సర్వే సంస్థలు ఎక్కడ గాడి తప్పాయి, ఇకనైనా పాఠాలు నేర్చేనా?
పలు మీడియా సంస్థలు, సర్వే ఎజెన్సీల ముందస్తు అంచనాలు విభిన్నంగా ఉండటమే కాదు, అందులో అత్యధికుల అంచనాలు తారుమారు కూడా అయ్యాయి. నేర్చుకుంటే, వారికిదొక గుణపాఠం!
దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దాదాపు మెజారిటీ ప్రజానీకం తలపోసిన రీతిలోనే వచ్చాయి. దేశ ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని ప్రతిబింబించాయనవచ్చు! పలు మీడియా సంస్థలు, సర్వే ఎజెన్సీల ముందస్తు అంచనాలు విభిన్నంగా ఉండటమే కాదు, అందులో అత్యధికుల అంచనాలు తారుమారు కూడా అయ్యాయి. నేర్చుకుంటే, వారికిదొక గుణపాఠం!
విపక్ష ‘ఇండియా కూటమి’ స్థానాల సంఖ్య 150 లోపలే అని 14 ఎజెన్సీలు చెబితే, అందుకు భిన్నంగా కూటమి సంఖ్య 240 కి చేరింది. మరోమాటలో చెప్పాలంటే, ఈ ఎన్నికలు ఇంకొకసారి ‘ఎగ్జిట్ పోల్స్’ శాస్త్రీయతను పరీక్షించాయి. ఫలితాలకు, ‘పెయిడ్ ఎగ్జిట్ పోల్స్’కి మధ్య నిత్యం వస్తున్న భారీ తేడా వాటి నిజాయితీని, నిబద్దతను ప్రశ్నిస్తున్నది. ప్రఖ్యాత రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్ ఇలా రాశారు: ‘‘అయితే ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అయినా చెప్పి ఉండాలి. లేదా ఇంటర్వ్యూ చేసిన ఓటర్లు ఎగ్జిట్ పోల్స్ కు అబద్ధం చెప్పారో? అదీ కాదంటే, ఎగ్జిట్ పోల్స్ కొరకు అవలబించిన పద్దతులలో, శాస్త్రీయతలోనైనా లోపాలు ఉండాలి’’. అన్నారాయన. స్పోర్ట్స్ వ్యాఖ్యాత సుమంత్ రామన్ అన్నారు: ‘‘ఎగ్జిట్ పోల్స్ చేసిన వారు జవాబుదారీగా ఉండాలి. వారు పోల్‌ను యథార్థంగా చేసి ఉంటే వారు వాస్తవిక ట్రెండ్‌లను కోల్పోయే అవకాశమే లేదు.’’ తాజా స్థితి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఆయా సంస్థలు, వ్యక్తులు అవలంబించిన పద్ధతి గురించిన లోతైన చర్చ జరగాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నది. వీళ్ళు చేసే సర్వేలలో, ఒకోసారి వోటర్లు వేళ్ళకు అందని జవాబు ఇస్తునట్టు కూడా స్పష్టం అయ్యింది. కొందరు సర్వే కూడా చేసి ఉండకపోవచ్చు. గత ఎన్నికలలో వోటింగ్ సరళి లెక్కలను ముందు వేసుకుని, తమకు తోచిన రాజకీయ సమీకరణాలను బట్టి అంచనా వేసి, అదే ప్రకటించిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి సగటు భారతీయ ఓటర్ నాడి పట్టుకోవటంలో ఉన్న సవాళ్ళను ఈ ఎన్నికలు మరోసారి ప్రస్ఫుటం చేశాయి. అనేక విధాలుగా వైవిధ్యం ఉన్న ఈ దేశంలో ఓటర్ ఆలోచనలు, ఒక్కలాగే ఉంటాయనుకోవడం, ముందే పసిగట్టటం అంత సులువు కాదు అని ఇంకొకసారి రుజువయింది. అది సర్వే ఎజెన్సీలకు అర్థమయిందా? అన్నది ప్రశ్న! ఉన్నంతలో మంచి విశ్వసనీయత కలిగిన సీఎస్‌డీఎస్`లోక్‌నీతి లాగా, తమ పద్దతులు, శాంపిల్ సైజు, పెట్టుబడి