కర్ణాటక: అంతర్గత కలహాలపై ‘బొమ్మై’ అసంతృప్తి

కాంగ్రెస్ పై పోరాటంలో విఫలం అవుతున్నామని ఒప్పుకోలు;

Update: 2025-02-06 12:58 GMT

కర్ణాటక బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత కలహాలపై బీజేపీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలు ఓపికగా ఉండాలని, విభేదాలను పరిష్కరించుకోవాలని, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో ముందుకు నడవాలని సూచించారు.

పార్టీ సీనియర్ నాయకులు, పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై దృష్టి సారిస్తుందని ముఖ్యనాయకులందరితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘ రాష్ట్రంలో దుష్ట కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. హింస, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటిపై ప్రతిపక్షంగా సమర్థవంతంగా పోరాడాల్సిన పార్టీ క్రమంగా అంతర్గత కలహాలను ఎదుర్కొంటోంది’’ అని బొమ్మై ఒక ప్రకటనలో తీవ్ర అసంతృప్తి ఎదుర్కొన్నారు.
బీ వై విజయేంద్ర కేంద్రంగా..
పార్టీలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు ఎమ్మెల్యే విజయేంద్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన నాయకత్వం పై పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది.
ఓ వర్గం ఆయన పార్టీని నడపడంలో విఫలం అవుతున్నారని ఆరోపిస్తుండగా, ఆయన వర్గం మాత్రం వారంతా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని బహిరంగంగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇది పార్టీపై ప్రజల్లో చులకన భావనగా కలగడానికి కారణమవుతుందని పార్టీలోని అధినాయకత్వం భావిస్తోంది.
బీవై విజయేంద్ర పై బీజాపూర్ ఎమ్మెల్యే బసన గౌడ, గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆయన అధికార కాంగ్రెస్ తో కుమ్మకై రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు.
విజయేంద్ర 2023 లో పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆరంభం నుంచే ఆయన నాయకత్వం పై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీలో జరిగే గ్రూపులను ఆయన అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీని అదుపులో ఉంచడానికి ఆయన తండ్రి సాయంతో ఎత్తులు వేస్తున్నారని మరికొంతమంది సీనియర్ నాయకులు బీఎస్ యడ్యూరప్ప పై కూడా విమర్శలు ఇస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ దేశ వ్యాప్తంగా సమర్థవంతమైన పాలన అందిస్తోందని కేంద్ర నాయకత్వం నిర్ణయాలే అంతిమమని బొమ్మై ఉద్ఘాటించారు. తాను వర్గపోరును నమ్మనని స్పష్టం చేశారు.
తాను ఏ గ్రూపును ప్రత్యేకంగా పిలిచి మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. అందరిని ఏకతాటిపైకి తీసుకురావడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్న నాయకులలో నేను ఒకడినని అన్నారు.
బొమ్మై ఇంతకుముందు యత్నాల్, జార్కిహోళి వంటి ఇతర నాయకులతో ఢిల్లీలో చర్చలు జరిపారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బొమ్మై ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహ కర్ణాటకలోని సీనియర్ బీజేపీ నాయకుల మార్గదర్శకత్వంలో రెండు వర్గాలు ఓపికగా ఉండి చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని బొమ్మై కోరారు.


Tags:    

Similar News