కులగణనలో మొదటి రెండు స్థానాల్లో ఎస్సీలు, లింగాయత్
కులగణన వివరాలు లీక్ అయినట్లు రాష్ట్రంలో వదంతులు;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-13 12:31 GMT
కర్ణాటకలో ప్రభుత్వం సేకరించిన కుల గణన వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలు అధికారికంగా విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్కలిగ, లింగాయత్ నాయకులకు పదవి గండం ఉంటుందని ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వీటిని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే కర్ణాటక క్యాబినెట్ సమావేశంలో కులగణన లేదా సామాజిక, విద్యా సర్వే నివేదికలోని అంశాలు కులాల వారీగా ప్రధాన జనాభా గణాంకాలు లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన డేటా ప్రకారం మొదటి ఐదు స్థానాల్లో 1. షెడ్యూల్డ్ కులాలు, లింగాయత్ లు, ఓబీసీలు, ముస్లింలు, ఒక్కలిగాలు ఉన్నారు.
వీటిలో షెడ్యుల్డ్ కులాలు జనాభా 1,08,88,951,
లింగాయత్: 81,37,536
ఓబీసీలు: 77,82,509
ముస్లింలు: 75,25,789
ఒక్కలిగాలు:72,99,577
ఎస్టీ: 42,81,289 ఉందని వివరాలు బయటకు వచ్చాయి.
ఈ డేటా ప్రకారం అహింద(మైనారిటీలు, ఓబీసీలు, దళితుల) సమూహాం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని, లింగాయత్, ఒక్కలిగ వర్గాల సంఖ్యను దాటనట్లు చూపెట్టారు. ఇది కాంగ్రెస్ తన రాజకీయ బేస్ ను బలోపేతం చేసుకునే ప్రయత్నాలకు శక్తినిచ్చినట్లు అయింది.
నివేదిక లీక్ కొత్త కాదు
గతంలో కులగణన లీక్ పై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఆ నివేదికను కేబినేట్ ముందుకు తెచ్చింది. డేటా వివరాలు కాపాడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది.
గతంలో నివేదికలోని కొన్ని భాగాలు లీక్ అయ్యాయి. దీనితో ఆధిపత్య కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు గణాంకాలు మరోసారి లీక్ అయ్యాయి. కొత్తగా లీక్ అయిన గణాంకాలు కులగణనలో భాగం కాదని వెనకబడిన తరగతుల మంత్రి శివరాజ్ తంగడగి పేర్కొన్నారు. నివేదిక గోప్యత కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
నివేదిక వివరాలు బహిర్గతం చేయడం వల్ల సమాజంలో కుల ఆధారిత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. లింగాయత్ లు, వొక్కలిగలు వంటి ఆధిపత్య కులాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని, అందుకే నివేదిక గోప్యంగా ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ నివేదిక ప్రత్యక్ష బాధ్యత వహించే మంత్రి తంగడగి ప్రస్తుతం తోటీ మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ సారాంశాన్ని అందుకున్న మంత్రులు ఏప్రిల్ 17న జరగనున్న ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని భావిస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వ నివేదికను సమీక్షించడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుందని లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తుంది.
నివేదిక నేపథ్యం
హెచ్ కాంతారాజ్ నేతృత్వంలోని వెనకబడిన తరగతుల కమిషన్ పది సంవత్సరాల క్రితం సామాజిక, విద్యా సర్వే ను పూర్తి చేసింది. ఆ తరువాత కొద్దికాలానికే కులాల వారీగా డేటా లీక్ కావడం ప్రారంభమైంది.
ఈ సంఖ్యలు ఎస్సీలు, ముస్లిం జనాభా సంఖ్య ఎక్కువగా చేసి చూపిందని తేలవడంతో ఆధిపత్య వర్గాలు వీటిని వ్యతిరేకించారు. ఇది రాజకీయంగా వివాదానికి కారణమైంది.
ఈ నివేదికను బహిర్గతం చేస్తే రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతామనే భయంతో ఒక్కలిగ, లింగాయత్ వర్గాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి లెక్కింపుదారులు డేటా సేకరణ చేయలేదని, అశాస్త్రీయంగా గణాంకాలు సేకరించారని అన్నారు.