బెంగళూరులోని GT మాల్‌ను మూయించిన కర్ణాటక ప్రభుత్వం. కారణమేంటి?
ధోతీ, తెల్లటి చొక్కా ధరించిన ఒక రైతును బెంగళూరులోని జీటీ మాల్‌లోకి వెళ్లేందుకు మాల్ సిబ్బంది అనుమతించలేదు. ఈ ఘటనపై శాసనసభ సభ్యులంతా పార్టీలకతీతంగా స్పందించారు.;
కన్నడ కార్యకర్తలతో కలిసి GT మాల్‌లోకి ప్రవేశించిన ఫక్కీరప్ప
కర్ణాటక అసెంబ్లీలో ప్రయివేటు పరిశ్రమల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఓ రైతు వేషధారణ చుట్టూ కూడా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ధోతీ, తెల్లటి చొక్కా ధరించిన ఒక రైతును బెంగళూరులోని జీటీ మాల్‌లోకి వెళ్లేందుకు మాల్ సిబ్బంది అనుమతించలేదు. మీడియాలో ప్రసారమైన ఈ ఘటనపై శాసనసభ సభ్యులంతా పార్టీలకతీతంగా స్పందించారు. రైతు ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని గొంతెత్తారు.
హవేరి జిల్లాకు చెందిన 70 ఏళ్ల ఫకీరప్ప మంగళవారం (జూలై 16) తన భార్య, కొడుకుతో కలిసి బెంగళూరులోని జీటీ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి మాల్‌కు వచ్చారు. తెల్లటి చొక్కా, పంచె (ధోతీ) ధరించి వచ్చిన ఫకీరప్పను సెక్యూరిటీ గార్డు హాల్ లోపలికి అనుమతించలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసెంబ్లీలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ స్పందించారు. “BBMP (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) కమిషనర్‌తో కలిసి ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నాం. (జిటి వరల్డ్) మాల్‌పై తక్షణమే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. మాల్‌ను ఏడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించాం” అని చెప్పారు.
"ఆత్మగౌరవానికి భంగం"
ఈ ఘటనను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప కూడా ఖండించారు. “ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం, గౌరవం ముఖ్యం. నివేదిక ఆధారంగా వాటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని సభలో అన్నారు. జరిగిన ఘటనను మీడియాలో చూపినపుడు నివేదిక అవసరం ఏమిటని శాసనసభ్యులు ప్రశ్నించారు. ప్రభుత్వం ధైర్యంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ ఇదే ఘటనను లేవనెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. “బెంగళూరులో చదువుతున్న గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన తండ్రిని కర్ణాటక సంప్రదాయ వేషధారణ అయిన పంచె కట్టుకుని మాల్ చూపించడానికి తీసుకెళ్లినప్పుడు, వేషధారణ కారణంగా లోపలికి అనుమతించలేదని నేను మీడియాలో చూశాను. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది అన్ని మాల్స్‌కు గుణపాఠం అవుతుంది.” అని ఖాదర్ అభిప్రాయపడ్డారు.
శాసనసభ్యుల డిమాండ్..
కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవాది మాల్‌కు కనీసం ఒక వారం పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాల్ యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గుర్మిఠకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శరంగౌడ్ కందకూర అన్నారు. రాణేబెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ కోలివాడ్ మాట్లాడుతూ.. ‘‘ రైతు ఫకీరప్ప నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఉంటున్నారు. తన తొమ్మిది మంది పిల్లలందరిని చదివించారు. ఒక కొడుకు బెంగళూరులో MBA చదువుతున్నాడు. తన తండ్రిని మాల్ చూపించడానికి తీసుకెళ్లాడు. రైతు వేషధారణలో వచ్చిన ఫకీరప్పను అగౌరవరిపిచన మాల్‌ను మూసి వేయాల్సిందే’నని పట్టుబట్టారు.
డ్రస్ కోడ్ విధించే బెంగళూరులోని ప్రైవేట్ క్లబ్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, అధికారపక్ష చీఫ్ విప్ అశోక్ పట్టాన్ సూచించారు. ప్రతిపక్ష నేత ఆర్.అశోక మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి విషయాలపై ఇంతకుముందు కూడా సభలో చర్చించుకున్నాం. ఫలితం ఏమిటి? స్పీకర్ లేదా ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయాలి. వాటిని అమలు పరిచేలా ఆదేశాలివ్వాలి.’’ అని అన్నారు. మంత్రి సురేష్ జోక్యం చేసుకుని మాల్స్, క్లబ్‌ల్లోకి వెళ్లేవారికి ప్రత్యేకంగా డ్రస్ కోడ్ ఏమి ఉండదని సమాధానమిచ్చారు.
దానికి అశోక్ స్పందిస్తూ..“అంతిమంగా ఉత్తర్వు ఎవరు జారీ చేయాలి? ప్రభుత్వం.. ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు. అర్బన్ డెవలప్ మెంట్ మంత్రివి నువ్వే. ఉత్తర్వులు జారీ చేయాలి.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు.’ అని కౌంటర్ ఇచ్చారు.
కొంతమంది ఎమ్మెల్యేలు హౌస్ కమిటీని ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే బిజెపి సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ అశోక్ మాట్లాడుతూ.. “గతంలో అనేక కమిటీలు వేశారు. వాటి నివేదికపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు’’ అని అన్నారు.