డీకే శివకుమార్‌పై కాంగ్రెస్ అసహనం..

సద్గురు వాసుదేవ్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు హాజరయిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ - కేంద్ర మంత్రి అమిత్ షాతో వేదిక పంచుకున్న ఉప ముఖ్యమంత్రి.;

Update: 2025-02-27 13:08 GMT

సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jagadish Vasudev) ఇషా ఫౌండేషన్.. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వేడుకలను పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) వేదికను పంచుకున్నారు. అయితే వేడుకలకు డీకే హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తప్పుబడుతున్నారు.

సద్గురు గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎగతాళి చేయడం, ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించడమే కారణమని పార్టీ సీనియర్లు అంటున్నారు.

డీకే తీరు పార్టీకి నష్టం?

‘‘తమిళనాడులోని ఇషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు నాకు ఆహ్వానం ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమం ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. సద్గురుకు ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియాలో శివకుమార్ పెట్టిన పోస్ట్‌‌పై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి పీవీ మోహన్(Mohan) స్పందించారు. డీకే సద్గురు కార్యక్రమానికి హాజరుకావడం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పార్టీకి నష్టం కలిగించే చర్య అని మండిపడ్డారు.

ఆర్ఎస్ఎస్ (RSS) సిద్ధాంతాలకు పార్టీ వ్యతిరేకం..

"నేను డీకేను విమర్శించటం లేదు. ఆయన ఆలయాలను సందర్శించడంపై నాకు అభ్యంతరం లేదు. కానీ శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కూడా. ఇషా ఫౌండేషన్, సద్గురు భావజాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాటికి పూర్తిగా వ్యతిరేకం. పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైతే, అది కార్యకర్తలకు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించేవారు కాంగ్రెస్‌లో కొనసాగాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ చాలా సార్లు స్పష్టం చేశారు" అని సోషల్ మీడియా వేదికగా మోహన్ వ్యాఖ్యానించారు.


"హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తా"

రాహుల్ గాంధీ కుటుంబంతో దగ్గర సంబంధాలున్నాయని చెప్పుకునే శివకుమార్.. పుట్టుకతో హిందువునని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల మహాకుంభ మేళాను సందర్శించి అక్కడి ఏర్పాట్లను కూడా ప్రశంసించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా.. "నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తాను" అని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరారు.

కర్నాటక కాంగ్రెస్‌లో వర్గ పోరాటాలు ముదురుతున్న నేపథ్యంలో.. శివకుమార్ తన హిందుత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చూస్తున్న తన ప్రత్యర్థులకు స్పష్టమైన సందేశం ఇస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News