కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పై మనీలాండరింగ్ కేసు ?

ముడా స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఇప్పటికే లోకాయుక్త కేసు నమోదు చేయగా, ఆయన మనీలాండరింగ్ కేసు నమోదు చేయడానికి ఈడీ ..

By :  491
Update: 2024-09-30 11:59 GMT

ముడా స్కామ్ ఆరోపణలో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కష్టాలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై, భూములు స్వీకరించిన ఆయన భార్య పార్వతిపై ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రతిపక్ష బీజేపీకి మరో ఆయుధం దొరికినట్లే అవుతుంది. ఆ పార్టీ ఇప్పటికే సీఎం పదవి నుంచి సిద్థరామయ్య రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) రోజు చివరిలోగా లేదా రేపటిలోగా నమోదు కావచ్చని కొన్ని మూలాలను ఉటంకిస్తూ వార్తా నివేదికలు తెలిపాయి. ఈ కేసులో కర్ణాటక లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు..
కర్ణాటక లోకాయుక్త పోలీసులు శుక్రవారం (సెప్టెంబర్ 28) కర్ణాటక సీఎంతో పాటు మరో ముగ్గురిపై, అతని భార్య బీఎం పార్వతి, అతని బావ మల్లికార్జున స్వామి, మాజీ భూ యజమాని దేవరాజుపై అవినీతి, మోసం, ఫోర్జరీ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. 2021లో అతని భార్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 14 హౌసింగ్ సైట్‌లను కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, ఈ కేసులో ఫిర్యాదుదారు, ఆర్‌టిఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ కూడా తదుపరి చర్య కోసం ఈడీని ఆశ్రయించారు.
ఈడీ కదలికలు
అయితే, కేంద్ర ఏజెన్సీ వద్ద ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ వివరాలు, సంబంధిత కేసు విషయాలు ఉన్నాయని, కేసుపై ముందుకు కదులుతున్నట్లు ఏజెన్సీ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ నేరాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయని, అవసరమైన లాంఛనాలను పూర్తి చేసిన వెంటనే కేసు నమోదు చేస్తామని అధికారి తెలిపారు. ఇటీవలి కాలంలో ఈడీ ద్వారా కేసు బుక్కైన మూడో సీఎం సిద్ధరామయ్య. గతంలో ఈడీ దాఖలు చేసిన కేసులకు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను అరెస్ట్ చేశారు. చాలా నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత ఇద్దరికీ ఇటీవలే బెయిల్ మంజూరైంది.
సిద్ధరామయ్య కేసులో, సెప్టెంబర్ 24న, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీఎంపై కేసులు పెట్టేందుకు ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆమోదాన్ని హైకోర్టు సమర్థించడంతో కేసు కీలకమలుపు తిరిగింది.
ఆరోపణలు ఏంటీ?
ముడా పథకంలో భాగంగా 50:50 భూ మార్పిడి పథకం ద్వారా లబ్ధి పొందారని కర్ణాటక సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణ. ఆరోపణ ప్రకారం, మైసూరు వెలుపల 3.16 ఎకరాల భూమిని సిద్ధరామయ్య భార్యకు ఆమె సోదరుడు 2010లో బహుమతిగా ఇచ్చాడు. అయితే మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూసేకరణలో భాగంగా ఆ ల్యాండ్ తీసుకుని ఖరీదైన ప్రాంతంలో 14 ఇళ్ల స్థలాలు కేటాయించారు.
అక్రమ భూ మార్పిడి వల్ల రాష్ట్రానికి ₹56 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేసిన కార్యకర్తలు గవర్నర్‌ను, ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో తనను అధికారం నుంచి దింపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సిద్ధరామయ్య ఆరోపణలను కొట్టిపారేశారు. కాగా, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నప్పటికీ, తాము సీఎంకు మద్దతిస్తున్నామని, ఆయనకు అండగా ఉంటామని కాంగ్రెస్ చెబుతోంది.



Tags:    

Similar News