పాత మైసూర్ లో జెండా పాతేదీ ఎవరూ? కాంగ్రెస్, కమలమా..
ఎండా కాలం వేడిని సైతం లెక్కచేయకుండా పార్టీలు గెలుపుకోసం కష్టపడుతున్నాయి. పాత మైసూర్ ప్రాంతంలోని ఒక్కలిగలు ఎవరి వైపు నిలబడితే వారినే ..
By : Praveen Chepyala
Update: 2024-04-24 10:52 GMT
కర్నాటకలో మరో రెండు రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలన్నీ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలి దశ ఎన్నికల్లో కర్నాటకలోని 14 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఎండాకాలం వేడిని సైతం లెక్కచేయకుండా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు, షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కర్నాటకలో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ఊపును ఈ ఎన్నికల్లో కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. ప్రత్యర్ధి బీజేపీ ఇదే 2019 నాటి స్థానాలను తిరిగి పొందాలని పోరాడుతోంది.
2019లో కర్ణాటకలో బీజేపీ 51.2 శాతం ఓట్లతో 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) స్వతంత్ర అభ్యర్థి (బీజేపీ మద్దతుతో సుమలత) ఒక్కో సీటును గెలుచుకున్నారు.జేడీ(ఎస్)కి ఇది మనుగడకు సంబంధించిన అంశంగా కొనసాగుతోంది. కర్ణాటకలో తొలి దశ పోలింగ్‌లో జేడీ(ఎస్) పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరగనుంది.
రాష్ట్రంలోని 14 స్థానాలకు 247 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉడిపి-చిక్‌మగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపుర, కోలార్ ఈ 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.
కీలక నియోజకవర్గాలు, సమస్యలు..
ఈ 14 నియోజకవర్గాల్లో మాండ్య, బెంగళూరు రూరల్, మైసూర్, హాసన్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. CAA అమలు, 'లవ్ జిహాద్', కాంగ్రెస్ అందించే ఐదు హామీలు, కర్నాటకపై కేంద్రం వివక్ష, కన్నడ గర్వం వంటి విభిన్న అంశాలు ఎన్నికల ప్రచారంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు కర్ణాటక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించడం, మోదీకి ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోందని తేలింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్నాటక పార్టీ చీఫ్ DK శివకుమార్ 14 నియోజకవర్గాలను, ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. అదేవిధంగా, యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ విజయేంద్ర సహా బిజెపి నాయకులు 14 నియోజకవర్గాల పొడవునా విస్తృతంగా పర్యటించి అట్టడుగు స్థాయి కార్యకర్తలకు చేరువయ్యారు.
వొక్కలిగ ఎవరి వైపో..
మాజీ సీఎం, జేడీ(ఎస్) లెఫ్టినెంట్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నందున అందరి దృష్టి పాత మైసూర్ ప్రాంతంలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉంది. ప్రాంతీయ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నందున, రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్నికలల్లో ఇదే ప్రధాన అంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత, ఈ లోక్‌సభ ఎన్నికలు జెడి(ఎస్)కి ముఖ్యంగా మాండ్యలో డూ ఆర్ డై పోరు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందితే జేడీ(ఎస్)కు పునరుజ్జీవం ఖాయం. లేదంటే ఇక అంతే సంగతులు. ఇద్దరు వొక్కలిగ టైటాన్లు, కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ఒకరినొకరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఈ హాట్ ల్యాండ్ కోసం పోరాడుతున్నారు. 2019లో ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయిన తరువాత మాండ్యా నుంచి కుమారస్వామి తొలిసారిగా బరిలోకి దిగారు.
233 కోట్ల ఆస్తులను ప్రకటించిన "స్టార్ చంద్రు" గా పేరున్న వెంకటరమణ గౌడని కాంగ్రెస్ ఇక్కడ బరిలోకి దింపింది. వొక్కలిగ నడిబొడ్డున కుమారస్వామిని ఓడించేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
బెంగళూరు రూరల్‌లో కాంగ్రెస్ వర్సెస్ మోదీ-దేవెగౌడ ద్వయం
అలాగే బెంగళూరు రూరల్ నియోజకవర్గంలోనూ వొక్కలిగ ఆధిపత్యం కొంత తక్కువని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో బెంగళూరు, పక్కనే ఉన్న రామనగర, తుమకూరులోని కొన్ని ప్రాంతాలలో పట్టణ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మోదీ, దేవెగౌడ ద్వయంపై కాంగ్రెస్ పోరుగా అభివర్ణించవచ్చు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమకు దక్కిన ఏకైక సీటు ఇదే. పైగా, సిట్టింగ్ ఎంపీ, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఈ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక్కడ మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అల్లుడు డాక్టర్ సిఎన్ మంజునాథ్ ప్రధాన ప్రత్యర్థి.
జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్‌లో పనిచేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మంజునాథ్ తన క్లీన్ ఇమేజ్, JD(S), BJP ల మద్దతు పుష్కలంగా ఉంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన డీకే సురేష్, ఈ లోక్‌సభ నియోజకవర్గంలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారనే పేరుంది. ఇప్పుడు వారి మద్దతుతో గెలుపొందాలని చూస్తున్నారు. బీజేపీ, జేడీ(ఎస్)లు కలిసి రెండు పార్టీలు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజరాజేశ్వరి నగర్, బెంగళూరు సౌత్, చన్నపట్న నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నాయి.
