‘‘మీ దు:ఖాన్ని నేను ఎన్నటికీ పూడ్చలేను’’
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను రిసార్ట్ లో పరామర్శించిన నటుడు, టీవీకే విజయ్
By : Praveen Chepyala
Update: 2025-10-28 09:42 GMT
టీవీకే అధినేత, నటుడు విజయ్ సోమవారం కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను చెన్నై సమీపంలోని ఓ రిసార్ట్ లో కలిశాడు. వారిని చూడగానే నటుడు బాధతో కుప్పకూలినట్లుగా కొన్ని వర్గాలు ది ఫెడరల్ కు తెలిపాయి. ఈ రిసార్ట్ లోకి మీడియా ప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వలేదు.
బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటానని ఆయన హమీ ఇచ్చారు. తనను ఇంట్లో ఒకడిగా భావించాలని, చదువు, వివాహాలు, ఉద్యోగం, ఇతర పనుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వాగ్థానం చేశారు.
గత నెల 27 విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో పసిపిల్లలు, ఆడవారితో సహ 41 మంది మరణించారు. ఈ దుర్ఘటన తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఘోర విషాదంగా నమోదైంది. దీనిపై రాజకీయ విమర్శలు చెలరేగాయి.
నన్ను క్షమించండి: విజయ్...
రిసార్ట్ వరకూ 30 కుటుంబాలు వచ్చాయి. వీరి కోసం కరూర్ నుంచి మామల్లపురం వరకూ ప్రత్యేక రవాణా వసతులు ఏర్పాటు చేశారు. బాధితుల బసను టీవీకే పార్టీ భరించింది. అక్టోబర్ 26 నుంచి హోటల్ లో మొత్తం 46 గదులను టీవీకే ముందస్తుగా బుక్ చేసుకుంది.
ప్రతి బాధిత కుటుంబంతో విజయ్ దాదాపు 30 నిమిషాలు గడిపినట్లు తెలిసింది. వారి బాధలను శ్రద్ధగా వింటూ, వారి బాధను పంచుకున్నాడని కొన్ని వర్గాలు తెలిపాయి.
‘‘మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చినందుకు క్షమించండి’’ అని ఆయన చెప్పినట్లు సమాచారం. ముందు ఆయన మోకాళ్లపై పడి వారి కష్టాలకు క్షమాపణ కోరారు. ‘‘మీ దు:ఖాన్ని నేను ఎన్నటికి పూడ్చలేను’’ అని ఆయన చెప్పారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విషాదంలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఒక తండ్రి ఆ బాధాకరమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘విజయ్ సార్ మాతో అరగంటకు పైగా మాట్లాడారు. మమ్మల్ని పట్టుకుని ఏడ్చారు. మాకు ఏమి కావాలో అడుగుతున్నాడు.
నా పిల్లలు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని నేను అతనికి చెప్పాను. వారు విజయ్ ను చూడటానికి ప్రయత్నించే సమయంలో మరణించారు. కానీ కోరిక ఒకటే. అది అతను నెరవేర్చాడు. నా పిల్లలు విజయ్ ఫొటో పట్టుకున్న ఫొటో ఉంది. అదే నేను వీడియో కాల్ ద్వారా కోరింది’’ అని దు:ఖిస్తున్న తండ్రి చెప్పాడు.
బాధిత కుటుంబాలను ఆపడానికి డీఎంకే ప్రయత్నం..
కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి బాధిత కుటుంబాలను చెన్నైకి రాకుండా ఆపడానికి డీఎంకే ప్రయత్నించిందని, కొన్ని కుటుంబాలకు నగదు ఆశ కూడా చూపిందని టీవీకేలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
‘‘స్థానిక డీఎంకే నాయకులు మమ్మల్ని సంప్రదించారు’’ అని ఒక బాధిత బంధువు తమతో చెప్పినట్లు వారు వెల్లడించారు. ‘‘విజయ్ తో జరిగిన సమావేశానికి హాజరైనందుకు తాము చింతిస్తున్నట్లు వారు చెప్పారు’’
కరూర్ బాధితులను పరామర్శించడానికి విజయ్ గతంలో ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ప్రస్తుతం విజయ్ కరూర్ కు దూరంగా చెన్నైకి దగ్గర రిసార్ట్ ను ఎంచుకుని బాధిత కుటుంబాలను కలవడం అతని రాజకీయ వ్యూహం గురించి మరోసారి చర్చలను మరోసారి రేకెత్తించింది.
తాను అమితంగా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి జే. జయలలిత మాదిరిగానే విజయ్ కూడా విపత్తు జరిగిన ప్రదేశాన్ని నేరుగా సందర్శించకుండా ఓ నియంత్రిత ప్రదేశంలో ఎంచుకున్నారని రాజకీయ పరిశీలకులు అన్నారు.
డీఎంకే విమర్శలు..
నటి నుంచి రాజకీయ నేతగా మారిన జయలలిత, ఇలాంటి వాతావరణంలో నాటకీయాలను పక్కన పెట్టి, క్రమశిక్షణతో అధికారిక సందేశాల ద్వారా తరుచుగా సందేశాలు పంపేవారు. ఆమె తమిళ ప్రజల మద్దతును పొందారు.
విజయ్ ఇంకా రాజకీయాలలో ప్రారంభ దశలోనే ఉన్నారు. ఆయన చివరి చిత్రం జననాయగన్ వచ్చే ఏడాది విడుదల కానుంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అట్టడుగు వర్గాల వారికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. దీనికి విరుద్దంగా విజయ్ శైలి ఎవరికి అందకుండా దూరంగా ఉందని కొంతమంది విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ.. ‘‘బాధిత ప్రజలు విజయ్ ఇంటికి వచ్చి ఆయనను కలుస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి వారి గురించి విచారించి, శాంతింపజేసే మర్యాద విజయ్ కు లేదు.
విజయ్ రాజకీయాలు వేరు. ఆయన ఇంటి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రజల వద్దకు వెళ్లాలని అనుకోవడం లేదు’’ అని ఆయన విమర్శలు చేశారు. ప్రజా ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే ఈ మరణాలకు కారణమని తొక్కిసలాటకు విజయ్ బాధ్యత వహించాలని ఎలంగోవన్ అన్నారు.
పార్టీ తన వ్యవస్థాగత కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్దంగా ఉందని టీవీకే సీనియర్ నాయకుడు ఒకరు ఫెడరల్ కు చెప్పారు. బాధితుల బంధువులతో విజయ్ సమావేశం తరువాత పార్టీ రాజకీయ అడుగులు వేసే ముందు దానికి అవసరమైన ముగింపును అందిస్తుంది.