దేవేగౌడ మనవడిని సస్పెండ్ చేసిన జేడీ(ఎస్), కారణం ఏంటంటే..
మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియోలు బయటకు రావడంతో జేడీ(ఎస్) ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు.
అనేకమంది మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియోలు బయటకు రావడంతో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనవడు, హసన్ ఎంపీ, ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనతాదళ్( సెక్యూలర్) ప్రకటించింది. ఏప్రిల్ 26న కర్నాటకలో మొదటి దశ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ వీడియోలు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయ్యాయి.
ఓ వీడియోలో స్వయంగా ప్రజ్వల్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో బ్లాక్ మెయిల్ చేస్తానని ఓ మహిళతో చెబుతున్నమాటలు ఉన్నాయి. రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో తనపై పలుమార్లు లైంగిక వేధింపులు జరిగాయని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. హెచ్‌డీ రేవణ్ణ తన భార్య ఇంట్లో లేని సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.