వేయి కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిపిన ‘ఎంపురాన్’ నిర్మాత గోపాలన్
సోదాలు నిర్వహిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ల;
By : Praveen Chepyala
Update: 2025-04-04 10:52 GMT
‘ఎల్2 ఎంపురాన్’ సినిమా నిర్మాతలలో ఒకరైన కేరళకు చెందిన వ్యాపారవేత్త గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీ ప్రాంగణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వేయి కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు శుక్రవారం అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్ఈఎంఏ) నిబంధనల ప్రకారం చెన్నై, కొచ్చిలతో సహ వివిధ రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.
గోపాలన్ కు చెందిన కంపెనీ ‘శ్రీ గోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటేడ్’ పై కొంతమంది ఎన్ఆర్ఐలతో వేయి కోట్ల మేర అనుమానస్పద లావాదేవీలు జరిపినట్లు తేలడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోదాలు ప్రారంభించింది. మనీలాండరింగ్ నేపథ్యంలో కంపెనీపై ఉన్న కేసుల వివరాలను సైతం ఈడీ విశ్లేషిస్తున్నట్లు తేలింది.
24 కట్స్ తో సినిమా విడుదల..
ఎంపరాన్ సినిమా పూర్తిగా హిందువులను కించపరిచే సన్నివేశాలతో నింపివేయడంపై ఆ వర్గం వారు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడులోని ముల్ల పెరియార్ డ్యామ్ విషయంలో కేరళకు అనుగుణంగా వాదనలు వినిపించడంపై అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో సినిమా దర్శకనిర్మాతలు వివాదాస్పద సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించి విడుదల చేశారు. అలాగే విలన్ గా హిందువు పేరును వాడటంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
అతని పేరును బాల్ రాజ్ బజరంగీ నుంచి బాల్ దేవ్ గా మార్చారు. చిత్రం నుంచి కృతజ్ఞతలు అనే దానికింద కేంద్రమంత్రి సురేష్ గోపి పేరును జతచేయగా, తాజాగా దానిని కూడా తొలగించారు.
సినిమాలో ఉన్న పలు సంభాషణలు తొలగించడమే, పూర్తిగా మ్యూట్ చేయడమే చేశారు. ముఖ్యంగా ఒక మత చిహ్నాలు, వారి దేవుళ్లను కించపరిచే వాటిని తొలగించాల్సి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థను కూడా నెగటివ్ కోణంలో చూపించడంతో ఆ సంభాషణలను మ్యూట్ చేశారు.
సినిమా ప్రారంభంలో ఒక వ్యక్తి, వేరే వర్గం వాళ్లను ఏదో అకారణంగా నరికి చంపాడనే, మహిళలను హింసించడం, చిన్నపిల్లలపై దయచూపకపోవడం వంటి అంశాలను కూడా పూర్తిగా తొలగించారు. ఈ చిత్రంలో మంత్రి పాత్రలో నటించిన నటుడు నందు చెప్పిన సంభాషణలను కూడా పూర్తిగా తొలగించారు.
ఈ సినిమా పూర్తిగా వివాదంగా మారిన తరుణంలో నటుడు మోహాన్ లాల్ స్పందించాల్సి వచ్చింది. తాను ఏ మతానికి వ్యతిరేకంగా కాదని, ఇకముందు ఇలాంటి పాత్రలను ఎంచుకునే ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామనని ప్రకటించారు.
నిర్మాతలు..
‘ఎల్2: ఎంపురాన్’ సినిమా నిర్మాత ఆంటోని పెరుంబవూర్ మాట్లాడుతూ... సినిమాలోని రెండు నిమిషాలకు పైగా సన్నివేశాలు తొలగించామని అన్నారు.
కొచ్చిలో మంగళవారం ఆయన విలేకరులుతో మాట్లాడుతూ ఈ మేరకు చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాల తొలగింపుపై వివరణ ఇచ్చారు. సినిమాలోని పలు సన్నివేశాల తొలగింపు అనేది ఎవరికో భయపడి జరగలేదని, కథానాయకుడు మోహాన్ లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అందరి నిర్మాతల ఏకాభిప్రాయంతోనే జరిగిందని చెప్పారు.
‘‘భయపడే ప్రశ్నే లేదు. మనం సమాజంలో జీవిస్తున్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా మేము ఎప్పుడూ ఏమి చేయాలనుకోలేదు. ఎవరైనా సినిమా పట్ల అసంతృప్తిగా ఉంటే నిర్మాతలు, దర్శకులు, నటుడిగా ఫిర్యాదును పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు. మేమంతా కలిసి ఈ నిర్ణయానికి వచ్చాము. దాదాపు రెండు నిమిషాల కొన్ని సెకన్ల సన్నివేశాలు, సంభాషణలు తొలగించామని ప్రకటించారు.