కర్ణాటక కాంగ్రెస్ ‘ఛలో రాజ్ భవన్’..ఎందుకు?

ముడా కుంభకోణంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్ అనుమతించడాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుబడుతున్నారు.

Update: 2024-08-31 09:45 GMT

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అనుమతించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమానికి పూనుకున్నాయి. ఈ మార్చ్‌కు ముందు సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్‌ నేతృత్వంలో గవర్నర్ వైఖరి పట్ల పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని 'అస్థిరపరిచేందుకు' గవర్నర్ ద్వారా కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చే సమయంలో గెహ్లాట్ తనపై వివక్ష చూపారని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

ఏమిటీ ముడా కుంభకోణం?

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష భాజపా, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ అనుమతి మంజూరుచేయడాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీల మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్‌ గహ్లోత్‌ కొమ్ముకాస్తున్నారని నిందించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్‌ మారారని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News