‘ఐదేళ్లూ నేనే సీఎం.. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..
కర్ణాటక(Karnataka)లో సీఎం కుర్చీ కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీపడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) శుక్రవారం (డిసెంబర్ 19) ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఐదేళ్లూ తానే సీఎంగా కొనసాగుతానని చెప్పారు. ఉత్తర కర్ణాటక అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రెండున్నరేళ్లు మాత్రమే సీఎంగా కొనసాగుతానని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఉత్తర కర్ణాటకకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీ పదవీకాలంలో నెరవేరుతాయా? అని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "హైకమాండ్ నాకు ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయడానికి అనుమతిస్తుందన్న నమ్మకం ఉంది. కానీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను" అని పునరుద్ఘాటించారు.
హైకమాండ్‌దే తుది నిర్ణయం..
బీజేపీకి చెందిన వి సునీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు.. "నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే భవిష్యత్తులో కూడా నేనే సీఎంను అవుతాను" అని అన్నారు. "ఉత్తర కర్ణాటక ప్రాంతానికి మీరు ఇక్కడ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా మీరు ముఖ్యమంత్రి అవుతారో లేదో మీరు స్పష్టం చేయాలి" అని అడిగిన మరో ప్రశ్నకు.."భవిష్యత్తులో కూడా నేనే ముఖ్యమంత్రిని" అని చెప్పారు.
ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు..
ప్రతిపక్షాల విమర్శలకు సీఎం ఘాటుగా సమాధానమిచ్చారు. "మాకు దర్శకత్వం వహించడానికి ఎవరూ లేరు. మేము నిర్మాత, దర్శకుడు, నటులం, కానీ మీకు ఒక దర్శకుడు ఉన్నారు" అని అన్నారు. బీజేపీ ప్రముఖ నాయకుడు బీఎస్ యెడియరప్ప పూర్తి పదవీకాలం తానే సీఎంగా ఉంటానని హామీ ఇచ్చారని అయితే మధ్యలోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందని చురకలంటించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నవంబర్ 20నాటికి రెండున్నరేళ్లు పూర్తయ్యింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు.