'హెచ్ఏఎల్ మాకు గర్వకారణం..అది ఎక్కడికీ పోదు’
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్;
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి-మడకశిర ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) మంగళవారం (మే 27) మీడియాతో మాట్లాడారు. "ఇక్కడి HAL తరలింపును అంగీకరించం" అని పేర్కొన్నారు. హెచ్‌ఎఎల్‌కు కర్ణాటక ప్రభుత్వం తుమకూరు, బెంగళూరులో భూమి కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూనే..దాని విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
‘కర్ణాటకకు గర్వకారణం HAL’
HAL కర్ణాటకకు గర్వకారణం అంటూ..“బీదర్‌లో ఒక HAL యూనిట్ ఉంది, బెంగళూరులోనూ మరొకటి ఉంది. బెంగళూరులోనే మాకు రెండు HAL విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి యలహంకలో, మరొకటి HALలో,” అని డీకే వివరించారు.
పలువురు మంత్రుల అభ్యంతరం..
హెచ్‌ఏఎల్‌ను ఆంధ్రకు తరలించాలన్న చంద్రబాబు కోరికపై పలువురు కర్ణాటక మంత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబి పాటిల్, రవాణా మంత్రి రామలింగారెడ్డి కూడా హెచ్‌ఎఎల్ తరలింపు ఆలోచనను తోసిపుచ్చారు. చంద్రబాబు ఆంధ్రలో ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని కోరవచ్చు. కానీ హెచ్‌ఎఎల్‌ను పూర్తిగా ఆంధ్రకు తరలించాలని కోరడం మంచిందికాదన్నారు.