ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం సిద్ధరామయ్య

జీఎస్టీ సవరణ వల్ల రాష్ట్రానికి రూ. 18 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణ

Update: 2025-12-07 12:46 GMT
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

జీఎస్టీ సవరణల వల్ల కర్ణాటక ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతగిలిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఆదాయంలో తీవ్రంగా తగ్గుదల కనిపించిందని, రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని విమర్శిస్తూ సిద్ధరామయ్య, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కర్ణాటకకు నష్టపోయిన పరిహారాన్ని చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖలో 56 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పన్నురేట్లు తగ్గింపుల వల్ల కలిగే ఆర్థిక ప్రభావం, రాష్ట్రంపై పెరుగుతున్న భారాన్ని సంఖ్యలలో వివరించారు. కాబట్టి తమకు తగిన ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కర్ణాటకకు వేలకోట్ల నష్టం..
జీఎస్టీ రేటు సరళీకరించడం వల్ల ఆదాయం 15 నుంచి 20 శాతం తగ్గుతుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజా సంఖ్యలను బట్టి చూస్తే ఈ ఆందోళన నిజమే అని అనిపిస్తోంది. నవంబర్ 2024 తో పోలిస్తే నవంబర్ 2025 లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 2 శాతం తగ్గాయి. దీనికి విరుద్దంగా ఇదే సంవత్సర కాలంలో రాష్ట్రం 9.3 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇప్పుడు పరిస్థితి నెగటివ్ గా ఉందని పేర్కొన్నారు.
కర్ణాటక జీఎస్టీ వసూళ్లు బాగా తగ్గాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఈ సంవత్సరం రాష్ట్రం దాదాపు రూ.5 వేల కోట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య రూ. 9 వేల కోట్ల చేరుకుంటుందని అంచనా.
పరిహార సెస్ కూడా కలుపుకుంటే రాష్ట్రం మరో రూ. 9,500 కోట్లు కోల్పోతుందని అంచనా. ఇవి కలుపుకుంటే దాదాపు రూ.18,500 కోట్ల వరకూ నష్టపోవచ్చని ముఖ్యమంత్రి అంచనా వేశారు.
పాన్ మసాలా సెస్ ను పంచుకోవాలి..
అక్టోబర్ లో దసరా, దీపావళి కారణంగా వాణిజ్య కార్యకలాపాలు పెరగడం సంప్రదాయకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ అక్టోబర్ లో పండగ సీజన్ ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లో ప్రతికూల వృద్దిరేటు నమోదైంది.
ఇది ఆర్థిక మందగమనానికి సంకేతం. దేశవ్యాప్తంగా ఈ ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయలోటు ఏర్పడుతుందని ముఖ్యమంత్రి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదాయలోటు పూడ్చుకోవడానికి పాన్ మసాలాలపై సెస్సు విధించి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని పరిమితం చేస్తుందని సిద్ధరామయ్య వాదిస్తున్నారు. పాన్ మసాలా జీఎస్టీలోకి వస్తుంది కాబట్టి సెస్సు ఆదాయం 50:50 శాతంగా పంచుకోవాలని సిద్ధరామయ్య అంటున్నారు.
సహకార స్ఫూర్తితో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాలుగా మద్దతు ఇచ్చామని, అందుకే రాష్ట్రాల ఆర్థిక లోటుకు కేంద్రం పూడ్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం 2024-25 ను బేస్ ఇయర్ గా తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News