‘‘ఖననం చేశారన్నది నిజామా లేదా అన్నది తెలియాలి’’
ప్రజల ఒత్తిడి మేరకే సిట్ ఏర్పాటు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి ప్రకటన;
By : Praveen Chepyala
Update: 2025-07-22 11:00 GMT
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో మహిళలు, బాలికలపై జరిగిన హత్యల విషయం పూర్తిగా నిర్ధారణకు రావాలంటే ముందు అక్కడ సమగ్ర దర్యాప్తు జరపాల్సిందే అని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర అన్నారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆయన మాట్లాడారు. ప్రజలకు పూర్తి వివరాలు తెలియజెప్పడానికి ఈ చర్యను ఆలస్యం చేయడం చట్టబద్దంగా సరికాదని ఆయన అన్నారు.
‘‘ధర్మస్థల ప్రాంతంలో నివసించే ప్రజలు, ప్రగతిశీల సంస్థలు, స్థానిక సంఘాలు దర్యాప్తును కోరుతూ ఫిర్యాదును అందించాయి. కొన్ని సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. ముందు ఇది నిజంగా జరిగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. అనవసరంగా విషయాన్ని లాగడం చట్టబద్దంగా సరైనది కాదు’’ అని మంత్రి అన్నారు.
ధర్మస్థలలో తప్పు జరగలేదని అంటున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. అవి దర్యాప్తు ద్వారా నిరూపితం కావాలని అన్నారు.
దక్షిణ కన్నడ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ..జిల్లా పోలీసులు దర్యాప్తు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నప్పటికీ ప్రజల అభీష్టం మేరకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
‘‘ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల సిట్ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లకు ముఖ్యమంత్రి స్పందించారు. సిట్ లో సమర్థులైన అధికారులు ఉన్నారు. కాబట్టి వాస్తవాలు స్పష్టంగా బయటపడతాయని నేను నమ్ముతున్నాను’’ అని జాతీయ మీడియాతో చెప్పారు.
స్వాగతించిన ప్రతిపక్షం
సిట్ ఏర్పాటను ప్రతిపక్ష బీజేపీ స్వాగతించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ మాట్లాడుతూ.. ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశారనే ఆరోపణకు ప్రతిస్పందనగా సిట్ చేయడం హర్షణీయమన్నారు. నిష్పాక్షికమైన, న్యాయపరమైన దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరిని తప్పుగా ఇరికించరాదని అన్నారు.
‘‘తిరుపతి లాగే ధర్మస్థల కూడా దక్షిణ భారతంలోని లక్షలాది మంది హిందువులకు పవిత్రమైన విశ్వాస కేంద్రం’’ అని ఆయన అన్నారు. అనేక దశాబ్ధాల పాటు మృతదేహాలను పూడ్చి పెట్టారనే వాదన అసలు ఎలా బయటపడిందని ఆయన ఆశ్చర్యపోయారు.
‘‘ఏదైన వ్యక్తి దోషి అయితే వారు జవాబుదారీగా ఉండాలి. కానీ మొత్తం మత సంస్థను లక్ష్యంగా చేసుకోవడం తప్పు. సిట్ చేతిలో ఉన్న కేసుపై దృష్టి పెట్టాలి.’’ అని ఆయన అన్నారు. ఈ సమస్య కేవలం వ్యక్తులకు సంబంధించిందని బీజేపీ నాయకుడు చెప్పారు.