క్యాబినేట్ ముందుకు కర్ణాటక కులగణన నివేదిక
వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామన్న సీఎం సిద్ధరామయ్య;
By : Praveen Chepyala
Update: 2025-01-18 07:34 GMT
రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించిన నివేదికను వచ్చే క్యాబినేట్ సమావేశంలో అందజేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం తెలిపారు. కర్ఠాటక సామాజిక ఆర్థిక, విద్యా సర్వే నివేదికను అక్కడ ‘కర్ణాటక కుల గణన’ గా పిలుస్తున్నారు. ఈ నివేదికను జనవరి 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ కేబినేట్ సమావేశంలో మేము కుల గణన రిపోర్ట్ ను సమర్పించడం లేదు. కానీ వచ్చే సమావేశంలో పెడతామని ఆయన బెంగళూర్ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రిపోర్టులో ఏముందని ప్రశ్నించగా.. ఇంకా మా ముందుకు అది రాలేదని, అందులో ఏముందో తెలియదన్నారు. అలాగే మంగళూర్ బ్యాంకు దోపిడీపై నిందితులను గుర్తించాలని పోలీసులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Politics, CM Siddaramayya, Okkaliga, Lingayathకర్ణాటకలో కులగణన అంశం వివాదాస్పద అంశంగా ఉద్భవించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆధిపత్య వర్గాలైన లింగాయత్, ఒక్కలిగాలు సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదో అశాస్త్రీయ సర్వేగా పేర్కొంటూ దానిని తిరస్కరించి తాజాగా మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. 2015 లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈసర్వేను చేపట్టగా, అప్పటి వెనకబడిన తరగతుల కమిషనల్ చైర్మన్ హెచ్ కాంతరాజు కమిటీకి నేతృత్వం వహించారు.
సుమారు రూ. 169 కోట్లతో చేపట్టిన ఈ సర్వే 2016 నాటికి పూర్తయినా ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని కోల్డ్ స్టోరేజీలో పెట్టాయి. తరువాత 2020 లో బీజేపీ ప్రభుత్వం జయప్రకాశ్ హెగ్డే ని కమిషన్ చీఫ్ గా నియమించింది. హెగ్దే చివరకు ఫిబ్రవరి 29, 2024 సిద్దరామయ్య ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిప్యూటీ కమిషనర్ల నేతృత్వంలో 1.33 లక్షల మంది ఉపాధ్యాయులు సహా 1.6 లక్షల మంది అధికారులు సేకరించిన డేటా ఆధారంగా ఆధారంగా నివేదిక తయారు చేసినట్లు హెగ్దే చెప్పారు.
ప్రస్తుతం ఈ నివేదిక బయటకు వస్తే తమకు లభిస్తున్న కొన్ని ప్రయోజనాలు,రాజకీయ ఆధిపత్యం దెబ్బతింటుందని కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కర్ణాటకలో కొత్త రకం కుల సమీకరణాలు ఏర్పడానికి ఈ నివేదిక ఉపయోగడపడుతుందని అంచనాలు ఉన్నాయి.