రెండు చోట్లా ఓడినా.. పవన్‌ కల్యాణ్‌ హవా ఎందుకు పెరిగింది?

అటు పార్లమెంటులో గాని ఇటు అసెంబ్లీలో గాని ఒక్క సీటూ లేని పవన్‌ కల్యాణ్, ఆయన పార్టీ జనసేనపైన్నే అందరి చూపు నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు

By :  Admin
Update: 2024-04-11 09:01 GMT

పవన్‌ కళ్యాణ్‌.. ఓ సూపర్‌ స్టార్‌. జగమెరిగిన నటుడు. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో పేరు గాంచారు. దశాబ్దం కిందట రాజకీయరంగంలో ప్రవేశించారు. తన సోదరుడు చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యంలో కీలకభూమికే పోషించినా ఆ పార్టీ అర్థంతరంగా ముగిసి పోవడంతో తానే సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసి నడుపుకొస్తున్నారు. చిత్రమేమిటంటే అటు పార్లమెంటులో గాని ఇటు అసెంబ్లీలో గాని ఒక్క సీటూ లేని పవన్‌ కల్యాణ్, ఆయన పార్టీ జనసేనపైన్నే అందరి చూపు నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 151 సీట్లూ, 22 పార్లమెంటు సీట్లున్న అధికార పార్టీ వైసీపీ మొదలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాననే చంద్రబాబు వరకు అందరూ పవన్‌ కల్యాణ్‌ నే టార్గెట్‌ చేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోదీ, అమిత్‌ షా వంటి వారు పవన్‌ కల్యాణ్‌ కే ప్రాధాన్యత ఇవ్వడం వెనుకున్న రహస్యమేమిటనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాగుతోంది. అంత ప్రత్యేకత ఏముంది ఆయనలో అనేది అంతుబట్టడం లేదంటున్నారు ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నో నుంచి ఎలక్షన్‌ కవరేజీకి వచ్చిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు హసన్‌ షరీఫ్‌.

ఏమిటీ పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకత..

ఓసాదా సీదా పోలీసు కానిస్టేబుల్‌ కుటుంబంలో పుట్టిన పవన్‌ కల్యాణ్‌ అంతర్ముఖి అంటుంటారు. సులువుగా ప్రభావితమయ్యే మనస్తత్వం ఉన్నవారు. 1968లో జన్మించిన పవన్‌ కల్యాణ్‌ 1996లో సినీ అరంగేట్రం చేసి అసాధారాణ రీతిలో సక్సెస్‌ సాధించారు. అత్తారింటికి దారేదీ సినిమాతో ఇండియన్‌ ఫోర్బ్‌ పత్రిక ఇచ్చిన ర్యాంకు ప్రకారంలో వంద మంది ప్రముఖ భారతీయ నటుల్లో 51వ వానిగా నిలిచారు. సరిగ్గా అదే సమయంలో ఆయన సొంత పార్టీతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు. విభజనతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ లో తొలిసారి ఎన్నికలు జరిగిన 2014లో ఆయన గానీ ఆయన పార్టీ గాని పోటీ చేయలేదు. తెలుగుదేశం, బీజేపీకి మద్దతు పలికారు. టీడీపీ ఏపీలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.

పవన్‌ కల్యాణ్‌ బలమెంత?

ఏపీలోనే దేశం అంతటా ప్రాంతీయ పార్టీలు వ్యక్తిప్రాబల్యంతోనే కుల బలంతోనో ఈరెండు కాకుంటే డబ్బు ప్రాబల్యంతోనే ఏర్పడినవే. పవన్‌ కల్యాణ్‌ అవునన్నా కాదన్నా ఆయనకు గాని ఆయన పార్టీకి గాని బలం ఆయన సామాజిక వర్గమే. అది కాపు సామాజిక వర్గం. కాపులో ఉపకులాలుగా ఉన్న బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వంటివి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాయనడంలో సందేహం లేదు. దీనికి తోడు నటునిగా ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట, ఇమేజీ, పాపులారిటీ కూడా పనికి వచ్చాయి. ఫలితంగా పవన్‌ కల్యాణ్‌ పెద్ద ఫిగర్‌గా రాజకీయాల్లో నిలిచారు. మరోపక్క ఆయన సోదరుడు చిరంజీవి, ఆయన భావ అల్లు అరవింద్‌ వంటి వారు కూడా పవన్‌ కల్యాణ్‌కి అదనపు బలం. సినీరంగాన్ని శాసించే కుటుంబాల్లో చిరంజీవిది ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

2014లో పోటీకి దూరం, 2019లో పోటీ...

2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కింగ్‌ మేకర్‌గా ఉన్న పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో జతకట్టి పోటీ చేశారు. ఒక్క రాజోలు తప్ప మరెక్కడా గెలవలేకపోయారు. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన– గాజువాక, భీమవరం– రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. తన సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మొదలు పార్టీ నేతల వరకు ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పెళ్లిళ్లను, విడాకుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలే చేశారు. వాటిని తనొక్కడే తిప్పికొట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో కొంతకాలం సినిమాలకే పరిమితమైన పవన్‌ కల్యాణ్‌ తిరిగి చంద్రబాబు అరెస్ట్‌ తో రాజకీయ తెరపై యాక్టివ్‌ అయ్యారు. ఈ సందర్భంలోనూ వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వదిలిపెట్టలేదు. తీవ్రాతితీవ్రంగానే విమర్శించారు.