వ్యయం, దానికి ఆధారం, డాటా గణాంకాలు, వాటి అన్వయం`విశ్లేషణ ఇచ్చే నిపుణుల పేర్లు..... అన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్లో వెల్లడిరచే సంస్కృతిని సర్వే సంస్థలు అలవరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజానాడిని ముందు అంచనా వేయడం ఒక ఎత్తయితే, ఎన్నికల ఫలితాలను విశ్లేషించడం కూడా అంతే సవాలుగా మారింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలను... ఎన్నికల ఫలితాలతో సరిపోల్చే, అన్వయించే, క్రోడికరించే స్తోమత లేనివాళ్ళు కూడా ‘సెఫాలజీ’ని ఆశ్రయిస్తున్నారు. టీవీ చర్చల్లో పాల్గంటున్నారు. ఓటింగ్ శాతం తీసుకుని, కంప్యుటర్ ముందర వేసుకుని ప్రాథమిక స్థాయి విశ్లేషణ చేసేవారు ఎక్కువయ్యారు. విషయ జ్ఞానం, అన్వయ నైపుణ్యం లేకుండా... కేవలం దాని మీద ఆధారపడడం అంత మంచిది కాదు. ఫలితాల ద్వార ఓటరు ఇస్తున్న సందేశం ఏమిటి? అనే దాని మీద కూడా, వాస్తవాలతో నిమిత్తం లేకుండానే, ఎవరికి వారు ‘తమదైన అన్వయం’ చేర్చి చెప్పడం మరోవింత! ఇలా ఒకోసారి జనం సందేశాన్ని వక్రీకరించడం కూడా ఆధునిక భారత రాజకీయంలో భాగం అయిపొయింది. ఏది ఏమైనా ఫలితాల మీద కూడా లోతుగా, విస్తారంగా చర్చ జరగాలి. అటువంటి చర్చ వలననే అధికారం చేపట్టినవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు తమ తీరు సరిదిద్దుకుంటారు. లేకుంటే, ఓటరు ఇచ్చే సందేశం మరుగునపడిపోయి, మళ్ళి తమ రాజకీయాలలోకి దూరి వ్యవహరించడం వల్ల ఓటరు కోరుకున్న మార్పు పాలనలో రాకపోవచ్చు.
ఈ ఎన్నికల జరిగిన రెండు నెలల సుదీర్ఘకాలంలో ఓటర్ అభిప్రాయం పట్టుకోవటం చాల కష్టం అయ్యింది. తమ ప్రతినిధులనో, ఏకంగా పాలకులనో... మార్చాలని నిర్ణయించుకున్న ప్రజలు అది కనిపించకుండా, అంచనాలకు కూడా అందకుండా జాగ్రత్తపడ్డారనాలి. ఏది ఎందుకు? ఏ గాలి ఎటు వీస్తున్నది? అని ఇధమిద్ధంగా చెప్పే పరిస్థితి లేకపోవడం, ఒకరకంగా దిగజారిన సమకాలీన రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నది. తెలంగాణా, ఓడిశా, ఆంధ్ర ప్రదేశ్ సహా కేంద్రంలో ఏకవ్యక్తి పాలన, ఏకచత్రాధిపత్యం పట్ల వ్యతిరేకత ఓటర్లు స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తమ ఆలోచనలు మీడియాకు అందనీకుండా, తీవ్ర మార్పు తీసుకురావడం కూడా సమకాలీన రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం తగ్గింది అనడానికి నిదర్శనం. మొత్తం 175 స్థానాలలో కేవలం 10 సాధించిన అధికార పార్టి వైఎస్సార్సీపీ కి సగటు ఓటరు ‘భయపడే’ పరిస్థితికి వచ్చినట్లు కనిపించింది. ఒడిశా లో నవీన్ పట్నాయక్ 24 యేళ్ల సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడానికి బలమైన కారణం, ఒక విధంగా ‘పాండియన్’ అనే వారసుడిని ముందు పెట్టడమే కావచ్చు.
