‘ఇప్పటికి సిద్ధరామయ్యే .. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదు’

సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను నియమించే ఆలోచన ఇప్పట్లో లేదని అధిష్టానం నుంచి సంకేతాలు..;

Update: 2025-07-01 11:26 GMT

కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ముడా(MUDA Scam) కుంభకోణంలో విలువైన భూములు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) చొరవతో ఆమె భార్యకు దక్కాయని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇక సీఎం మార్పు తథ్యమని చాలామంది భావించారు. అయితే ఇప్పట్లో ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని హైకమాండ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌(DK Shiva Kumar)ను కూర్చొపెట్టే ఆలోచన ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మాత్రం ముహూర్తం ఖరారైంది. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలోని పార్టీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అంతర్గత సమస్యలను పరిష్కరించుకునేందుకు రణ్‌దీప్ సుర్జేవాలాను రాష్ట్రానికి పంపిందని NDTV పేర్కొంది. కాగా శివకుమార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుకూలంగా లేరని సమాచారం.

హైకమాండ్‌దే తుది నిర్ణయం: ఖర్గే

కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చాలా? వద్దా? అనే దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పిన తర్వాతి రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. "నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉంది. ఏ నిర్ణయమైనా వారే తీసుకుంటారు. హైకమాండ్ నిర్ణయానికి శాసనసభ్యులంతా కట్టుబడి ఉండాలి," అని పేర్కొన్నారు. పార్టీలోని అంతర్గత కలహాల గురించి తెలుసుకునేందుకు పార్టీ ఇన్‌చార్జి సుర్జేవాలాను రాష్ట్రానికి పంపామని, ఆయన నివేదిక ఆధారంగా తదుపరి చర్య తీసుకుంటామని ఖర్గే స్పష్టం చేశారు.

సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాల మధ్య అంతర్గత విభేదాల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని బీజేపీ పదేపదే ఆరోపిస్తుండడంతో సుర్జేవాలా మూడు రోజుల పర్యటనకు బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన శాసనసభ్యులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారితో మాట్లాడనున్నట్లు సమాచారం.

'డీకే వైపు వంద మంది ఎమ్మెల్యేలు'

సెప్టెంబర్ తర్వాత "విప్లవాత్మక" రాజకీయ పరిణామాలుంటాయని సహకార మంత్రి కె.ఎన్. రాజన్న చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. పార్టీలోని 138 మంది శాసనసభ్యులలో కనీసం 100 మంది శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. హైకమాండ్ ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చకపోతే, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాకపోవచ్చునని ఆయన NDTVతో అన్నారు. అయితే నాయకత్వ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు "రాయిలా దృఢంగా" ఉంటుందని నొక్కి చెప్పారు. 

Tags:    

Similar News