కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారా?

పార్టీలో సన్నిహితుల నుంచి రాహుల్ గాంధీ నివేదిక కోరారా? పార్టీ హై కమాండ్ ఖర్గే ఏమన్నారు?

Update: 2025-11-26 13:12 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారన్న విషయాలను తెలుసుకునేందుకు తన సన్నిహితుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, హర్యానా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ రాహుల్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) కూడా ఈ విషయంలో రాహుల్‌కు ఒక నివేదికను సమర్పించారు.


అంతర్గత కుమ్ములాటపై రాహుల్ ఆందోళన..

ముఖ్యమంత్రి మార్పుపై సీఎం, డిప్యూటీ సీఎం అనుచరులు తరుచుగా ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్ పెద్దలను కలవడం పార్టీ ప్రతిష్టను ప్రమాదంలో పడేస్తుందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాయకత్వ మార్పు కోసం ఎమ్మెల్యేల సంతకాలను సేకరించిన డీకే శివకుమార్‌పై రాహుల్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.


జార్కిహోళితో డీకే రహస్య సమావేశం?

మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్‌లో డీకే శివకుమార్ సతీష్ జార్కిహోళికి రహస్యంగా సమావేశమై సిద్ధరామయ్యను ఒప్పించాలని కోరినట్లు సమాచారం. "సిద్ధరామయ్య ఇప్పటికే రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్నారు. పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఆయనను మీరు ఒప్పించాలి" అని శివకుమార్ జార్కిహోళిని కోరినట్లు సమాచారం.


ఖర్గే ఏమన్నారు?

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమాధానమిస్తూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత దానికి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.


లోపాయికారి ఒప్పందంలో భాగమేనా?

2023లో పార్టీ గెలిచాక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య, డికె శివకుమార్ పోటీ పడినట్లు సమాచారం. సిద్ధరామయ్య రెండున్నరేళ్లు, ఆ తర్వాత రెండున్నరేళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఇద్దరి మధ్య

లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లు గతంలో వార్తలొచ్చాయి. నవంబర్ 20 వతేదీ నాటికి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో అధికార మార్పిడిపై ఊహాగానాలు ఓపందుకున్నాయి.


డీకే అనుచరులు ఢిల్లీకి వెళ్లడాన్ని సమర్థిస్తారా?

డీకే శివకుమార్ ఢిల్లీ ప్రయాణాన్ని శాసనసభ్యులు సమర్థిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. "వారిని వెళ్లనివ్వండి. ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉంది. అంతిమంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి నేను కట్టుబడి ఉంటాను,’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News