DMK విమర్శలకు TVK చీఫ్ విజయ్ కౌంటర్..

కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కాంచీపురంలో తొలిసారి పార్టీ శ్రేణులతో సమావేశం..

Update: 2025-11-23 11:42 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu)లో తమిళగ వెట్రీ కజ్గం(TVK) చీఫ్ విజయ్ ఆదివారం (నవంబర్ 23) ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. అయితే బహిరంగంగా కాదు. నాలుగు గోడల మధ్యే. కాంచీపురంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో మాత్రమే సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని మూడు తాలూకాల నుంచి పార్టీ కార్యకర్తలను మాత్రమే ఆహ్వానించారు.


‘మా ప్రత్యర్థి డీఎంకేనే’

ఈ సందర్భంగా విజయ్ అధికార DMKను తీవ్రంగా విమర్శించారు. దివంగత నేత సీఎన్ అన్నాదురై నుంచి ద్రవిడ పార్టీని స్వాధీనం చేసుకున్న వారు ప్రస్తుతం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. టీవీకే‌కు భావజాలమే లేదన్న డీఎంకేకు.."సమానత్వం, సామాజిక న్యాయం మా అజెండా" అని కౌంటర్ ఇచ్చారు. 2026 ఎన్నికలలో ప్రధాన పోరు అధికార డీఎంకే, టీవీకే మధ్యే ఉంటుందని చెప్పారు.

విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌తో పోల్చారు. 1951లో విడుదలైన ఎంజిఆర్ ‘‘మర్మయోగి’’ చిత్రంలోని ఒక డైలాగ్‌ "మంచివాడు, అణగారిన వర్గాల కోసం పోరాడే నిర్భయ యోధుడు" అని విజయ్ ఉటంకించారు.


‘మేం స్పష్టమైన వైఖరితో ఉన్నాం..’

NEET విషయంలో డీఎంకే లాగా తాము కేవలం మాటలకు పరిమితం కాలేదని, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొంటూ.. ‘‘పరందూర్ రైతులకు అండగా నిలిచాం. కుల గణనకు డిమాండ్ చేశాం. CAAను వ్యతిరేకించాం." అని విజయ్ అన్నారు.

సెప్టెంబర్ 27న కరూర్‌(Karror)లో జరిగిన తొక్కిసలాట(Stampede) తర్వాత విజయ్ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఇదే ఏడాది జనవరిలో కాంచీపురం జిల్లాలోని ఏకనపురం ప్రజలనుద్దేశించి విజయ్ ప్రసంగించారు. పరందూర్ విమానాశ్రయ ఏర్పాటు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. సారవంతమైన భూములు, నీటి వనరులు లేని ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News