‘‘దేశంలో ఒకే మతం, ఒకే భాష కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది’’
తమిళనాడు బీజేపీ ఎంకే స్టాలిన్
By : Praveen Chepyala
Update: 2025-12-21 12:23 GMT
బీజేపీ లౌకికవాదాన్ని ద్వేషిస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. శనివారం క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కమలదళంపై విమర్శలు గుప్పించారు.
రాజ్యాంగం నుంచి లౌకికవాదాన్ని తొలగించాలని కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. దేశ వైవిధ్యాన్ని నాశనం చేసి, నిరంకుశంగా వ్యవహరించడమే బీజేపీ లక్ష్యం అని స్టాలిన్ అన్నారు.
‘‘మణితనేయ మగతువ క్రీస్తుమాస్ పెరువిళ-2025’’ అనే క్రిస్మస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్టాలిన్, దక్షిణ తమిళనాడులో తిరునల్వేలీలో మహిళలకు విద్య అందించడంలో 19 వ శతాబ్ధంలో ప్రారంభంలో క్రైస్తవ మిషనరీ సారా టక్కర్ చేసిన గొప్ప సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని డీఎంకే శాసనసభ్యుడు ఇనిగో ఇరుదయరాజ్ నేతృత్వంలోని ‘‘క్రీస్తువ నల్లెన్న ఇయక్కం’’ నిర్వహించారు.
దక్షిణ తమిళనాడులో స్త్రీ విద్య..
రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీల పనిని ప్రశంసిస్తూ ‘‘దక్షిణ తమిళనాడులో పెద్ద సంఖ్యలో మహిళలు విద్యనభ్యసించడానికి పునాదిగా పనిచేస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘క్రిస్మస్ అనేది విశ్వాసం విత్తనాలను నాటడం, కరుణ చూపించడం, శాంతి వైపు నడిపించడం, ఆనందంగా ఉండటం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరులలా జీవించాలి. అలాంటి కార్యక్రమాలు నిత్యం జరగాలి’’ అని ఆయన అన్నారు. డీఎంకే మైనారిటీల సంక్షేమం కోసం నిజంగా శ్రద్ధ వహించే పార్టీ అని ఆయన అన్నారు.
‘‘డీఎంకే నేతృత్వంలోని పాలనలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశాము. మైనారిటీల సంక్షేమ పరిరక్షణకు ఇది ఒక వాస్తవిక స్వర్ణయుగం’’ అని ఆయన పేర్కొన్నారు.
మైనారిటీలకు సబ్సిడీలు..
అనేక కార్యక్రమాలను వివరిస్తూ జెరూసలేం తీర్థయాత్రకు సబ్సిడీ పెంచామని, 16 చర్చిలను రూ. 2.15 కోట్లతో పునరుద్దరించామని స్టాలిన్ చెప్పారు. 12 జిల్లాల్లో రూ. 20 కోట్లతో పురాతన చర్చిలను పునరుద్దరించామని, ఆరు జిల్లాల్లో కొత్త స్మశాన వాటికల కోసం భూమిని కేటాయించాలని ప్రభుత్వ చొరవను కూడా ఆయన వివరించారు. మతపరమైన వివక్ష లేకుండా తన ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చిందని, అందరికి పునరుద్దరణ, ఇతర సంబంధిత పనులను చేపట్టిందని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘తమిళనాడు లో శాంతికి భంగం కలిగించాలని చాలామంది ఆలోచిస్తున్నారు. సామరస్యంగా జీవిస్తున్న ప్రజలను విభజించి వారిని శత్రువులగా మార్చాలని వారు ఆలోచిస్తున్నారు’’ అని కూడా ఆయన అన్నారు.
సోదర భావన..
కొన్ని సంస్థలు ఆధ్యాత్మిక పేరుతో ప్రజలను నడిపించాలని చూస్తున్న మార్గం హింస వైపు దారితీసిందని తమిళనాడు గ్రహించిందని స్టాలిన్ అన్నారు. ‘‘సోదర భావం, హేతుబద్దత శక్తి తమిళనాడుకు ప్రతీక’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రతి ఒక్కరికి అవసరమైనవన్నీ ఉండాలని చెప్పిన యేసే దార్శనికతకు నిదర్శనంగా మన ద్రవిడ నమూనా పాలన నడుస్తోంది’’ అని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు.
‘‘అందుకే బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకువచ్చినప్పుడూ మేము దానిని తీవ్రంగా వ్యతిరేకించాము. నిరసనలు నిర్వహించాము. అయితే అన్నాడీఎంకే దానికి మద్దతు ఇచ్చింది’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
బీజేపీకి లౌకికవాదం అంటే..
బీజేపీ లౌకికవాదాన్ని తీవ్రంగా ద్వేషిస్తుందని, దానిని రాజ్యాంగం నుంచి తొలగించాలని కోరుకుంటోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘‘కేంద్రంలో ఉన్న బీజేపీ విషయానికొస్తే లౌకికవాదం అనే పదం వారికి వేప పండు వలే చేదుగా ఉంటుంది.
రాజ్యాంగం నుంచే దానిని తొలగించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశ వైవిధ్యాన్ని నాశనం చేసి, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే నిరంకుశ భవిష్యత్ ను సృష్టించడమే వారి లక్ష్యం.
తమిళనాడులో కూడా వారి తమ ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ డీఎంకే, బీజేపీ కుట్రలను వ్యతిరేకించి, తిప్పికొట్టే శక్తిని కలిగి ఉంది’’ అని ఆయన అన్నారు. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ.. పని ఇంకా పూర్తికాలేదని అన్నారు.
‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని ఓటు వేయకుండా నిరోధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. మేము వారందరిని ఓడిస్తాము. మేము కచ్చితంగా గెలుస్తాము’’ అని స్టాలిన్ అన్నారు.