రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదు: కర్ణాటక సీఎం
ఖర్గే ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య
By : Praveen Chepyala
Update: 2025-11-23 07:48 GMT
కర్ణాటకలో అధికార పార్టీ రాజకీయాలు మంచి రసకందాయంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం కుర్చీపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ లోని ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అనంతరం మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది కేవలం మీడియా సృష్టే అన్నారు. తను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూర్ కు తిరిగి వచ్చారు.
ఖర్గేతో భేటీ తరువాత విలేకరులతో మాట్లాడిన సీఎం.. బెంగళూర్ మున్సిపల్ ఎన్నికలు సహ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపు, నిర్మాణం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఏదైన చర్చ జరిగిందా అని అడిగినప్పుడు అది కేవలం ఊహాగానాలే, మీడియానే దాన్ని సృష్టించిందని అన్నారు.
అధికార పంపిణీ..
కర్ణాటకలో రెండున్నర సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీఎం పదవి కోసం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడ్డారు. అయితే చెరో రెండున్నర సంవత్సరాల పాటు సీఎం పదవి పంచుకోవాలని అధిష్టానం ఆదేశించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం సిద్ధరామయ్య తానే 17వ సారి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతానని ప్రకటించడంలో రాజకీయ ఎత్తులు ప్రారంభమయ్యాయి.
అయితే డీకే శివకుమార్ వర్గం మాత్రం కర్ణాటకకు తదుపరి ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ ను చేయాల్సిందే అని పావులు కదుపుతున్నాయి. ఆయన వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, డజన్ మంది ఎమ్మెల్సీలు న్యూఢిల్లీలో మకాం వేశారు.
నేను అడగలేదు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో ఖర్గెను ఎందుకు కలిశారని తాను అడగలేదని సిద్ధారామయ్య చెప్పారు. ‘‘ ఎమ్మెల్యేలు ఖర్గేను ఎందుకు కలిశారనే సమాచారం కావాలనుకుంటే నిఘా విభాగం నుంచి సేకరిస్తాను. ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని నేను ఖర్గెను అడగలేదు’’ అని ఆయన అన్నారు.
‘‘ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లనివ్వండి. అంతిమంగా ప్రతినాయకుడు, ప్రతి మంత్రి, డీకే, నేను హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో త్వరలో విస్ఫోటనం జరగబోతోందని పార్టీ క్యాడర్ అందుకు సిద్ధంగా ఉండాలని జేడీఎస్ నేత, కేంద్రమంత్రి హెచ్ డీ కుమార స్వామి వ్యాఖ్యానించారు.