వొక్కలిగర సంఘ వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం 27 లక్షల మంది ఓటర్లలో, రాజరాజేశ్వరి, బెంగళూరు సౌత్ సెగ్మెంట్లో 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
సిద్ధరామయ్య సొంతగడ్డ పై..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సొంత ప్రాంతమైన మైసూరు-కొడగు, చామరాజనగర్ నియోజకవర్గాల్లో గెలుపొందడం ఆయనకు అత్యంత ముఖ్యం. లేదంటే ఎన్నికల తరువాత ఏదైన జరగవచ్చు. ప్రస్తుతం ఈ రెండు స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కాషాయదళం నుంచి వీటిని కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి సీఎం రోడ్ మ్యాప్ లు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకోవాలని, పూర్తి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు తనను బలోపేతం చేయాలని కోరుతూ ఇక్కడి ఓటర్లను భావోద్వేగ, సెంటిమెంట్ పై కొట్టేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు.
మైసూరులో మోదీ
మైసూరు, చామరాజనగర్, హాసన్- మాండ్య లో గెలవడానికి బీజేపీ ఎప్పటిలాగే తమ ట్రంప్ కార్డు మోదీని వాడుతోంది. ఇప్పటికే బీజేపీ తరఫున మైసూర్ లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధరామయ్య సన్నిహితుడు ఎం లక్ష్మణ్ బరిలో నిలిచారు. చామరాజనగర్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప కుమారుడు సునీల్‌బోస్ బీజేపీ అభ్యర్థి ఎస్ బాల్‌రాజ్‌తో పోటీ పడుతున్నారు.
హాసన్‌లో సిద్ధరామయ్య వర్సెస్ దేవెగౌడ
జనతాదళ్ (సెక్యులర్)కి కంచుకోటగా పరిగణించబడుతున్న హసన్ లోక్‌సభ నియోజకవర్గం కూడా వొక్కలిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ ఈ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో హసన్, జేడీ(ఎస్)కి కంచుకోటగా ప్రచారం జరుగుతోంది.
ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో, JD(S) నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, కాంగ్రెస్‌కి కడూరు, అర్సికెరె సెగ్మెంట్లు, బేలూరు, అర్కలగూడ స్థానాలు బీజేపీ గెలుచుకున్నాయి. దేవెగౌడ, ఒకప్పటి అనుచరుడు , ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ గెలుపొందడం ప్రతిష్ఠాత్మకంగా మారింది.మైసూరు, చామరాజనగర్ స్థానాల్లో బీజేపీ-జేడీ(ఎస్) కూటమి విజయంతో సిద్ధరామయ్యకు గర్వభంగం తప్పదని మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల శపథం చేశారు
ఒకటి మాత్రం నిజం, పాత ప్రత్యర్థులైన హెచ్డి దేవెగౌడ, మాజీ ఎంపీ దివంగత జి పుట్టస్వామిగౌడ్ల మనవళ్లు ఇక్కడ అభ్యర్థులు కావడంతో ఈ నియోజకవర్గంలో భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ సీటులో ఈ రాజకీయ పోరులో ప్రజ్వల్ రేవణ్ణ, శ్రేయాస్ ఎం పటేల్ తమ తాతల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
బెంగళూరు నార్త్
రెండు దశాబ్దాలుగా బీజేపీకి పట్టున్న బెంగళూరు నార్త్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ఎంవీ రాజీవ్ గౌడ, మాజీ రాజ్యసభ ఎంపీ, రాజకీయ కుటుంబానికి చెందిన ఐఐఎం-బి ప్రొఫెసర్, ఉడిపి-చిక్‌మగళూరు నుంచి సిట్టింగ్ ఎంపీ కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి, బిజెపికి చెందిన శోభా కరంద్లాజెపై పోటీ చేస్తున్నారు. మోదీ ఫ్యాక్టర్ కారణంగా బిజెపి గెలవవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, కరంద్లాజేకి గట్టి సవాలు ఎదురవుతుందని మరికొందరు భావిస్తున్నారు. కరంద్లాజే ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇష్టంలేని బీజేపీ పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్
కాంగ్రెస్‌కు చెందిన సౌమ్యారెడ్డికి వ్యతిరేకంగా బిజెపి యువ ఆర్ఎస్ఎస్ టర్క్ తేజస్వి సూర్య మధ్య జరిగిన మరో పోరు బెంగళూరు సౌత్. దేశ ఐటీ రాజధానిలో హాట్ సీట్ అయిన బెంగళూరు సెంట్రల్ మరొకటి. బీజేపీ నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన పీసీ మోహన్ వరుసగా నాలుగోసారి సీటును నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నారు. ఇక్కడ మన్సూర్ అలీఖాన్ అనే కొత్త విద్యావేత్తను కాంగ్రెస్ రంగంలోకి దింపింది.