ఫలితాలను చూస్తే, దేశవ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకున్నారని స్పష్టమౌతోంది. ప్రతినిధులను మార్చేశారు. ఈ ‘మార్పుకు ఓటు’ అన్న ప్రజల పద్దతి ఏకరీతిలో వ్యక్తం కాకుండా, అక్కడ పోటి చేసిన ఆయా పార్టీలను బట్టి ఫలితాలు వచ్చాయి. అయితే, అది కేంద్ర ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఉన్నట్లు పరిణమించినా సగటు స్పందన మాత్రం ‘పాలకపక్ష (ఇంకంబెన్సీ) వ్యతిరేకత. కాకపోతే అదంత స్పష్టంగా లేదు. దాంతో, ఈ తీర్పుని వక్రీకరిస్తున్నారు. అంటే, ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు మసి పూసి రాజకీయ నాయకులు, మారేడుకాయ చేసే తమ ధోరణి కొనసాగిస్తున్నారు. బహుశ ఇది సగటు ఓటరు ఊహించి వుండరు. ఒక వేళ బీజేపీ, లేదా దాని కూటమికి మెజారిటీ రాకపోయి, అధికారం కోల్పోయి ఉంటె కాంగ్రెస్స్ తాము అధికారంలోకి రావాలనే ప్రజలు ఇష్టపడుతున్నారు అని అన్వయం చెప్పేవారు/ప్రచారం చేసుకొని ఉండేదే! బీజేపీకి/దాని కూటమికి తగ్గించి, కాంగ్రెస్/సహా ప్రతిపక్షాలకు (ఇండియా కూటమి) బలం పెంచడం అంటే, ప్రజాస్వామ్య పద్దతిలో పాలన కావాలనేది ఓటరు సగటు భావనగా మనం గుర్తించాలి. బలమైన నాయకుడు కావాలి కాని నియంత కాదు అని భావించాలి. పాలనా సంస్కరణలు కావాలి కాని రాజ్యాంగం మార్చమని కాదు అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటులో సంప్రదింపుల విధానాలు ఉండాలే తప్ప ప్రజలకు కనిపించని ‘చీకటి కారిడార్లలో’ కాదు అని భావించాలి. ధరల నియంత్రణ కావాలని కోరారే కాని ధర పెరుగుదలకు ప్రభుత్వాన్ని భాధ్యులుగా చేయలేదు అని భావించాలి. నిరుద్యోగం సమస్యను తీర్చే విధంగా అందరు కలిసి ఆలోచన చేయండి అని వోటరు సందేశం ఇచ్చినట్లుగా భావించాలి.
నరేంద్ర మోదీని కేంద్రంగా పెట్టి ఎన్నికలు జరపాలని అధికార భాజపా మొదటి నుంచి భావించింది. మొదట్లో ‘మోది గ్యరెంటి’ అని ప్రకటనలు గుప్పించి తరువాత క్రమంగా తగ్గించారు. ప్రచార సరళిని కొంత మార్చేశారు. రాహుల్ గాంధీ మొదటి పాదయాత్రకు వచ్చిన స్పందన రెండవ పాదయాత్రకు రాలేదు. మొదటి పాదయాత్ర జరిపిన రాష్ట్రాలలో అధికార భాజపాకు ఇదివరకు సీట్లు లేవు. 2024 ఎన్నికలలో తెలంగాణా తప్పితే ఎక్కడా కూడా అధికార పార్టీకి సీట్ల సంఖ్య పెరగలేదు. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమికి ఎక్కువ విజయాలు వచ్చాయి. కూటమి పక్షాన ‘మార్పుకు’ ముందుండి నడుము బిగించిన కాంగ్రెస్ కు, తాము పోటి చేసిన స్థానాలలో ఫలితాలు బాగానే వచ్చాయి. అదే రెండవ పాదయాత్ర సందర్భంలో కూడా కాంగ్రెస్స్ అనుకూల ప్రభావం ఉండి ఉండాలి. కాకపోతే, బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా దఅష్టి పెట్టలేదు. ఒక్క బెంగాల్‌లో తప్ప మిగతా చోట్ల ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే లేవు.
ఏకవ్యక్తి పాలనను వ్యతిరేకిస్తూ, భాజపాను పూర్తిగా వ్యతిరేకించకుండా, ప్రతిపక్షంలో ఏ ఒక్క పార్టీ ప్రత్యామ్న్యాయంగా కనిపించని స్థితిలో..... ఎక్కడికక్కడ పరిస్థితుల్ని బట్టి వ్యవహరించాల్సిన అగత్యం వోటర్‌కు ఏర్పడిరది. అందుకే, తమ ముందు ఉన్న అభ్యర్థిని సగటు ఓటరు మార్చినట్టు అనిపిస్తున్నది. ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి, అక్కడి ఓటర్ మీద విభిన్న ప్రభావం చూపింది. తమిళనాడు తంజావూర్ ప్రాంతంలో కరువు, వ్యవసాయానికి నీళ్ళు ప్రధాన అంశం కాగ, ఒడిశాలో రైతులకు గిట్టుబాటు ధర పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన, ఆంధ్ర ప్రదేశ్లో ‘సంక్షేమం’ కంటే నిత్య సమస్యల పట్ల సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా..... ఇలా విభిన్న కారణాలతో ఓటు వేసినట్లున్నారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో అధికార పార్టి అభ్యర్ధులు ఓడిపోయి ఇక్కడ ప్రతిపక్ష కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. విదర్భలో పత్తి రైతులు ఎక్కువ. వారి సమస్యల పట్ల స్పందించని అధికార పార్టి అభ్యర్ధులను ఓటర్లు మార్చేశారు. తెలంగాణాలో స్థానిక పార్టి బీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు, ప్రత్యర్థి పార్టీలయిన భాజపా, కాంగ్రెస్ లు పంచుకున్నాయి, ఆ మేరకే చెరో ఎనిమిదేసి స్థానాల్లో గెలిచాయి! దక్షినాది రాష్ట్రాలలో అధికార పార్టీ పరిస్థితేం మెరుగు కాలేదు, ఉత్తరాది రాష్ట్రాల్లో దిగజారింది. అయినా అధికారం పోకపోవడం... బహుశ, ఓటర్లకు కూడా ఆశ్చర్యం కలిగించే ఉండవచ్చు.
సామాజిక పత్రిక నడిపే ‘డౌన్ టు ఎర్త్’ సంస్థ ప్రకారం, లోకసభ గ్రామీణ నియోజకవర్గాలుగా పరిగణించే 344లో 159 స్థానాలలో వోటర్లు అభ్యర్ధులను మార్చేయడం అన్నది గణనీయ స్పందన. వ్యవసాయ దుస్థితి, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి పట్టించుకోనందుకు వోటర్లు ఈ పని చేశారు. తమ సమస్యలు పట్టించుకోనందుకు అక్కడ సిట్టింగ్‌లను మార్చి వేశారనుకుంటే, మరి.... 185 స్థానాలలో సిట్టింగ్ అభ్యర్ధులు తిరిగి ఎన్నికయ్యారు. దీనిని ఎలా చూడాలి? ఒక రకంగా ప్రజల వ్యతిరేకత పార్టీల మీద, ప్రభుత్వాల మీద, వారి పాలన మీద తప్పితే అభ్యర్ధుల మీద కాదేమో అనుకోవాల్సి ఉంటుంది.
ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఏకాభిప్రాయం ఆధారంగా పాలన చేయమని కూడా ఈ తీర్పు ప్రజల అంతర్లీన సందేశం కావచ్చు. రెండు కారణాలు బలంగా కనపడుతున్నాయి: నియంతఅత్వ పోకడలకు వ్యతిరేకంగా వోటు వేసినట్టు (యాంటీ డిక్టటోరియల్), పాలన తీరు పట్ల అయిష్టత (యాంటీ ఇంకంబెన్సీ) చూపినట్టు. 2014 నాటి రాజకీయ పరిస్థితులలో.... ఒక బలమైన నాయకుడు ఉంటె మంచిది అని భావించిన ప్రజలు, పదేండ్ల తరువాత 2024 పరిస్థితుల్లో... ఏక వ్యక్తి, నియంతృత్వ పాలన నచ్చక మార్పుకు ఓటు వేశారని గ్రహించాలి. తాము ఎదుర్కుంటున్న నిత్య సమస్యలపై శ్రద్దపెట్టని, పరిష్కారం చూపని పాలకులను ఇంటికి పంపించారు. స్థానిక పరిస్థితులు, సందర్భాన్ని బట్టి అది వ్యక్తులుగా ఎన్నికల గోదాలో దిగిప అభ్యర్థులు కావచ్చు, లేదా గంపగుత్తగా పార్టీలు`ప్రభుత్వాలు కావచ్చు! పౌరుల ప్రయోజనాలకుకోసం నిలబడే తత్వం లేని, ప్రజాస్వామ్య పద్దతులకు లోబడి పాలనా యోగ్యత లేని వారిని వెంటనే మార్చివేయాలనే వోటర్ ఆలోచనా సరళిని అభినందించాలి. ఇది ఎంతగా పరిపక్వత చెందితే మన ప్రజాస్వామ్యం అంతగా పరిడవిల్లుతుంది. అందులో సందేహం లేదు.
(డా. దొంతి నరసింహ రెడ్డి, ప్రముఖ విధాన విశ్లేషకులు అండ్ శ్రీ.దిలీప్ రెడ్డి, డైరెక్టర్ పీపుల్స్ పల్స్)