రెండు చోట్లా ఓడిన పవన్‌ ప్రభావం ఎందుకు పెరిగిందీ?

151 సీట్లతో కట్టుదిట్టంగా ఉన్న వైసీపీ అధినేత జగన్‌ మొదలు అందులో పేరున్న మంత్రులు పేర్ని నానీ, అంబటి రాంబాబు, మరికొందరు కాపు నేతలు పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారనేది ప్రశ్న. నిజానికి పవన్‌ కల్యాణ్‌కి అంత బలం లేకపోతే చాలామందిని వదిలేసినట్టే పవన్‌ కల్యాణ్‌ను మినహాయించి ఉండవచ్చు. కానీ అలా చేయడానికి ఎందుకు టార్గెట్‌ చేశారంటే... పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి ఓ యూత్‌ ఐకాన్, అన్నింటికి మించి తన వెనుక రాష్ట్రంలో దాదాపు 17 శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఉంది. వాళ్లందరూ ఆయన మాట వినకపోయినా ఎంతో కొంత ప్రభావం ఉంటుందనేది వైసీపీ నేతలకు తెలుసు. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నాయకత్వం వహిస్తున్న టీడీపీకి రెడ్డి సామాజికవర్గం నాయకత్వం వహిస్తున్న వైసీపీకి మధ్య ఉన్న తేడా దాదాపు పది శాతం.

ప్రస్తుతం రాష్ట్రం కులాల వారీగా విడివడి ఉన్న మాట నిజం. ఆవేళ టీడీపీని ఓడించింది ఈ కులాల కుమ్ములాటలే. చంద్రబాబు చేసుకున్న స్వయంకృతాపరాధాలే. మూడు పార్టీలను మూడు ప్రధాన కులాలకు చెందిన వారే నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగై పోవడంతో ఆ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీ వైపు చేరాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అందించిన సేవలు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌కు పనికి వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై వైఎస్‌ జగన్‌ చేసిన తిరుగుబాటు, తన పోరాటపటిమ వంటివి పనికి వచ్చాయి. అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతటి పట్టుదల, కుల బలం ఒక్క పవన్‌ కల్యాణ్‌ కే ఉందన్నది వైసీపీ భావన కావొచ్చునంటారు సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌. చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే పవన్‌ కల్యాణ్‌ మద్దతు తప్పనిసరి అని కూడా నాగేశ్వర్‌ వాదన. ఇవన్నీ ఎలా ఉన్నా పవన్‌ కల్యాణ్‌కి ఆరేడు శాతం ఓట్లున్నాయి. పొత్తులో భాగంగా వాటిని సక్సెస్‌ఫుల్‌గా టీడీపీ వైపు తిప్పుకోగలిగితే జగన్‌ ను ఓడించవచ్చని చంద్రబాబు భావన. కాపులకీ కమ్మలకీ సుదీర్ఘకాలంగా ఉన్న వైరి భావనను మరింత పెంపొందించి కాపులు టీడీపీవైపు సమీకృతం కాకుండా చూడాలన్నది జగన్‌ లెక్క. చంద్రబాబు, జగన్‌కి అధికారానికి సంబంధించిన లెక్కలు ఉండి ఉండవచ్చు. మరి బీజేపీ ఎందుకు పవన్‌ కల్యాణ్‌కి అంత ప్రాధాన్యత ఇస్తోందనే ప్రశ్నా లేకపోలేదు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు మధులిమాయే చెప్పినట్టు కాపులు బలమైన సామాజికవర్గమని, వాళ్లకు అధికారం రావాలంటారు. ఆ లెక్కలు బీజేపీకి బాగా తెలుసుకనుకనే పవన్‌ కల్యాణ్‌ను వాళ్లు వదులుకోవాలనుకోవడం లేదు. రకరకాల ప్రయోగాలు చేసినా కమలం పార్టీ పుంజుకోవడం లేదు. మున్ముందు పవన్‌ తో ప్రయోగాలు చేయించాలన్నది వాళ్ల ఉద్దేశం కావొచ్చు.

ఏదిఏమైనా, రెండు చోట్లా ఓడినా, అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా పవన్‌ కల్యాణ్‌ ప్రభావం పెరిగిందే తప్ప తరగలేదు. ఆయనకు కొత్తగా వచ్చే ఇమేజీ కూడా ఏమీ లేదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమంగా పని చేయడమే తనకు తెలుసునన్నారు జనసేన నాయకుడు యడ్ల నరసింహారావు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌ షా లాంటి నాయక ద్వయం– చంద్రబాబుకు ఇవ్వని ప్రాధాన్యత పవన్‌ కల్యాణ్‌ కు ఇస్తున్నారన్నది మాత్రం నిజం. వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ ను టార్గెట్‌ చేసి విమర్శించడం కూడా అంతే సహజం. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వయసు 52 ఏళ్లు. ఏ లెక్కన చూసినా రాజకీయాల్లో పిన్న వయస్కుడే.

Tags:    

Similar News