‘ముడా స్కామ్’ లో సీఎం సిద్ధరామయ్య కుమారుడే కీలక సూత్రధారా?
తాజాగా 300 కోట్ల ఆస్థులను అటాచ్ చేసిన ఈడీ;
By : Praveen Chepyala
Update: 2025-01-18 05:22 GMT
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న ముడా స్కామ్ కేసు విచారణలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అయితే తాజాగా ఇందులో ఆయన కుమారుడు, ఎంఎల్ఏ యతీంద్ర పేరు తెరపైకి వచ్చింది. అసలు కుంభకోణానికి సూత్రధాని యతీంద్ర అని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
తాజాగా ఆ కుంభకోణంలో అక్రమంగా ఫ్లాట్ లు పొందిన 142 సైట్లను ఈడీ అటాచ్ మెంట్ చేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపుగా రూ. 300 కోట్లుగా ఉంది. ఈ ప్లాట్లు అన్ని కూడా రియల్ ఎస్టేట్స్ ఏజంట్స్, బిజినెస్ మేన్ ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రిజిస్టర్ అయి ఉన్నాయి.
దాదాపు 700 కోట్లు చేతులు మారాయి: ఈడీ
మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూ కేటాయింపులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేటాయించిన 1059 ప్లాట్లు అన్ని 50:50 నిష్పత్తిలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేశారని వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 700 కోట్లుగా ఉందని పేర్కొంది.
ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిని పొంది తరువాత భారీ లాభాలతో అమ్మి సొమ్ము చేసుకున్నారని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద 14 ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఇవన్నీ అక్రమంగా కేటాయించుకున్నవే అని విచారణ లో తేలింది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రికార్డులు మార్చివేసి మరీ కేటాయించినట్లు తేలింది.
లోకాయుక్త ఆదేశాలు..
మైసూర్ లో కేటాయించిన భూమిలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు లోకాయుక్తను ఆశ్రయించారు. దానితో సిద్దరామయ్య, ఆయన భార్య ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడం, మనీలాండరింగ్ వంటి అంశాలు ఉండటంతో నేరుగా ఈడీ రంగంలోకి దిగింది. కర్నాటక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఆక్ట్, బినామీ ఆక్ట్ కింద కేసులు స్థానిక కోర్టులో నమోదు అయ్యాయి.
సిద్దరామయ్య కొడుకు మీద సైతం..
ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది సీఎం కుమారుడు ఎంఎల్ఏ యతీంద్ర అని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అమ్మ అయిన పార్వతి పేరు మీద అక్రమంగా ఫ్లాట్ల కేటాయింపులు జరపడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చారని తెలుస్తోంది. అలాగే మరో 252 సైట్లు కూడా ఎలాంటి పత్రాలు, అనుమతి లేకుండా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంలో చక్రం తిప్పారని ముడా అధికారులు దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు.
తరువాత వీటిని భారీ లాభాలకు అమ్మి వాటిని వివిధ మార్గాల్లో సొంత ఆస్థిగా మలుచుకున్నారని ఈడీ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. అన్ని నిబంధనలు ఉల్లంఘించడానికి తన అధికారులను సీఎంఓ కేంద్రంగా నడిపారని బీజేపీ ఆరోపణ. తరువాత ఆయన రాజకీయాల్లోకి దిగి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు