తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు
ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్..;
తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) శనివారం (ఆగస్టు 2) చెన్నైలో ‘నలం కాకుం స్టాలిన్’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 38 జిల్లాల్లో 1,256 వైద్య శిబిరాలను (Health camps) నిర్వహిస్తారు. వీటిల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి తదుపరి పరీక్షలు చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణలో తమిళనాడు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటికే చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలు మక్కలై తేడి మరుతువం, నమ్మై కక్కుమ్ 48, ఇనుయిర్ కప్పోమ్ తిట్టం విజయవంతమయ్యాయని చెప్పారు.
‘అవసరమైన అన్ని వైద్య పరీక్షలు..’
"నలం కాకుం స్టాలిన్ పథకం కింద గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందుతాయి. చర్మ వ్యాధులు, బీపీ, షుగర్, మానసిక, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్యపరీక్షలన్నీ చేసి హెల్త్ డేటాను భద్రపరుస్తారు. కొన్ని రకాల జబ్బులు చివరి దశలో బయటపడతాయి. ఈ వైద్య శిబిరాల వల్ల అలాంటి వాటిని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది.’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘‘జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, శిక్షణ పొందిన వలంటీర్ల సహకారంతో నిర్వహించే ఈ వైద్య శిబిరాల్లో ప్రతినెల వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు సూచిస్తారు. మొబైల్ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకూ వైద్య సేవలందుతాయి. అవయవదానంలో దేశంలో తమిళనాడుదే తొలిస్థానం’’ అని గుర్తుచేశారు.