మరో జైలుకు కన్నడ నటుడు దర్శన్.. కారణమేంటి?

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌ను మరో జైలుకు తరలించేందుకు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు.

Update: 2024-08-27 11:08 GMT

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను మరో జైలుకు తరలించేందుకు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మంగళవారం తెలిపారు. ప్రస్తుతం దర్శన్‌ పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో ఉన్నారు. జైలు ఆవరణలో దర్శన్‌ రౌడీషీటర్‌తో సహా మరో ముగ్గురితో కలిసి తిరుగుతున్న ఫొటో ఆదివారం సోషల్ మీడియాలో వైరలైంది. దర్శన్‌ కుర్చీపై కూర్చుని సిగరెట్ తాగుతూ.. కాఫీ మగ్‌ చేతపట్టుకుని కనిపించాడు. వీడియో కాల్‌లో దర్శన్ మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో జైళ్ల వ్యవస్థలను సమీక్షించేందుకు ఐపీఎస్ అధికారిని నియమించినట్లు హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. దర్శన్‌ను మరో జైలుకు తరలించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

"దర్శన్‌ను మరో కోర్టుకు తరలించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఇతర అధికారులతో సంప్రదించి జైలు అధికారులే నిర్ణయం తీసుకుంటారు. వారు (దర్శన, సహ నిందితులు) విచారణలో ఉన్నందున కొన్ని నిబంధనలు ఉన్నాయి. దాని ఆధారంగా అధికారులు నిర్ణయిస్తారు." అని పరమేశ్వర విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారులు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా.. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

జైలు చీఫ్ సూపరింటెండెంట్‌ సస్పెండ్..

జైలు అధికారులు దర్శన్‌కు రాచ మర్యాదలు చేశారన్న వార్తలపై ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. పరప్పన అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్‌తో సహా తొమ్మిది మంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. జైళ్ల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద దర్శన్‌పై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జైలులో కొన్ని లోపాలు ఉన్నాయని పేర్కొన్న పరమేశ్వర.. ఖైదీలను ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌కు తరలించడానికి అనుమతించారని, అది సీసీ టీవీలో రికార్డయ్యిందని చెబుతూ సదరు జైలు అధికారులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. దర్శన్, ఆయన బృందానికి కుర్చీలు, కాఫీ, సిగరెట్లు సరఫరా చేసిన జైలు సిబ్బందిని సస్పెండ్‌ చేశాం’’ అని మంత్రి చెప్పారు.

జైళ్లలో సంస్కరణల కోసం గతంలో సమర్పించిన నివేదిక గురించి తాను తెలుసుకున్నానని మంత్రి చెప్పారు. ‘మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సమర్పించిన పోలీసు, జైలు సంస్కరణలపై జాతీయ స్థాయి నివేదిక ఉంది. దాని ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని పరమేశ్వర తెలిపారు.

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి ఇతర ఉన్నత ఖైదీలకు కూడా "రాయల్ ట్రీట్‌మెంట్" ఇస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. దర్శన్ ఘటన తర్వాత జైలులోని అన్ని వ్యవస్థలను సమీక్షిస్తామని, దీని కోసం ఒక ఐపిఎస్ అధికారిని నియమించామని చెప్పారు. దోషులను చట్టం శిక్షించి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు.

రేణుకాస్వామిని ఎందుకు హత్య చేశారు?

సినీనటుడు దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపాడు. దర్శన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, పవిత్ర గౌడ, ఆయన సహచరులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. 

Tags:    

Similar News