కర్నాటక సెక్స్ స్కాండల్: ‘సిట్’ ముందు ప్రజ్వల్ లొంగిపోతాడా?
కర్నాటకను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ రోజు భారత రానున్నారనే ప్రచారం జరుగుతోంది.
By : Praveen Chepyala
Update: 2024-05-07 06:33 GMT
వందలాది మంది యువతులను వంచించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీ(ఎస్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మంగళవారం హజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూడోదశ పోలింగ్ ముగిసిన తరువాత పోలీసులు ముందుకు వస్తారని కన్నడ నాట వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. రాజకీయంగా హైప్రోఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి ఈ కేసు పైనే ఉంది. ఈ ప్రచారాన్ని జేడీఎస్ వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి.
ప్రజ్వల్ (33) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పలువురు మహిళలు ఆరోపించిన వెంటనే, ఆయన మహిళలను వేధించిన పలు వీడియోలు కర్నాటకలో మొదటి దశ పోలింగ్ జరిగిన రోజున సామాజిక మాధ్యమాల్లో విడుదల అయ్యాయి. ఈ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించిన సిట్, రేవణ్ణపై అత్యాచార కేసు నమోదు చేసింది.
ఎంపీపై బ్లూ కార్నర్ నోటీసు
కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై ఆదివారం, బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అతన్ని తిరిగి భారత్ తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సాయం చేస్తుందని తెలిపింది. ఈ కేసులో సహ నిందితుడు, అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణ అరెస్టు అయ్యారు. కోర్టు ఆయనకు మే 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ముగిసిన వెంటనే, ఏప్రిల్ 26న ప్రజ్వల్ జర్మనీకి హడావిడిగా బయలుదేరాడు. అదే సమయంలో అతడు ఉన్న అశ్లీల వీడియోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే అతని రాకకోసం అన్నిప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
మే 15న జర్మనీ నుంచి బెంగళూర్ కు ఓ టికెట్ ప్రజ్వల్ పేరు మీద బుక్ అయినట్లు కొన్ని వర్గాలు ఫెడరల్ కు చెప్పాయి. మొదట ప్రజ్వల్ మే 3న ఇండియా వస్తారని, అందుకోసం టికెట్ కూడా బుక్ చేశారని తెలిసింది. తరువాత ఎంపీపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. తరువాత ఆయన స్వయంగా ట్వీట్ చేస్తూ.. మరో వారం రోజుల్లో ఇండియా వస్తానని తెలిపారు.
విమానాశ్రయాల్లో నిఘా పెంచిన సిట్..
తాజా సమాచారం మేరకు సిట్ అధికారులు బెంగళూరు, మంగళూరు, గోవా, కొచ్చి విమానాశ్రయాల్లో నిఘా పెంచి ప్రజ్వల్ రాగానే అదుపులోకి తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న సిట్ అధికారులు నగరానికి వచ్చే విమానాల ప్రయాణీకుల జాబితాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజ్వల్ పాస్‌పోర్ట్ వివరాలను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అయితే ప్రజ్వల్ పేరుతో ఇప్పటి వరకు ఎలాంటి విమాన టిక్కెట్లు దొరకలేదు.
దుబాయ్, మస్కట్, ఫ్రాంక్‌ఫర్ట్‌తో సహా వివిధ గమ్యస్థానాల నుంచి వచ్చే విమానాలపై కూడా నిఘా పెట్టారు. విమానాశ్రయంలో సిబ్బంది విడతల వారీగా రౌండ్-ది క్లాక్ నిఘా కొనసాగిస్తున్నారు.
లొంగిపోవాలని కుటుంబం సూచన..
లైంగిక వేధింపుల కేసుతో ఇబ్బంది పడిన ప్రజ్వల్ కుటుంబం వెంటనే అతడిని రాష్ట్రానికి తిరిగి రావాలని, సిట్ ముందు హాజరు కావాలని ఒత్తిడి తెచ్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. విచారణను ఎదుర్కోకుండా విదేశాల్లో తలదాచుకుంటే న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోలేమని ప్రజ్వల్‌కు సూచించినట్లు సమాచారం.
సిట్ ముందు హాజరు అయ్యేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, న్యాయ ప్రక్రియలో నిమగ్నమవ్వడానికి న్యాయవాదిని కూడా సంప్రదించినట్లు సమాచారం. అలా కాకుండా విదేశాల్లోనే ఉన్నట్లయితే.. సమస్య తీవ్రత ఇంకా పెరిగి కుటుంబం పరువు, ప్రతిష్ట, పార్టీ భవితవ్యం దెబ్బతింటుందని నచ్చజెప్పినట్లు సమాచారం.
ప్రజ్వల్ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు, "తక్షణమే న్యాయవాదిని సంప్రదించి, విచారణ ప్రక్రియకు కట్టుబడి ఉండాలని గట్టిగా సూచించాయని" తెలుస్తోంది. ఇక ఎటూ గత్యంతరం లేక ప్రజ్వల్ ఇండియా వచ్చి సిట్ ముందు హజరయ్యేందుకు అంగీకరించాడని, ఈ రోజు రాత్రి కల్లా వచ్చే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.