ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించిన సిద్ధరామయ్య ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ..
కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి హైకోర్టు(High court)లో చిక్కెదురైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మార్చ్‌కు అనుమతి ఇచ్చింది. చిత్తాపూర్‌లో అక్టోబర్ 19న మార్చ్ నిర్వహించాలని RSS నిర్ణయించుకుంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు మార్చ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ కలబురగి కన్వీనర్ అశోక్ పాటిల్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంజిఎస్ కమల్ ప్రత్యేక కోర్టు పిటిషన్‌ను విచారించింది. అదే రోజు భీమ్ ఆర్మీ, భారతీయ దళిత్ పాంథర్ లాంటి సంస్థలు కూడా చిత్తాపూర్‌లో ర్యాలీలు నిర్వహిస్తున్నందన ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అందుకే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ అధికారులు కోర్టుకు తెలిపారు.
అందరి మనోభావాలను గౌరవించాలంటూనే ..మరో తేదీ ఖరారు చేసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని కోర్టు కోరింది. దాంతో నవంబర్ 2న ర్యాలీ నిర్వహిస్తామని కోర్టుకు చెప్పారు. అనుమతి కోసం రూట్ మాప్‌తో కలబురగి డిప్యూటీ కమిషనర్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు తీర్పుపై కాషాయ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కాగా బహిరంగ ప్రదేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ పంచాయతీ రాజ్, ఐటీ/బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయనను చంపుతామన్న బెదిరింపును కూడా పోలీసులు కోర్టుకు విన్నవించారు.
బీజేపీకి సిద్ధరామయ్య కౌంటర్..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి కావాలని అనుమతి ఇవ్వలేదన్న బీజేపీ నాయకుల మాటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాంగణాలను ఉపయోగించుకునే ప్రైవేట్ సంస్థలు, సంఘాలు ముందస్తుగా సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలి. ఇది మేం పెట్టిన నిబంధన కాదు. జగదీష్ షెట్టార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో తీసుకోచ్చిన రూలు. మేం దాన్ని అమలు చేస్తున్నాం. అంతే " అని సమాధానమిచ్చారు.
హైకోర్టు తీర్పును కర్ణాటక బీజేపీ విభాగం స్వాగతించింది. "చితాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సంచాలన్‌ను నిషేధించాలని చూసిన వారికి తగిన శాస్తి జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశ పాలనకు చోటు లేదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది." అని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యెడియురప్ప ఎక్స్‌లో పోస్టు చేశారు.