరల్‌తో చెప్పారు. ఇది దాదాపు 50 గ్రామాలు పర్యాటక ప్రాంతాలను వదిలివేసిందని నిపుణుడు చెప్పారు.
2013 కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులను పూర్తిగా విస్మరించింది - దీని ఆధారంగా 135 గ్రామాలను చేర్చి ముసాయిదాలు రూపొందించారు. ఇదే అంశంపై ప్రఖ్యాత పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తా మాట్లాడుతూ.. అధిక జనాభా కలిగిన ప్రైవేట్ భూములు, గ్రామాలు, పర్యాటక ప్రదేశాలను చేర్చడంలో ప్రభుత్వం విఫలమయింది. ఇక నోటిఫికేషన్ కు అర్థం ఏముందని ప్రశ్నించారు.
ఎదురుదెబ్బ తగులుతుంది.. నిపుణులు
'' రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టులను కలుపుకుని గ్రామాలను, ప్రైవేట్ భూములను వదిలిపెట్టినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే సంరక్షించబడిన రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలతో పోలిస్తే దట్టమైన జనాభా ఉన్న ప్రాంతాలు, తోటలు [పర్యావరణ వైపరీత్యాల] అధిక ప్రమాదాన్ని కలగజేస్తున్నాయి ” అని దత్తా చెబుతున్నారు.
“కస్తూరీరంగన్ నివేదికలో పేర్కొన్న గ్రామాలు నిర్దిష్ట మండలాలను చేర్చడంలో రాష్ట్రాలు విఫలమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను ఆదేశించవచ్చు. కానీ రాష్ట్రాల మధ్య సంబంధాల దృష్ట్యా అది జరిగే అవకాశం చాలా తక్కువ.” అని అన్నారాయన. రాష్ట్రాలు సమర్పించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లను కేంద్రం సమీక్షిస్తుందని, వాటిని పునర్నిర్మించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన అన్నారు.
'' పర్యాటక సంస్థలు, పరిశ్రమల ఒత్తిడి, అడవి గ్రామాల్లో నిరసనలు చెలరేగే ప్రమాదం ఉంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. కానీ పశ్చిమ కనుమలలో క్రమబద్ధీకరించని అభివృద్ధి ప్రాజెక్టులు, కాంక్రీట్ నిర్మాణాలు ఎల్లప్పుడూ చాలా ప్రమాదంలో ఉన్నందున ఇది వాస్తవానికి వారిపై ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేదు.
సైంటిస్ట్ లివిడ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్త టీవీ రామచంద్ర వంటి నిపుణులు ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన మునుపటి ముసాయిదాలను రాజకీయ పార్టీలు రూపొందించిన పత్రాలకు భిన్నంగా కనిపించడం లేదని విమర్శించారు.
“రాష్ట్ర ప్రభుత్వాలు స్లీప్ మోడ్‌లో ఉండటం, ఒకదాని తర్వాత ఒకటి జరిగే విపత్తుల కోసం ఎదురుచూడడం దిగ్భ్రాంతికరం. గాడ్గిల్ కమిటీ నివేదికతో పోలిస్తే సిఫార్సు చేయబడిన ESAల పరిమాణాన్ని తగ్గించడం కోసం కస్తూరిరంగన్ నివేదికతో మనలాంటి నిపుణులు ఇప్పటికే విసుగు చెందారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వాలు హై-రిస్క్ జోన్‌లను చేర్చడానికి కూడా సిద్ధంగా లేవు. కేవలం 'డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లు' టూరిజం ప్రాజెక్టుల నుంచి ఆదాయాన్ని ఆర్జించడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయి,” అని రామచంద్ర ది ఫెడరల్‌తో అన్నారు.
పశ్చిమ కనుమల రక్షణ కోసం కీలకమైన మండలాలను గుర్తించేందుకు మొదటగా ఏర్పాటైన మాధవ్ గాడ్గిల్ కమిటీ తన 2011 నివేదికలో దాదాపు 64 శాతం ప్రాంతాన్ని కనిష్ట అభివృద్ధికి ESAగా ప్రకటించాలని సిఫారసు చేసింది. అయితే, రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం తరువాత కస్తూరిరంగన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ESAని 37 శాతానికి తగ్గించింది.
పునరావృత ఖర్చులు
ఈఎస్‌ఏలను అమలు చేయకపోవడం వల్ల జీవనోపాధిపై ప్రభావం పడడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరుగుతుందని, ప్రతి విపత్తు తర్వాత ప్రభావిత మండలాలను పునర్నిర్మించాల్సి వస్తుందని రామచంద్ర చెబుతున్నారు.
“కర్ణాటకలోని కొడగులో 2018లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. 2024లో వయనాడు, నీలగిరి లో కూడా అనేక కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ముసాయిదాతో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త డ్రామాకు తెరలేపుతున్నాయి. ఈ ముసాయిదాల అమలుపై కూడా నాకు ఆశ లేదు. ESAలను అమలు చేయకపోవడమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎజెండా,” అని శాస్త్రవేత్త మండిపడ్డారు.
హెచ్చరిక వ్యవస్థపై..
ఇఎస్‌ఎ నోటిఫికేషన్‌లో ప్రైవేట్ భూములు, పర్యాటక కేంద్రాలను చేర్చకపోవడంపై తమిళనాడు అటవీ శాఖ మంత్రి ఎం మతివెంతన్ ను ది ఫెడరల్ సంప్రదించింది. అయితే ఆయన నుంచి సమాధానం రాలేదు. అటవీ శాఖ కార్యదర్శి పి.సెంథిల్‌కుమార్‌కు కూడా పలుమార్లు కాల్‌లు, మెసేజ్‌లు చేసినా స్పందించలేదు.
వయనాడ్ కొండచరియలు విరిగిపడిన తర్వాత పశ్చిమ కనుమల రక్షణ చర్యలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తమిళనాడు పర్యావరణ శాఖ మంత్రి వి మెయ్యనాథన్ తెలిపారు.
"మేము ఒక సమావేశాన్ని నిర్వహించం. భారీ వర్షాలు, మేఘావృతాలను అంచనా వేయడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించడానికి నిపుణుల అభిప్రాయాన్ని కోరాము. కొండచరియలు విరిగిపడటం వంటి అత్యవసర సమయంలో స్థానిక ప్రజలను అధిక-ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఒక హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, ”అని ఆయన చెప్పారు.
ఈఎస్‌ఏ ముసాయిదా నోటిఫికేషన్‌లో ప్రైవేట్ భూములు, గ్రామాలను వదిలిపెట్టడంపై ప్రశ్నించగా.. ఆ వివరాలను అందజేసేందుకు అటవీ శాఖ సరైన అధికారమని చెప్పారు.