మెరీనా బీచ్ లో ‘ఐఏఎఫ్’ విన్యాసాల మెరుపులు

ఆకాశం నుంచి దూసుకుపోతున్న విమానం నుంచి గరుడ్ కమాండో లు ఒక్కసారిగా పై నుంచి దూకారు. గాల్లోని రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ బందీలు ఉన్న ప్రాంతం మీద దిగారు.

By :  491
Update: 2024-10-06 11:47 GMT

భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన విన్యాసాలు చెన్నై వాసులను మది దోచుకున్నాయి. మద్రాస్ లోని ప్రఖ్యాత మెరీనా బీచ్ వద్ధ ఈ ప్రదర్శన నిర్వహించారు. వైమానిక దళ విన్యాసాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ల తో పాటు అనేక రకాల పోరాట హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయి.

మంత్రముగ్ధులైన ప్రేక్షకులు..
వైమానిక విన్యాసాలను చెన్నైలోని మెరీనా బీచ్ ఇసుకలో గుమిగూడారు, మండుతున్న ఎండ నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటూనే, ఐఏఎఫ్ ప్రదర్శించిన విన్యాసాలను తిలకించారు. ఉదయం 11 గంటలకు ఎయిర్ ప్రారంభం అయింది.
విన్యాసాల్లో భాగంగా మొదట గరుడ్ ఫోర్స్ కమాండోలు బందీలను విడిపించే విన్యాసాలను చేశారు. విమానం నుంచి జంప్ చేసిన పారా కమాండోలు లక్ష్య ప్రాంతంపై కచ్చితత్వంతో దిగారు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి పారా కమండోలు ప్రదర్శించిన విన్యాసాలను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
లైట్‌హౌస్, చెన్నై పోర్ట్ మధ్య మెరీనాలో జరిగిన 92వ IAF దినోత్సవ వేడుకలను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, చెన్నై మేయర్ ఆర్. ప్రియా ఇతర పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
స్పష్టమైన నీలాకాశం, కింద విశాలమైన సముద్రం మంచి వ్యూతో ప్రేక్షకులు క్షణం కూడా చూపుతిప్పుకోలేని విధంగా ఐఏఎఫ్ విన్యాసాలు జరిగాయి. ప్రేక్షకులు ఓ వైపు గొడుగులు పట్టుకొని, మరో వైపు తమ మొబైల్ లో వాటిని చిత్రీకరించారు. ఇలా మధ్యాహ్నం ఒంటి గంటకు విన్యాసాలు జరిగాయి.
రికార్డు ప్రదర్శన
ఈ విన్యాసాల్లో 72 ఎయిర్ క్రాప్ట్ లను ఐఏఎఫ్ ఉపయోగించింది. దీనితో ఈ ఎయిర్ షో రికార్డు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చేరినట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌లు రాఫెల్‌తో సహా దాదాపు 50 విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా, హార్వర్డ్, తేజస్, SU-30, సారంగ్ కూడా వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. సుఖోయ్ సు-30 ఫైటర్ జెట్ "లూప్-టంబుల్-యా" విన్యాసాన్ని ప్రదర్శించింది. ఇందులో ఈ ఫైటర్ జెట్లు నిప్పులను కురిపించాయి.
ట్రైనింగ్ ఇచ్చే సూర్యకిరణ్ ఎయిర్ క్రాప్ట్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు విన్యాసాలు ప్రదర్శించింది.దేశ గర్వం, దేశీయంగా తయారు చేయబడిన అత్యాధునిక లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచంద్ కూడా 21 సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలో జరిగిన వైమానిక ప్రదర్శనలో పాల్గొంది. ‘‘ సాక్ష్యం, సశక్త, ఆత్మ నిర్భరత’’ పేరుతో జరిగిన ఈ విన్యాసాలు దేశ రాజధాని వెలుపల తొలిసారిగా మద్రాస్ లో జరిగాయి. అంతకుముందు సంవత్సరం ఐఏఎఫ్ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణీ సంగమం ప్రాంతంలో నిర్వహించారు. అలాగే అంతకుముందు సంవత్సరం కేంద్ర పాలిత ప్రాంతం చంఢీగఢ్ లో జరిగాయి.
గ్రాండ్ ఫినాలే అద్భుతమైన వైమానిక విన్యాసాన్ని ప్రదర్శించిన సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శన బృందం ఉత్కంఠభరితంగా సాగింది. రాఫెల్ ఆకాశం అంతటా తిరుగుతూ, ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిచింది. అలాగే పురాతన డకోటా విమానాలు సైతం విన్యాసాల్లో పాల్గొన్నాయి. 


Tags:    

Similar News