‘ముడా‘ కుంభకోణంపై ఏక సభ్య కమిషన్
మైసూర్ లో సీఎం సిద్దరామయ్య భార్యకు అక్రమంగా స్థలం కేటాయించడంపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. నా భార్య ఆస్థిని అనుమతి లేకుండా ముడా..
కర్నాటక ను కొద్ది రోజులుగా కుదిపేస్తున్న ముడా(మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్థలాల కుంభకోణంపై ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) జస్టిస్ పిఎన్ దేశాయ్ ఏక సభ్య కమిషన్‌కు నేతృత్వం వహిస్తారు.
ఈ కమిషన్ ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత శాఖలు, ముడా అధికారులు న్యాయమూర్తి దేశాయ్‌కు అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందించడం ద్వారా విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
జూలై 15న ప్రారంభమై జూలై 26న ముగియనున్న శాసనసభ సమావేశాలకు ముందుగా ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యామ్నాయ స్థలాల (ప్లాట్లు) లబ్ధిదారుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి ఒకరని బీజేపీ ఆరోపించడంతో కుంభకోణంలో సీఎం స్వయంగా వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టులో సైతం కేసులు దాఖలు కావడంతో సిద్దరామయ్య సర్కార్ ఢిపెన్స్ లో పడింది. స్వపక్షం, విపక్షం నుంచి దాడులు తీవ్రం కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం కమిషన్ నియమించింది.